Revised Common Lectionary (Complementary)
నిజంగా సంతృప్తిపరచే ఆహారం దేవుడు ఇస్తాడు
55 “దాహంతో ఉన్న ప్రజలారా
మీరంతా వచ్చి నీళ్లు త్రాగండి!
మీ వద్ద డబ్బు లేకపోతే చింతపడకండి.
రండి, మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, త్రాగండి!
మీకు డబ్బు అవసరం లేదు.
మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, త్రాగండి. ఆహారం, ద్రాక్షారసం ఉచితం!
2 నిజంగా ఆహారం కానిదానికోసం మీ ధనం వ్యర్థం చేయటం ఎందుకు?
మిమ్మల్ని నిజంగా సంతృప్తి పరచని దానికోసం మీరు ప్రయాసపడటం ఎందుకు?
నా మాట జాగ్రత్తగా వినండి, అప్పుడు మీరు మంచి ఆహారం భోజనం చేస్తారు.
మీ ఆత్మను తృప్తిపరచే ఆహారం మీరు భోజనం చేస్తారు.
3 నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి,
మీ ఆత్మలు జీవించునట్లుగా మీరు నా మాట వినండి. నా వద్దకు రండి!
శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక నేను మీతో చేస్తాను.
అది నేను దావీదుతో చేసిన ఒడంబడికలా ఉంటుంది. దావీదు ఎడల శాశ్వతంగా దయగలిగి ఉంటానని నేను అతనికి వాగ్దానం చేసాను.
మరి మీరు ఆ వాగ్దానాన్ని నమ్ముకోవచ్చు.
4 రాజ్యాలన్నింటిలో నా శక్తికి దావీదును సాక్షిగా నేను చేశాను.
దావీదు అనేక రాజ్యాలకు పరిపాలకునిగాను, సర్వసేనానిగాను ఉంటాడని నేను అతనికి వాగ్దానం చేశాను.”
5 నీవు యెరుగని స్థలాల్లో రాజ్యాలు ఉన్నాయి,
కానీ ఆ రాజ్యాలను నీవు పిలుస్తావు.
ఆ రాజ్యాలకు నీవు తెలియదు.
కానీ అవి నీ దగ్గరకు పరుగెడతాయి.
నీ దేవుడు యెహోవా ఇలా కోరుతున్నాడు కనుక ఇది జరుగుతుంది.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు నిన్ను గౌరవిస్తున్నాడు. కనుక ఇది జరుగుతుంది.
8 యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా, అందరి యెడలా మంచివాడు.
దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
దేవుడు, తాను ఎన్నుకొన్న ప్రజలు
9 క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. 2 నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. 3 నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. 4 ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు. 5 మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందినవాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్!
అయిదువేల మందికి భోజనం
(మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-14)
13 జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాలనుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. 14 యేసు పడవనుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు.
15 సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపి వేయండి. గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.
16 యేసు, “వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే ఏదైనా యివ్వండి.” అని వాళ్ళతో అన్నాడు.
17 “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
18 “వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు. 19 ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. 20 అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.
© 1997 Bible League International