Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:121-128

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

1 రాజులు 4:29-34

సొలొమోను జ్ఞానం

29 సొలొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా గమనించేవాడు. అతని జ్ఞానం ఊహకందనిది.[a] 30 తూర్పుదేశపు మానవులందరి వివేక జ్ఞానాలకంటె, సొలొమోను జ్ఞాన సంపద మిక్కిలి అతిశయించినది. ఈజిప్టులోనున్న వారి తెలివితేటల కంటె అతని శక్తి యుక్తులు మించినవి. 31 ఈ భూమి మీద ప్రజలందరికంటె అతను తెలివైనవాడు. అతడు ఎజ్రాహీయుడైన ఏతాను కంటె, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటె మిక్కిలి తెలివైనవాడు. రాజైన సొలొమోను కీర్తి ఇశ్రాయేలు, యూదాల చుట్టు పక్కలనున్న దేశాలకు కూడ వ్యాపించింది. 32 తన జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల సామెతలను రాశాడు.[b]

33 సొలొమోను ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనేక వృక్షజాతులను గూర్చి చెప్పాడు. లెబానోనులోని గొప్ప దేవదారు వృక్షములనుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల వరకు అతనికి తెలుసు. రాజైన సొలొమోను జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర పాకే క్రిమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు వాటిని గూర్చి కూడా చెప్పాడు. 34 రాజైన సొలొమోను జ్ఞానమును వినటానికి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఇతర దేశాల రాజులు తమ తమ పండితులను, శాస్త్రజ్ఞులను రాజైన సొలొమోను చెప్పే విషయాలను వినటానికి పంపేవారు.

ఎఫెసీయులకు 6:10-18

దేవుడు యిచ్చిన ఆయుధాలు

10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.

14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International