Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.
23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.
ఇశ్రాయేలుకు శిక్ష
6 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు. 7 పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, వారిపై తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు. 8 పేద ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాలముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలా వారు చేస్తారు. ఆ డబ్బును వారు తమ దేవుని ఆలయంలో తాగటానికి ద్రాక్షామద్యం కొనడానికి వినియోగిస్తారు.
9 “కాని, అమోరీయులను[a] వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయినవారు. వారు సిందూర వృక్షమంత బలంగలవారు. కాని, పైన వాటి పండ్లను, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను.
10 “ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని తీసుకొని వచ్చింది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై నలబై సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. 11 మీ కుమారులలో కొంతమందిని నేను ప్రవక్తలుగా చేశాను. మీ యువకులలో కొంతమందిని నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా! ఇది నిజం అని యెహోవా చెపుతున్నాడు.
ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము
(లూకా 6:37-38, 41-42)
7 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్లు కూడ మీపై తీర్పు చెబుతారు. 2 మీరు ఇతర్లపై తీర్పు చెప్పినట్లే ఇతర్లు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతర్లు మీకు కొలిచి ఇస్తారు.
3 “మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు? 4 మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు? 5 కపటీ! మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయకలుగుతావు.
6 “పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి.
© 1997 Bible League International