Revised Common Lectionary (Complementary)
హే
33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.
ఇశ్రాయేలుకు కావలివానిగా దేవుడు యెహెజ్కేలును ఎంపిక చేయటం
33 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, నీ ప్రజలతో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పు, ‘ఈ దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. అది జరిగినప్పుడు ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక చేస్తారు. 3 ఈ కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు. 4 ప్రజలు ఆ హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు. 5 అతడు బాకా విన్నాడు. అయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్యపెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడుకొనగలిగేవాడు.
6 “‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’
29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!
33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.
35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.
© 1997 Bible League International