Revised Common Lectionary (Complementary)
8 యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా, అందరి యెడలా మంచివాడు.
దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
నీవు శాశ్వతంగా పాలిస్తావు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
యెహోవా తన ప్రజలు తిరిగి రావాలని కోరుట
1 బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.
2 యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు. 3 కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు.
4 యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పాడు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.”
5 యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. 6 ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించుకొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చుకున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కావున వారు దేవుని వద్దకు తిరిగి వచ్చారు.”
వివాహ బంధం
7 సోదరులారా! నేను ధర్మశాస్త్రం తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిపై అతడు బ్రతికి ఉన్నంతవరకే అధికారం కలిగి ఉంటుందని మీకు తెలియదా? 2 ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ఆమె భర్త జీవించి ఉన్నంతవరకే అతనికి బద్ధురాలై ఉంటుంది. ఒకవేళ అతడు మరణిస్తే ధర్మశాస్త్ర బంధం నుండి ఆమెకు విముక్తి కలుగుతుంది. 3 ఆమె భర్త జీవించి ఉండగా ఇంకొకణ్ణి వివాహమాడితే ఆమె వ్యభిచారి అనబడుతుంది. కాని ఆమె భర్త మరణిస్తే ఆమెకు ఆ చట్టం నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆమె ఇంకొకణ్ణి వివాహం చేసుకొన్నా ఆమె వ్యభిచరించినదానిగా పరిగణింపబడదు.
4 అదే విధంగా నా సోదరులారా! మీరు కూడా క్రీస్తు శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి పొందారు. మీరు బ్రతికింపబడ్డ క్రీస్తుకు చెందినవారై దేవుని కొరకు ఫలిస్తారు. 5 ధర్మశాస్త్రం మూలంగా కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటంవల్ల మనం మరణాన్ని పొందాము. 6 మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్ఛను పొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము.
© 1997 Bible League International