Revised Common Lectionary (Complementary)
104 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు.
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
2 ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు.
ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
3 దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు.
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు.
గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
4 దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు.
నీ సేవకులను అగ్నిలా చేశావు.
5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు.
కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
6 దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు.
నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
7 కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి.
దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
8 పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత
నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
9 సముద్రానికి నీవు హద్దులు నియమించావు.
నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.
10 దేవా, నీటి ఊటలనుండి నీటి కాలువలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు.
పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని క్రిందికి కాలువలా ప్రవహింపజేసావు.
11 నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి.
అక్కడ నీళ్లు త్రాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.
12 నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి.
సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.
13 దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు.
దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.
14 దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు.
మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.
15 దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు.
మా చర్మాన్ని నునుపు చేసే[a] తైలాన్ని నీవు మాకిస్తావు.
మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.
16 లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు.
ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.
17 పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి.
పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
18 పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం,
పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.
19 దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము.
ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
20 చీకటిని నీవు రాత్రిగా చేశావు.
ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.
21 సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి.
అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను అడుగుతున్నట్టు ఉంటుంది.
22 మరల సూర్యుడు ఉదయించినప్పుడు
ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.
23 అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు.
సాయంత్రం వరకు వారు పని చేస్తారు.
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[b] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.
27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.
31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.
33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను స్తుతించు!
ఏలీయా మరియు వర్షాభావ పరిస్థితి
17 ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్బీ నగరానికి చెందినవాడు. ఏలీయా వచ్చి రాజైన అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్సరాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. నేను ఆజ్ఞ ఇస్తేగాని వర్షం పడదు.”
2 తరువాత యెహోవా ఏలీయాతో, 3 “నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. ఆ వాగు యోర్దాను నదికి తూర్పున ఉన్నది. 4 నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు[a] ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు. 5 కావున యెహోవా చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్దాను నదికి తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి అతడు వెళ్లాడు. 6 బొంత కాకులు ప్రతి ఉదయం రొట్టెను, ప్రతి సాయంత్రం మాంసాన్ని తెచ్చి ఇచ్చేవి. ఏలీయా వాగు నీటిని తాగేవాడు.
7 వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది. 8 అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: 9 “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.”
10 కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు. 11 అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు.
12 “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెబుతున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది.
13 ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నేను చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో. 14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’”
15 అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. 16 పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.
6 సోదరులారా! “లేఖనాల్లో వ్రాయబడినవాటిని అతిక్రమించకండి” అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని ద్వేషించకండి. 7 ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు?
8 ఇప్పటికే మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ధనవంతులైపొయ్యారు. మేము రాజులం కాకపోయినా, మీరు రాజులైపొయ్యారు. మీరు నిజంగా రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము మీతో సహా రాజులమౌతాము. 9 మరణ శిక్ష పొందిన నేరస్థుల్లాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని చివరన ఉంచాడు. లోకమంతటికీ, దేవదూతలకు, మానవులకు అపొస్తులమైన మేము ప్రదర్శనా వస్తువులయ్యాము. 10 క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం లభిస్తోంది. 11 ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధపడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలు అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు. 12 మేము మా చేతుల్తో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం. 13 అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.
14 మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటంలేదు. నా పుత్రులవలె ప్రేమించి హెచ్చరిస్తున్నాను. 15 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు తండ్రినయ్యాను. 16 కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. 17 ఈ కారణంగా నాకు ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీ దగ్గరకు పంపుతున్నాను. తిమోతి ప్రభువు ప్రేమించిన కుమారుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను.
18 నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు. 19 కాని ప్రభువు చిత్తమైతే నేను త్వరలోనే వస్తాను. గర్వంతో మాట్లాడుతున్నవాళ్ళు ఏమి చెయ్యకలుగుతారో చూస్తాను. 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు. అది శక్తితో కూడినది. 21 మీకేమి కావాలి? మిమ్మల్ని శిక్షించటానికి మీ దగ్గరకు రావాలా? లేక దయ, ప్రేమ చూపటానికి రావాలా?
© 1997 Bible League International