Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
1 ఎల్కోషువాడైన నహూముకు కలిగిన దర్శనాన్ని వివరించే గ్రంథం. ఇది నీనెవె నగరాన్ని గూర్చిన దుఃఖకరమైన సమాచారం.
నీనెవె పట్ల యెహోవా కోపం
2 యెహోవా రోషంగల దేవుడు!
యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు.
యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు.
ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు.
3 యెహోవా ఓర్పు గలవాడు.
కాని ఆయన మిక్కిలి శక్తిమంతుడు.
యెహోవా నేరం చేసిన జనులను శిక్షిస్తాడు.
ఆయన వారిని ఊరికే వదిలి పెట్టడు.
దుష్టజనులను శిక్షంచటానికి యెహోవా వస్తున్నాడు. ఆయన తన శక్తిని చూపటానికి సుడిగాలులను, తుఫానులను ఉపయోగిస్తాడు.
మానవుడు నేలమీద మట్టిలో నడుస్తాడు. కాని యెహోవా మేఘాలపై నడుస్తాడు!
4 యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది.
ఆయన నదులన్నీ ఇంకిపోయేలా చేస్తాడు!
బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి, నశించి పోతాయి.
లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి.
5 యెహోవా వస్తాడు.
పర్వతాలన్నీ భయంతో కంపిస్తాయి.
కొండలు కరిగిపోతాయి.
యెహోవా వస్తాడు.
భయంతో భూమి కంపిస్తుంది.
ఈ ప్రపంచం, అందులో నివసించే
ప్రతివాడూ భయంతో వణుకుతాడు.
6 యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు.
ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరించలేరు.
ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది.
ఆయన రాకతో బండలు బద్దలై చెదిరిపోతాయి.
7 యెహోవా మంచివాడు,
ఆపద సమయంలో తలదాచుకోటానికి ఆయన సురక్షిత స్థలం.
ఆయనను నమ్మినవారిపట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు.
8 ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు.
ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు.
ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి వేస్తాడు.
9 యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు?
కాని ఆయన వారి పన్నాగాలన్నిటినీ వమ్ము చేస్తాడు.
కష్టం రెండవసారి రాదు.
10 చిక్కుపడిన ముండ్లపొదలా
నీ శత్రువు నాశనం చేయబడతాడు.
ఎండిన కలుపు మొక్కల్లా
వారు వేగంగా కాలిపోతారు.
11 అష్షూరూ, నీలోనుండి ఒక మనిషి వచ్చాడు. అతడు యెహోవాకు వ్యతిరేకంగా దుష్ట పథకాలు వేశాడు.
అతడు చెడు సలహా ఇచ్చాడు.
12 యెహోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు:
“అష్షూరు ప్రజలు పూర్తి బలం కలిగి ఉన్నారు.
వారికి చాలామంది సైనికులున్నారు. కాని వారంతా నరికి వేయబడతారు.
వారంతా అంతం చేయబడతారు.
నా ప్రజలారా, మీరు బాధ పడేలా చేశాను.
కాని ఇక మిమ్మల్ని బాధపడనీయను.
13 అష్షూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను.
మీ మెడమీదనుండి ఆ కాడిని తీసివేస్తాను.
మిమ్మల్నిబంధించిన గొలుసులను తెంచి వేస్తాను.”
12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి.
13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయినవాళ్ళు ధన్యులు” అని అన్నది.
“అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
భూమ్మీద పంట కోత
14 ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద “మనుష్యకుమారుని”[a] లాంటివాడు కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. 15 ఆ తర్వాత మందిరం నుండి మరొక దూత వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చొన్నవాణ్ణి పిలిచి, “భూమ్మీద పంట పండింది. పంటను కోసే సమయం వచ్చింది. నీ కొడవలి తీసుకొని పంటను కోయి!” అని అన్నాడు. 16 మేఘంమీద కూర్చొన్నవాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే ఆ కొడవలి పంటను కోసింది.
17 పరలోకంలో ఉన్న మందిరం నుండి యింకొక దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉంది. 18 మరొక దూత బలిపీఠం నుండి వచ్చాడు. అగ్నికి అధికారియైన యితడు బిగ్గరగా పదునైన కొడవలి ఉన్నవాణ్ణి పిలుస్తూ, “ద్రాక్ష పండింది. నీ పదునైన కొడవలి తీసుకెళ్ళి భూమ్మీద వున్న ద్రాక్షా తోటనుండి ద్రాక్షాగుత్తుల్ని కోయి” అని అన్నాడు. 19 ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి ద్రాక్షా పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద తొట్టిలో వేసాడు. 20 ఊరికి అవతలవున్న ద్రాక్షా తొట్టిలో ద్రాక్షా పళ్ళను వేసి వాటిని త్రొక్కారు. దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుఱ్ఱం నోటి కళ్ళెం అంత ఎత్తు లేచి, సుమారు రెండు వందల మైళ్ళ దూరందాకా ప్రవహించింది.
© 1997 Bible League International