Revised Common Lectionary (Complementary)
11 యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు
నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను.
నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా
అతి ముఖ్యాంశంగా చేయుము.
12 దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను.
నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
13 దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది.
మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
14 దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు.
కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
15 ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు.
నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.
నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను.
నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.
అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు.
ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.
అబద్దపు దేవతలకి యెహోవా సవాలు
21 యాకోబు రాజు, యెహోవా చెబుతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం. 22 జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేము జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏమి జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది. 23 ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బ్రతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం.
24 “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలనుకొంటాడు.”
యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేయటం
25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొలిపాను.
సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు.
అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు.
కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.
26 “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు?
ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి.
మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు.
ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు.
మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు.
27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను.
‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి
ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”
28 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను.
వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు.
వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను.
కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు.
29 ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ.
వాళ్లు ఏమీ చేయలేరు.
ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.
జాగ్రత్తపడమని హెచ్చరిక
2 అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము. 2 దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది.[a] ఆ సందేశాన్ని అనుసరించనివానికి, దాన్ని విననివానికి తగిన శిక్ష లభించింది. 3 మరి, అటువంటి మహత్తరమైన రక్షణను మనం గమనించకపోతే శిక్షనుండి ఏ విధంగా తప్పించుకోగలం? ఈ రక్షణను గురించి మొట్ట మొదట మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్నవాళ్ళు అందులోవున్న సత్యాన్ని మనకు వెల్లడిచేసారు. 4 దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్ని చూపాడు. తన యిష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా ఆ సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు.
యేసు మానవజన్మనెత్తటం
5 మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు. 6 ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది:
“మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు?
మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు?
7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు!
మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి,
8 అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు.”(A)
దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. 9 యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
© 1997 Bible League International