Revised Common Lectionary (Complementary)
రక్షణ దినం
8 యెహోవా చెబుతున్నాడు:
“సరైన సమయంలో నేను నీకు దయను చూపిస్తాను.
ఆ సమయమందు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాను.
రక్షణ దినాన నేను నీకు సహాయం చేస్తాను,
నేను నిన్ను కాపాడుతాను.
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అనేందుకు మీరు ఒక నిదర్శనం.
ఇప్పుడైతే దేశం నాశనం చేయబడింది,
అయితే మీరు దేశాన్ని తిరిగి దాని స్వంత దారులకు ఇచ్చివేస్తారు.
9 ‘చెరలోనుండి బయటకు వచ్చేయండి’
అని ఖైదీలతో మీరు చెబుతారు.
‘చీకటిలోనుండి బయటకు వచ్చేయండి’
అని చీకటిలో ఉన్న ప్రజలతో మీరు చెబుతారు.
ప్రజలు పయనిస్తూ భోజనం చేస్తారు.
ఖాళీ కొండలమీద కూడా వారికి భోజనం ఉంటుంది.
10 ప్రజలు ఆకలితో ఉండరు. వారు దాహంతో ఉండరు.
సూర్యుని వేడి గాల్పులు వారికి హానిచేయవు.
ఎందుకంటే, వారిని ఆదరించే వాడు (దేవుడు) వారిని నడిపిస్తాడు గనుక.
ప్రజలను నీటి ఊటలు దగ్గరకు ఆయన నడిపిస్తాడు.
11 నా ప్రజలకు నేను బాట వేస్తాను.
పర్వతాలు సమతలం చేయబడతాయి.
పల్లపు తోవలు ఎత్తు చేయబడతాయి.
12 “చూడండి! చాలా దూర ప్రదేశాల నుండి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు.
ఉత్తరం నుండి, పశ్చిమం నుండి ప్రజలు వస్తున్నారు.
ఈజిప్టులోని అస్వాను నుండి ప్రజలు వస్తున్నారు.”
13 భూమి, ఆకాశములారా సంతోషించండి.
పర్వతములారా, ఆనందంగా కేకలు వేయండి.
ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు గనుక.
తన దీన జనులకు యెహోవా దయచూపిస్తాడు.
14 కానీ ఇప్పుడు సీయోను అంటుంది, “యెహోవా నన్ను విడిచిపెట్టాడు.
నా యజమాని నన్ను మరిచిపోయాడు” అని.
15 అయితే నేనంటాను,
“ఓ స్త్రీ తన శిశువును మరచిపోగలదా? లేదు.
తన గర్భంనుండి వచ్చిన శిశువును ఒక స్త్రీ మరువగలదా? లేదు.
ఒక స్త్రీ తన పిల్లలను మరువజాలదు.
మరి నేను (యెహోవాను) మిమ్ములను మరువజాలను.
16 చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను.
ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి తలుస్తాను.
యాత్ర కీర్తన.
131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.
3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.
క్రీస్తు యొక్క అపొస్తలులు
4 అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళుగా పరిగణించండి. 2 బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. 3 మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను. 4 నా మనస్సు నిర్మలమైనది. అంత మాత్రాన నేను నిర్దోషినికాను. ప్రభువు నాపై తీర్పు చెపుతాడు. 5 అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.
24 “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.
మొదట దేవుని రాజ్యం
(లూకా 12:22-34)
25 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్యమైనవి కావా? 26 ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు. ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పరలోకంలోవున్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా! 27 చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా?
28 “మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు. 29 అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు. 30 ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో కదా! మీలో దృఢ విశ్వాసం లేదు.
31 “‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి. 32 యూదులు కానివాళ్ళు వాటివైపు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు. 33 కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. 34 రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.
© 1997 Bible League International