Revised Common Lectionary (Complementary)
11 యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు
నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను.
నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా
అతి ముఖ్యాంశంగా చేయుము.
12 దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను.
నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
13 దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది.
మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
14 దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు.
కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
15 ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు.
నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.
నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను.
నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.
అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు.
ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.
అబద్ధపు దేవుళ్ళు నిష్ప్రయోజనం
9 కొంత మంది మనుష్యులు విగ్రహాలు (అబద్ధపు దేవుళ్ళు) చేసుకొంటారు. కానీ అవి నిష్ప్రయోజనం. ప్రజలు ఆ విగ్రహాలను ప్రేమిస్తారు. కానీ ఆ విగ్రహాలు నిష్ప్రయోజనం. ఆ మనుష్యులే ఆ విగ్రహాలకు సాక్షులు, కానీ అవి మాట్లాడవు. వారికి ఏమీ తెలియదు. వారు చేసే పనుల విషయం వారు సిగ్గుపడేంత మాత్రం కూడా వారికి తెలియదు.
10 ఈ తప్పుడు దేవుళ్లను ఎవరు చేశారు? పనికిమాలిన ఈ విగ్రహాలను ఎవరు చేశారు? 11 చేతి పనివారు ఆ దేవుళ్లను చేశారు. ఆ పనివాళ్లంతా మనుష్యులే, దేవుళ్లు కారు. ఆ మనుష్యులంతా కలిసి వచ్చి, ఈ విషయాలను చర్చిస్తే, అప్పుడు వాళ్లంతా సిగ్గుపడతారు, భయపడతారు.
12 ఒక పనివాడు వేడి నిప్పుల మీద ఇనుము వేడిచేయటానికి తన పనిముట్లు వాడతాడు. లోహాన్ని కొట్టడానికి ఇతడు తన సుత్తెను ఉపయోగిస్తాడు, అప్పుడు ఆ లోహం ఒక విగ్రహం అవుతుంది. ఈ మనిషి బలమైన తన చేతులను ఉపయోగిస్తాడు. అయితే అతనికి ఆకలి వేసినప్పుడు అతని బలం పోతుంది. అతడు నీళ్లు తాగకపోతే, అతడు బలహీనం అవుతాడు.
13 మరో పనివాడు చెక్కమీద గీతలు గీసేందుకు నూలు వేసి చీర్ణంతో గీతలు గీస్తాడు. అతడు ఎక్కడ కోయాలో ఇది తెలియజేస్తుంది. అప్పుడు అతడు తన ఉలితో చెక్క నుండి విగ్రహాన్ని చెక్కుతాడు. ఆ విగ్రహాన్ని కొలిచేందుకు అతడు కర్కాటం ఉపయోగిస్తాడు. ఈ విధంగా ఆ పనివాడు ఆ చెక్క సరిగ్గా మనిషిలా కనబడేట్టు చేస్తాడు. మరియు ఈ మనిషిని పోలిన విగ్రహం ఇంట్లో కూర్చోవటం తప్ప చేసేది ఏమీ లేదు.
14 ఒకడు దేవదారు, సరళ లేక సింధూర వృక్షాన్ని సరికివేయవచ్చును. (ఆ చెట్లు పెరిగేటట్టు అతడేంచేయలేదు. ఆ చెట్లు అడవిలో వాటి స్వంత శక్తి మూలంగా పెరిగాయి. ఒకడు ఒక తమాల వృక్షాన్ని నాటితే వర్షం దాన్ని పెంచుతుంది.)
15 అప్పుడు అతడు మంట వేసుకొనేందుకు ఆ చెట్టును వాడుకొంటాడు. అతడు ఆ వృక్షాన్ని చిన్న కట్టె ముక్కలుగా నరుకుతాడు. వంట చేసుకొనేందుకు, చలి కాచుకొనేందుకు అతడు ఆ కట్టెలను వాడుకొంటాడు. కొన్ని కట్టెలతో అతడు మంట చేసి, రొట్టె కాల్చుకొంటాడు. అయితే అతడు ఆ కట్టెల్లో ఒక భాగాన్ని దేవునిగా చేయటానికి ఉపయోగిస్తాడు. మరియు ఆ మనిషి ఆ దేవుణ్ణి పూజిస్తాడు. ఆ దేవుడు ఆ మనిషి చేసిన విగ్రహమే కానీ ఆ మనిషి ఆ విగ్రహం ముందు సాష్టాంగపడతాడు. 16 ఆ మనిషి సగం కట్టెలు మంటలో కాలుస్తాడు. అతడు ఆ కట్టెలతో మాంసం వండుకొని, కడుపు నిండే అంతవరకు ఆ మాంసం తింటాడు. అతడు వెచ్చదనం కోసం ఆ కట్టెలను మంట పెడతాడు. “బాగుంది, ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది. మంట ద్వారా వెలుగు వస్తుంది గనుక ఇప్పుడు నేను చూడగలను” అని అతడు అంటాడు. 17 అయితే కొంచెం కట్టె మిగిలింది. కనుక అతడు ఆ కట్టెతో ఒక విగ్రహం చేసి, దాన్ని తన దేవుడు అని పిలుస్తాడు. ఈ దేవుని ముందు అతడు సాష్టాంగపడి, దానిని పూజిస్తాడు. అతడు ఆ దేవుని ప్రార్థించి, “నీవే నా దేవుడివి, నన్ను రక్షించు” అంటాడు.
13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ, 14 ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.” 15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
16 ప్రజలు తమకన్నా గొప్పవాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి. 17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు.
తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.
© 1997 Bible League International