Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన
6 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
కోపగించి నన్ను శిక్షించవద్దు.
2 యెహోవా, నా మీద దయ ఉంచుము.
నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
3 నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.
8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
యిర్మీయా నీళ్లగోతిలోనికి తోయబడటం
38 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు: 2 “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’ 3 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.’”
4 ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపరుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” అని చెప్పారు.
5 “యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.
6 దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి[a] దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంతో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
7 కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా)[b] రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు. 8-9 ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్యవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.”[c]
10 అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు[d] మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలోనుండి పైకి తియ్యి.”
11 తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి క్రిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు. 12 ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కలుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు. 13 ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలో ఉన్నాడు.
5 ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు: “యూదులు కాని వాళ్ళ దగ్గరకు గాని, సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి. 6 దానికి మారుగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొఱ్ఱెలవలె ఉన్నారు. 7 వెళ్ళి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి. 8 జబ్బుతో ఉన్న వాళ్ళకు నయం చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా లభించింది ఉచితంగా యివ్వండి. 9 బంగారం కాని, వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి, 10 మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా!
11 “మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి. 12 మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ‘శాంతి కలుగునుగాక’ అనండి. 13 ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది. 14 ఒక వేళ, మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పక పోయినట్లైతే, ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కాని వదిలి వెళ్ళేముందు మీ కాలి ధూళి దులిపి వెయ్యండి. 15 ఇది సత్యం, తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలకన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది.
కష్టాలను గురించి యేసు హెచ్చరించటం
(మార్కు 13:9-13; లూకా 21:12-17)
16 “తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. 17 కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు. 18 వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి. 19 వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు. 20 ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
21 “సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు. 22 ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. 23 మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు.
© 1997 Bible League International