Revised Common Lectionary (Complementary)
తేత్
65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
27 “చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒక సామాన్యుడు పొరబాటున చేయటం తటస్థించవచ్చు. 28 అతడు తన పాపాన్ని గుర్తించినట్లయితే ఏదోషం లేని ఒక ఆడ మేకను అతడు తీసుకొని రావాలి. అది ఆ వ్యక్తి అర్పణ. అతడు చేసిన పాపం నిమిత్తం అతడు ఆ మేకను తీసుకొని రావాలి. 29 అతడు దాని తల మీద తన చేతిని ఉంచి, దహనబలి స్థలంలో దానిని వధించాలి. 30 అప్పుడు యాజకుడు ఆ మేక రక్తంలో కొంచెం తన వేలితో తీసుకొని, దహనబలిపీఠం కొమ్ములకు దానిని పూయాలి. ఆ మేక రక్తాన్నంతా బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. 31 తర్వాత సమాధాన బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు.
14 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 15 “యెహోవా పవిత్ర విషయాలకు వ్యతిరేకంగా ఒకడు పొరబాటున ఏదైనా తప్పు చేయవచ్చును. అప్పుడు అతడు ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలో నుండి తీసుకొని రావాలి. ఇది యెహోవాకు అతని అపరాధ పరిహారార్థ బలి అర్పణ. పవిత్ర స్థానపు అధికారిక కొలత ప్రకారం ఆ పొట్టేలుకు నీవు ధర నిర్ణయించాలి. 16 పవిత్ర విషయానికి విరుద్ధంగా అతడు చేసిన పాపానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ధరకు అయిదో వంతు అతడు కలపాలి. ఈ మొత్తాన్ని అతడు యాజకునికి ఇవ్వాలి. ఈ విధంగా అపరాధ పరిహారార్థ బలి పోట్టేలుతో ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
దేవుని కోసం జీవించండి
11 ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 12 యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు.
పరిపాలకుల పట్ల, అధికారుల పట్ల వినయం
13 మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, 14 లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పుచేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవటానికి పంపించాడు. 15 మీరు మంచి పనులు చేసి, అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళను కట్టి వేయాలని దేవుని కోరిక. 16 స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి. 17 అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి.
© 1997 Bible League International