Revised Common Lectionary (Complementary)
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
తిరిగి వర్షాలు పడటం
41 ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడబోతూ వుంది” అని అన్నాడు. 42 రాజైన అహాబు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్లమధ్య తలను పెట్టాడు. 43 అప్పుడు ఏలీయా తన సేవకునితో సముద్రం చూడమన్నాడు. సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు.
“నేనేమీ చూడలేడు” అని సేవకుడు తిరిగి వచ్చి చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. ఈ విధంగా ఏడుసార్లు జరిగింది. 44 ఏడవసారి నౌకరు తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని అన్నాడు.
ఏలీయా తన సేవకునితో, “రాజైన అహాబు వద్దకు వెళ్లి తన రథం సిద్ధం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని ఆపేస్తుంది” అని అన్నాడు.
45 ఆ తరువాత కొద్ది సేవటికే ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన ప్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రెయేలుకు తిరుగు ప్రయాణం సాగించాడు. 46 యెహోవా శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంటె ముందుగా యెజ్రెయేలుకు పరుగెత్తికొని వెళ్లాడు.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 8:11-13; లూకా 12:54-56)
16 పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, “ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాక్కూడా చూపండి” అని అడిగారు.
2 ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు. 3 ఉదయం ఆకాశం ఎఱ్ఱగావుండి, ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు కాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం? 4 దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు అద్భుతకార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు.
© 1997 Bible League International