Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 18:1-3

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.

18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
    అతడీలాగన్నాడు.

యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
    నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
    ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.

యెహోవాకు నేను మొరపెడ్తాను.
    యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
    మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.

కీర్తనలు. 18:20-32

20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు.
    నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.
21 నేను యెహోవాను అనుసరించాను.
    నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు.
22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను.
    ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.
23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను.
    నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.
24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు.
    నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.

25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు.
    మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.
26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైనవాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైనవాడవు.
    కాని, గర్విష్ఠులను, టక్కరివాళ్లను నీవు అణచివేస్తావు.
27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు.
    కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.
28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు.
    నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను.
    నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.

30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం.
    ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు.
    మన దేవుడు తప్ప మరో బండ[a] లేదు.
32 దేవుడు నాకు బలం ఇస్తాడు.
    ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.

యెషయా 28:14-22

దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు

14 యెరూషలేములో ఉన్న నాయకులారా, యెహోవా సందేశం మీరు వినాలి. కానీ ఇప్పుడు ఆయన మాట వినడానికి మీరు నిరాకరిస్తున్నారు. 15 “మరణంతో మేము ఒక ఒడంబడిక చేసుకున్నాం. చావు స్థలం, పాతాళంతో మాకు ఒక ఒప్పందం ఉంది. కనుక మేము శిక్షించబడం. శిక్ష మమ్మల్ని బాధించకుండానే దాటి పోతుంది. మా మాయలు అబద్ధాల చాటున మేము దాక్కొంటాం” అని మీరు చెబుతున్నారు.

16 ఆ విషయాల మూలంగా, నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నేల మీద నేను ఒక బండను, ఒక మూలరాయిని ఉంచుతాను. ఇది చాలా ప్రశస్తమైన రాయి. ముఖ్యమైన ఈ బండమీదనే సమస్తం నిర్మించబడుతుంది. ఆ బండను విశ్వసించిన వారు నిరాశ చెందరు.

17 “ఒక గోడ తిన్నగా ఉన్నట్టు చూపించటానికి మనుష్యులు మట్టపుగుండు కట్టిన దారం ఉపయోగిస్తారు. అదే విధంగా ఏది సరైనదో చూపించేందుకు నేను న్యాయం, మంచితనం ఉపయోగిస్తాను. చెడ్డ వాళ్లయిన మీరు మీ అబద్ధాలు, మాయల వెనుక దాగుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మనం దాగుకొనే స్థలాలను నాశనం చేసేందుకు వస్తున్న తుఫాను, లేక వరదలా అది ఉంటుంది. 18 మరణంతోటి మీ ఒడంబడిక తుడిచి వేయబడుతుంది. పాతాళంతో మీ ఒడంబడిక మీకు సహాయం చేయదు.

“ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని తన పాద ధూళిగా చేస్తాడు. 19 ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్లిపోతాడు. మీ శిక్ష భయంకరంగా ఉంటుంది. మీ శిక్ష ఉదయం పెందలాడే వచ్చి, చాలా రాత్రి వరకు ఉంటుంది.

“అప్పుడు మీకు ఈ కథ అర్థం అవుతుంది: 20 ఒక మనిషి చాల పొట్టి మంచం మీద నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కప్పుకొనేందుకు సరిపడేంత వెడల్పు లేని దుప్పటి అతని దగ్గర ఉంది. మంచం, దుప్పటి నిష్ప్రయోజనమే, మీ ఒడంబడికలు అలాంటివే.”

21 యెహోవా పెరాజీము వద్ద చేసినట్టు యుద్ధం చేస్తాడు. గిబియోను లోయలో ఆయన కోపగించినట్టు యెహోవా కోపగిస్తాడు. తర్వాత యెహోవా చేయాల్సిన వాటిని చేస్తాడు. యెహోవా కొన్ని వింత పనులు చేస్తాడు. అయితే ఆయన తన పని ముగిస్తాడు. ఆయన పని ఒక క్రొత్తవాని పని. 22 మీరు వాటికి వ్యతిరేకంగా పోరాడకూడదు. మీరు గనుక పోరాడితే మీ చూట్టూ ఉన్న తాళ్లు మరింత బిగిసిపోతాయి.

నేను విన్న మాటలు మారవు. భూమి అంతటినీ పాలించే సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి ఆ మాటలు వచ్చాయి. ఆ విషయాలు జరిగించబడతాయి.

మత్తయి 26:6-13

బేతనియ గ్రామంలో తైలాభిషేకం

(మార్కు 14:3-9; యోహాను 12:1-8)

బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది.

ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు.

10 యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, 11 పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. 12 ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. 13 ఇది సత్యం—ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International