Revised Common Lectionary (Complementary)
అయిన్
121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
తప్పుడు బోధలు నాకు అసహ్యం.
సొలొమోను జ్ఞానం రుజువగుట
16 ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు. 17 ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, నేను ఒకే ఇంట్లో నివసిస్తూ వుంటాము. మేమిద్దరం గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనేవుంది. 18 మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో మరెవ్వరూ లేరు. కేవలం మేమిద్దరమే వుంటున్నాము. 19 ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది. 20 అప్పుడు ఆమె ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద వుంచింది. 21 మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్లు గమనించాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా బిడ్డ కాదని కనుగొన్నాను.”
22 కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బ్రతికివున్న బిడ్డే నా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది.
అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు పొరాపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. బ్రతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు.
23 ఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ బతికివున్న బిడ్డ ‘నాదే’ అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని అంటున్నారు” అని అన్నాడు. 24 అప్పుడు సొలొమోను రాజు తన సేవకుడిని పంపి ఒక కత్తి తెప్పించాడు. 25 సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. బ్రతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!”
26 ఇది విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా పోతుంది” అని అన్నది. కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి,” అని అన్నది.
27 సొలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన తల్లి ఆమెయే!”
28 ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్పును విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయుటలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం[a] ఉన్నట్లు వారు గమనించారు.
తెలివిగల వాళ్ళు
13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.
© 1997 Bible League International