Revised Common Lectionary (Complementary)
హే
33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.
కుండ-మాంసం
24 నా ప్రభువైన యెహోవా మాట నాకు చేరింది. అది చెరలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ తేదీన జరిగింది. ఆయన ఇలా అన్నాడు, 2 “నరపుత్రుడా, ఈ రోజు తారీఖు వేసి, ఈ చీటీ వ్రాయి, ‘ఈ రోజు బబులోను రాజు సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది.’ 3 విధేయులు కావటానికి తిరస్కరించే ఇశ్రాయేలు తెగవారికి ఈ కథ చెప్పు. వారికి ఈ విషయాలు చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“‘పొయ్యిమీద కుండ పెట్టుము.
కుండ పెట్టి, అందులో నీరు పొయుము.
4 దానిలో మాంసం ముక్కలు వేయాలి.
మంచి ముక్కలు వేయాలి. తొడ మాంసం, జబ్బ మాంసం వేయాలి.
మంచి ఎముకలతో కుండ నింపాలి.
5 వీటి కొరకు మందలో వున్న మంచి జంతువులను (పశువులను) వాడాలి.
కుండ క్రింద బాగా కట్టెలు పేర్చు.
మాంసం ముక్కలను వుడకబెట్టు.
ఎముకలు కూడా వుడికేలా రసాన్ని కాగబెట్టు!
6 “‘నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పుతున్నాడు,
హంతకులున్న
ఈ నగరమునకు కీడు మూడింది.
తుప్పుమరకలున్న కుండలా యెరూషలేము ఉంది.
ఆ మచ్చలు తొలగింప బడవు!
కుండలో నుండి ప్రతి మాంసం ముక్కను బయటకు తీయుము.
ఆ మాంసాన్ని తినవద్దు! పాడైపోయిన ఆ మాంసం నుండి యాజకులను ఏమీ తీసుకోనివ్వద్దు.
7 యెరూషలేము ఆ తుప్పుపట్టిన కుండలా ఉంది.
ఎందువల్లననగా హత్యల రక్తం ఇంకా అక్కడ ఉంది!
రక్తాన్ని ఆమె రాళ్లమీద చిందించింది.
రక్తాన్ని ఆమె నేలపై పోసి దుమ్ముతో కప్పలేదు.[a]
8 నేనామె రక్తాన్ని రాతిబండమీద వుంచాను.
అందువల్ల అది కప్పబడదు.
చూచిన ప్రజలకు కోపం రావాలని, అమాయక ప్రజలను చంపినందుకు
వారామెను శిక్షించాలని నేనది చేశాను.
9 “‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు,
నరహంతకులతో నిండిన ఈ నగరానికి కీడు మూడింది!
నిప్పు రాజెయ్యటానికి నేను కట్టెలు బాగా పేర్చుతాను.
10 కుండ క్రింద కట్టెలు బాగా పేర్చు.
నిప్పు రాజెయ్యి.
మాంసాన్ని బాగా ఉడకనియ్యి!
మసాల దినుసులు కలుపుము.
ఎముకలు కాలిపోనిమ్ము.
11 పిమ్మట బొగ్గుల మీద ఖాళీ కుండను వుండ నిమ్ము.
దాని మచ్చలు కాలి మెరిసేలా దానిని వేడెక్కనిమ్ము.
దాని మచ్చలు కరిగిపోతాయి.
తుప్పు (కిలుము) రాలిపోతుంది.
12 “‘యెరూషలేము తన మచ్చలు మాపుకోటానికి
బాగా శ్రమించవచ్చు.
అయినా దాని “తుప్పు” పోదు!
కేవలం అగ్ని (శిక్ష) మాత్రమే ఆ తుప్పును పోగొడుతుంది.
13 “‘నీవు నాపట్ల పాపం చేశావు.
దానితో నీ చర్మం మాలిన్యమయ్యింది.
నిన్ను కడిగి శుభ్రపర్చాలను కున్నాను.
కాని నీ వంటిమీది మచ్చలు పోకుండెను
నీపట్ల నా తీవ్రమైన కోపం తీరేవరకు
నిన్ను కడిగే ప్రయత్నం మళ్లీ చేయను!
14 “‘నేనే యెహోవాను. నీకు శిక్ష విధింపబడుతుందని చెప్పాను. ఆది వచ్చేలా నేను చేస్తాను. నేను శిక్షను ఆపను. నిన్ను గురించి నేను విచారించను. నీవు చేసిన చెడు కార్యాలకు నేను నిన్ను శిక్షిస్తాను.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
కొరింథు ప్రజల విషయంలో చింత
11 నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. 12 అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను. 13 నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి.
14 ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు. 15 అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా?
16 అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. 17 నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా? 18 నేను తీతును మీ దగ్గరకు వెళ్ళమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు.
19 మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని మేము యివి చేస్తున్నాము. 20 ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. 21 నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.
© 1997 Bible League International