Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
6 మంచి వాళ్లు ఇది చూచి,
దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
యెహోషువ వీడ్కోలు చెప్పటం
24 అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకెములో సమావేశం అయ్యాయి. వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్లంతా దేవుని ఎదుట నిలబడ్డారు.
2 అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీతో చెబుతున్నదే నేను మీతో చెబుతున్నాను. చాలకాలం క్రిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గూర్చి నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుళ్లను పూజించారు.
11 “అప్పుడు మీరు యొర్దాను నది దాటి ప్రయాణంచేసారు. మీరు యెరికో చేరుకొన్నారు. యెరికో పట్టణం ప్రజలు మీతో పోరాడారు. మరియు అమోరీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు మీతో పోరాడారు. కాని వాళ్లందరినీ మీరు ఓడించేటట్టు నేను చేసాను. 12 మీ సైన్యం ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ముందుగా కందిరీగలను నేను పంపించాను. ఆ కందిరీగలు మీ శత్రువులను పారిపోయేటట్టు చేసాయి. కనుక మీరు ఖడ్గాలు, బాణాలు ప్రయోగించకుండా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
13 “యెహోవానైన నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చాను. మీరు పని చేయాల్సిన అవసరం లేకుండానే ఆ దేశాన్ని నేను మీకు ఇచ్చాను. మీరు నిర్మించని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు ఆ దేశంలో, ఆ పట్టణాల్లో నివసిస్తున్నారు. మీరు నాటకుండానే ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు మీకు ఉన్నాయి.”
14 అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం క్రిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి.
15 “అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!”
16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము. 17 మన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర దేశాలగుండా మనము ప్రయాణించినప్పుడు ఆయనే మనలను కాపాడాడు. 18 తర్వాత ఈ దేశాల్లో నివసించే ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు గనుక.”
19 అప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు. 20 మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను దేవుడు మీకు సంభవింపజేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
21 అయితే ప్రజలు, “లేదు, మేము యెహోవానే సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు.
22 అప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి. మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు తెలుసా, మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” అన్నాడు.
ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ తెలుసు” అని జవాబిచ్చారు.
23 అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి” అని చెప్పాడు.
24 అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమవుతాము” అని యెహోషువతో చెప్పారు.
25 కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టముగా చేసాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది. 26 దేవుని ధర్మశాస్త్రపు గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ వ్రాసాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండను చూసాడు. (ఈ బండ ఈ ఒడంబడికకు ఋజువు) యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం క్రింద ఆ బండను అతడు పెట్టాడు.
27 అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు: “ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది. కనుక ఈ వేళ జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీమీద ఈ బండ సాక్షి. మీ దేవుడైన యెహోవాకు మీరు విరోధంగా తిరుగకుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది.”
28 అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తీ తన స్వంత స్థలానికి వెళ్లిపోయాడు.
నీతిమంతుడొక్కడూ లేడు
9 మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. 10 ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:
“నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు!
11 అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు.
దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.
12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు.
మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!”(A)
13 “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి.
వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.”(B)
“వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!”(C)
14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!”(D)
15 “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.
16 వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు.
17 వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!”(E)
18 “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”(F)
19 ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. 20 ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.
విశ్వాసం ద్వారా నీతిమంతుడు కావటం
21 కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. 22 దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది.
© 1997 Bible League International