Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 11:18-21

18 “నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోండి. మీకు జ్ఞాపకంచేసే సూచనలుగా ఈ ఆజ్ఞలను వ్రాసి మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంగా కట్టుకోండి. 19 ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లాడండి. 20 మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి. 21 అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరూ మీ పిల్లలూ దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి ప్తెగా ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు.

ద్వితీయోపదేశకాండము 11:26-28

ఇశ్రాయేలుయొక్క కోరికలు ఆశీర్వాదములా లేక శాపములా

26 “ఈ వేళ నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదమో లేక ఒక శాపమో కోరుకోనిస్తున్నాను. 27 ఈ వేళ నేను మీతో చెప్పిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు లోబడితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. 28 మీరు మీ దేవుడైన యెహోవా మాట వినక, ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంనుండి మీరు తొలగిపోయి, మీరు ఎరుగని ఇతర దేవుళ్లను అనుసరిస్తే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించేందుకు మీరు నిరాకరిస్తే మీకు శాపం వస్తుంది.

కీర్తనలు. 31:1-5

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

31 యెహోవా, నీవే నా కాపుదల.
    నన్ను నిరాశపరచవద్దు.
    నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
    దేవా, నా మాట ఆలకించుము.
    వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
    నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
దేవా, నీవే నా బండవు, కోటవు
    కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
    వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
    నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
    నన్ను రక్షించుము.

కీర్తనలు. 31:19-24

19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
    నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
    ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
    కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
    ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
    కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.

23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
    యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.

రోమీయులకు 1:16-17

16 సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది. 17 ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడి ఉంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[a] అని వ్రాయబడి ఉంది.

రోమీయులకు 3:22-28

22 దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. 23 అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు[a] పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. 24 కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. 25 దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు. 26 అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం.

27 మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు. 28 మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.

రోమీయులకు 3:29-31

29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కానివాళ్ళకు కూడా దేవుడే. 30 దేవుడు సున్నతి పొందినవాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందనివాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. 31 మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.

మత్తయి 7:21-29

21 “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. 22 ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు. 23 అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.

తెలివిగలవాడు, తెలివిలేనివాడు

(లూకా 6:47-49)

24 “అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన యింటిని కట్టుకొన్న వానితో సమానము. 25 ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.

26 “కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించుకొన్న మూర్ఖునితో సమానము. 27 వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది.

28-29 యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International