Revised Common Lectionary (Complementary)
పే
129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.
28 ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది.
29 అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను: 30 గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”
31 తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది.
దావీదు సొలొమోనును రాజుగా చేయటం
32 రాజైన దావీదు అప్పుడు “యాజకుడగు సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువనంపాడు.” వారు ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు. 33 “మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ[a] దగ్గరకు తీసుకొని వెళ్లండి. 34 అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయగు నాతాను అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయాలి. బూర ఊది ‘ఇదిగో కొత్తరాజు సొలొమోను!’ అని చాటాలి. 35 తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు.
36 యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక! 37 యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయపడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు.
14 మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటంలేదు. నా పుత్రులవలె ప్రేమించి హెచ్చరిస్తున్నాను. 15 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు తండ్రినయ్యాను. 16 కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. 17 ఈ కారణంగా నాకు ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీ దగ్గరకు పంపుతున్నాను. తిమోతి ప్రభువు ప్రేమించిన కుమారుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను.
18 నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు. 19 కాని ప్రభువు చిత్తమైతే నేను త్వరలోనే వస్తాను. గర్వంతో మాట్లాడుతున్నవాళ్ళు ఏమి చెయ్యకలుగుతారో చూస్తాను. 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు. అది శక్తితో కూడినది.
© 1997 Bible League International