Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
11 యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 12 “నరపుత్రుడా, తూరు రాజును గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘నీవు ఆదర్శ పురుషుడవు.
నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
13 దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు.
నీవద్ద ప్రతి విలువైన రత్నం ఉంది.
కెంపులు, గోమేధికము, ఇతర రత్నాలు;
గరుడ పచ్చలు, సులిమానురాయి, పచ్చరాయి;
నీల మణులు, వైడూర్యము, మరకత పచ్చలు.
వీటిలో ప్రతిరాయీ బంగారంలో పొదగబడింది.
నీవు సృష్టింపబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు.
14 నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ[a] ఒకడవై యున్నావు.
నీ రెక్కలు నా సింహాసనం మీదికి చాపబడ్డాయి.
దేవుని పవిత్ర పర్వతం మీద నిన్ను ఉంచాను.
అగ్నిలా మెరిసే ఆభరణాల గుండా నీవు నడిచావు.
15 నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, యోగ్యుడిగా ఉన్నావు.
కాని ఆ తరువాత నీవు దుష్టుడవయ్యావు.
16 నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది.
ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు.
అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను.
దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను.
నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు.
నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి.
కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను
వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.
17 నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు.
నీ గొప్పతనం యొక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది.
అందువల్ల నిన్ను క్రిందికి పడదోశాను.
ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.
18 నీవు చాలా పాపాలు చేశావు.
నీవు చాలా కుటిలమైన వర్తకుడవు.
ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు.
కావున నీలో నేను అగ్ని పుట్టించాను.
అది నిన్ను దహించి వేసింది!
నీవు నేలమీద బూడిదవయ్యావు.
ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.
19 ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని
చూచి ఆశ్చర్యపోయారు.
నీకు వచ్చిన ఆపద ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.
నీవు సర్వనాశనమయ్యావు.’”
క్రైస్తవుల మధ్య వివాదాలు
6 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? 2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? 3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? 4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? 5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? 6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. 8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
9 దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు, 10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు. 11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.
© 1997 Bible League International