Revised Common Lectionary (Complementary)
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
నీవు సత్యాన్ని చూడగలవు.
3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
5 నేను నీ మార్గాలు అనుసరించాను.
నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
కనుక ఇప్పుడు నా మాట వినుము.
7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.
13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14 యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.
15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.
ప్రజలలో నమ్మిక మరియు దేవునిలో నమ్మిక
5 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు:
“ఇతర ప్రజలను నమ్మేవారికి
కీడు జరుగుతుంది.
బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడేవారికి
కష్ట నష్టాలు వస్తాయి.
ఎందువల్లనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మాని వేశారు.
6 ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు.
ఆ పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు.
ఆ పొద ఎండిన ఉష్ణ ప్రదేశంలో ఉంది.
ఆ పొద చవుడు భూమిలో ఉంది.
ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు.
7 కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు.
ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
8 నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె
ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు.
నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది.
దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి.
ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు.
ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.
9 “మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుండి.
మనస్సు చాలా వ్యాధిగ్రస్తమయ్యింది.
మానవ మనస్సును ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు.
10 కాని యెహోవానైన నేను
ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను.
వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను.
ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను.
11 ఒకానొక పక్షి తను గ్రుడ్లు పెట్టకుండానే
వేరే పక్షులు పెట్టిన గ్రుడ్లను పొదుగుతుంది.
డబ్బుకోసం ఇతరులను మోసం చేసే వాడుకూడా
అలాంటి పక్షిలాంటి వాడే.
వాని జీవితం సగంగడిచే సరికి
వాని ధనం పోతుంది.
తన జీవిత ఆఖరి (చివరి) దశలో వాడు
పరమ మూర్ఖుడై పోతాడనేది విదితమైన విషయం.”
12 ఆదినుంచీ మన దేవాలయం
ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది.
అది చాలా ముఖ్యమైన స్థలం.
13 యెహోవా, నీవు ఇశ్రాయేలీయులకు ఆశాజ్యోతివి.
దేవా, నీవు జీవజలధారలా ఉన్నావు!
ఆయనను విడిచిపెట్టిన వారు అవమానానికి గురవుతారు.
వారు అవమానించబడుతారు. జీవిత ప్రమాణం తగ్గిపోతుంది.[a]
యిర్మీయా మూడవ విన్నపం
14 యెహోవా, నీవు నన్ను బాగుచేస్తే
నేను నిజంగా స్వస్థపడతాను!
నన్ను రక్షిస్తే,
నేను నిజంగా రక్షింపబడతాను.
యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
15 యూదా ప్రజలు నన్ను ప్రశ్నలడుగుతూవుంటారు.
“యిర్మీయా, యెహోవా వర్తమానం ఎక్కడ?
ఆ వర్తమానం నెరవేరేలా చేయి!” అని వారంటారు.
16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారిపోలేదు.
నేను నిన్ను అనుసరించాను.
నీవు కోరిన విధంగా నేను గొర్రెలకాపరినయ్యాను.
ఆ భయంకరమైన రోజు రావాలని నేను కోరుకోలేదు.[b]
యెహోవా, నేను చెప్పిన విషయాలు నీకు తెలుసు.
జరుగుతున్నదంతా నీవు చూస్తూనే ఉన్నావు.
17 యెహోవా, నన్ను నాశనం చేయవద్దు.
కష్టకాలంలో నేను నిన్నాశ్రయిస్తాను.
18 ప్రజలు నన్ను హింసిస్తున్నారు.
వారిని సిగ్గుపడేలాచేయి.
కాని నాకు ఆశాభంగం కలుగచేయకుము.
ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము.
కాని నన్ను మాత్రం పారిపోనీయవద్దు.
ఆ భయంకరమైన దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము.
వారిని పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా భంగపర్చుము.
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మార్కు 3:20-30; లూకా 11:14-23; 12:10)
22 ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి. 23 ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు.
24 పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు.
25 వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది. 26 సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది? 27 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు. 28 ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా! 29 అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు. 30 నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు.
31 “అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు. 32 మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు.
© 1997 Bible League International