Revised Common Lectionary (Complementary)
హే
33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.
యెహెజ్కేలు భార్య మరణం
15 పిమ్మట యెహోవా సందేశం నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 16 “నరపుత్రుడా, నీవు నీ భార్యను మిక్కిలి ప్రేమిస్తున్నావు. కాని ఆమెను నీనుండి నేను తీసుకొనబోతున్నాను. నీ భార్య అకస్మాత్తుగా చనిపోతుంది. అయినా నీవు మాత్రం నీ విచారాన్ని వ్యక్తం చేయకూడదు. నీవు బిగ్గరగా ఏడ్వకూడదు. నీవు కన్నీళ్లు కార్చకూడదు. 17 కాని నీ వెక్కి ఏడ్పు శబ్దాలను బయటకు వినరానీయవద్దు. చనిపోయిన నీ భార్య కొరకు నీవు ఏడ్వవద్దు. నీవు మామూలుగా వేసుకొనే బట్టలనే ధరించాలి. నీ తలపాగా, నీ చెప్పులు ధరించుము. నీ విచారాన్ని వ్యక్తం చేయటానికి నీవు నీ మీసాలను కప్పివుంచవద్దు. సామాన్యంగా వ్యక్తులు మరణించినప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని నీవు తినవద్దు.”
18 మరునాటి ఉదయం దేవుడు చెప్పిన విషయాలను నేను ప్రజలకు తెలియజేశాను. ఆ సాయంత్రం నా భార్య చనిపోయింది. ఆ మరునాటి ఉదయం దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నేను అన్నీ చేశాను. 19 అప్పుడు ప్రజలు నాతో, “నీవిలా ఎందుకు చేస్తున్నావు? దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించారు.
20 అందుకు వారితో నేనిలా అన్నాను: “యెహోవా మాట నాకు విన్పించింది. 21 ఇశ్రాయేలు వంశంవారితో మాట్లడమని ఆయన నాకు చెప్పాడు. నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: ‘చూడండి, నేను నా పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తాను. మీరా స్థలాన్ని చూచి గర్వపడుతున్నారు. దానిని శ్లాఘిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ స్థలాన్ని చూడాలని మీరు ఉబలాట పడుతూ వుంటారు. మీరు నిజంగా ఆ స్థలమంటే ఇష్టపడుతూ వున్నారు. కాని నేనాస్థలాన్ని నాశనం చేస్తాను. మీరు మీ వెనుక వదిలిపెట్టిన మీ పిల్లలంతా యుద్ధంలో చంపబడతారు. 22 నేను చనిపోయిన నా భార్య విషయంలో ఏమి చేశానో, మీరు కూడా అలానే చేస్తారు. మీ దుఃఖాన్ని సూచించటానికి మీరు మీసాలను కప్పుకొనరు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సామాన్యంగా ప్రజలు తినే ఆహారాన్ని మీరు తినరు. 23 మీరు మీ తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు. 24 కావున యెహెజ్కేలు మీకు ఒక ఉదాహరణ. అతడు చేసినవన్నీ అలానే మీరూ చేస్తారు. ఆ శిక్షా కాలం సమీపిస్తున్నది. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’”
25-26 “నరపుత్రుడా, ప్రజల నుండి ఆ సురక్షిత ప్రాంతాన్ని (యెరూషలేమును) నేను తీసుకుంటాను. ఆ అందమైన స్థలం వారిని సంతోషపెడుతూ ఉంది. వారు దానిని చూడాలని కుతూహల పడుతూ వుంటారు. వారు నిజంగా ఆ స్థలమంటే బాగా ఇష్టపడుతున్నారు. ఆ నగరాన్ని, వారి పిల్లలను నేను వారినుండి తీసుకొంటాను. ఆ సమయంలో చావగా మిగిలిన వారిలో ఒకడు యెరూషలేమును గూర్చిన ఒక చెడువార్తను తీసుకొని వస్తాడు. 27 అప్పుడు నీవతనితో మాట్లాడ గలుగుతావు. ఇక నీవెంత మాత్రమూ మౌనంగా వుండవు. ఈ రకంగా నీవు వారికి ఒక ఉదాహరణగా ఉంటావు. నేను యెహోవానని అప్పుడు వారు తెలుసుకుంటారు.”
15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”(A)
16 కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?”(B) 17 తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది.
18 “వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది.
వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.”(C)
19 “ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు:
“జనాంగము కానివారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను
అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.”(D)
20 యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు:
“నా కోసం వెదకనివాళ్ళు నన్ను కనుగొంటారు.
నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.”(E)
21 కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు:
“అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న
ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.”(F)
© 1997 Bible League International