Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
మండుతున్న పొద
3 మోషే మామ పేరు యిత్రో (ఈయన మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు. అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని కొండ. 2 ఆ కొండమీద మండుతున్న ఒక పొదలో యెహోవా దూతను మోషే చూసాడు.
ఆ పొద మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు. 3 అందుచేత మోషే, “ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అనుకొన్నాడు.
4 ఆ పొదను చూచేందుకు మోషే వస్తూ ఉండటం యెహోవా చూశాడు. అందుచేత ఆ పొదలోంచే దేవుడు, “మోషే, మోషే” అని మోషేను పిల్చాడు.
“చిత్తం ప్రభూ” అన్నాడు మోషే.
5 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “ఇక దగ్గరకు రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర స్థలం 6 నేను నీ పూర్వీకుల దేవుణ్ణి. నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి.”
దేవుణ్ణి చూడాలంటే, భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు.
7 యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు 8 ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు.[a] అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం.[b] కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. 9 ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. 10 అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు.
11 అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు.
12 “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు.
స్తెఫను ఉపన్యాసం
7 ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు. 2 అతడు సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా! నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట. 3 అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు.
4 “అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతణ్ణి స్థిరపర్చాడు. 5 దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్తిగా యివ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా, అతనికి, అతని తర్వాత రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేసాడు.
6 “దేవుడతనితో, ‘నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు నీ వాళ్ళను నాలుగు వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని వాళ్ళను కష్టపెడతారు. 7 వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు.
8 “సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రాహాము అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు వంశాలకు మూల పురుషులయ్యారు.
9 “వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.
12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.
© 1997 Bible League International