Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.
3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.
నడికట్టు సంకేతం
13 యెహోవా నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక నడికట్టు బట్టకొని[a] తీసుకురా. దానిని నీవు ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.”
2 కావున యెహోవా చెప్పిన విధంగా నేనొక నడికట్టు వస్త్రం కొని ధరించాను. 3 అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినబడింది. 4 ఆ వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు వస్త్రం తీసుకొని ఫరాతుకు[b] వెళ్లుము. అక్కడ ఒకబండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.”
5 అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను. 6 చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు.
7 అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది.
8 అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది. 9 యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, ఎందుకూ పనికిరానిదయి పోయింది. అదే విధంగా, యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టులనందరినీ నాశనం చేస్తాను. 10 యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు. 11 నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”
యేసు తన శిష్యుల పాదాలు కడగటం
13 పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళనెంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్ళకు చూపించాడు.
2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయుటకు కూర్చొని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్యరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చెయ్యమని ప్రేరేపించాడు. 3 తండ్రి తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్లు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము ఆయనకు తెలుసు. 4 అందువల్ల ఆయన భోజన పంక్తి నుండి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి, ఒక కండువాను నడుముకు చుట్టుకున్నాడు. 5 ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు.
6 యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారా?” అని అన్నాడు.
7 యేసు, “నేను చేస్తున్నది నీకు యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని సమాధానం చెప్పాడు.
8 పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కడుగకూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు.
యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు సంబంధం ఉండదు!” అని సమాధానం చెప్పాడు.
9 సీమోను పేతురు, “ప్రభూ! అలాగైతే నా పాదాలేకాదు. నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” అని అన్నాడు.
10 యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసినవాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు. 11 తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయనన్నాడు.
12 ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, పై వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు ముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, “నేను చేసింది మీకు అర్థమైందా? 13 మీరు నన్ను ‘బోధకుడా!’ అని ‘ప్రభూ!’ అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే! 14 మీ బోధకుడను, ప్రభువును అయిన నేను మీ పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. 15 నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం. 16 ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపినవాని కన్నా గొప్ప కాదు. 17 ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు.
© 1997 Bible League International