Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 27:7-14

యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
    వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
    కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
    నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
    అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
    సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
    నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
    నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
    బలంగా, ధైర్యంగా ఉండుము.
    యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.

న్యాయాధిపతులు 6:11-24

యెహోవాదూత గిద్యోనును దర్శించటం

11 ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా, 12 యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు.

13 అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.”

14 యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు.

15 అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు.

16 యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు.

17 అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: “నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహోవా అనేందుకు నాకు ఒక ఋజువు చూపు. 18 దయచేసి ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేంతవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట పెట్టనియ్యి.”

యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు.

19 కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు పిండిని తీసుకుని పొంగని రొట్టె చేసాడు. అప్పుడు గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, పొంగని రొట్టెను బయటకు తీశాడు. గిద్యోను ఆ భోజనాన్ని మస్తకి చెట్టు క్రింద యెహోవాకు ఇచ్చాడు.

20 దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ రొట్టెను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు.

21 యెహోవాదూత ఒక చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. యెహోవాదూత ఆ కర్ర కొనతో మాంసాన్ని, రొట్టెను తాకాడు. అప్పుడు బండనుండి అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివేయబడ్డాయి! అప్పుడు యెహోవాదూత అదృశ్యమయ్యాడు.

22 గిద్యోను తాను యెహోవాదూతతో మాట్లాడుతున్నట్లు అప్పుడు గ్రహించాడు. కనుక గిద్యోను, “సర్వశక్తిమంతుడైన యెహోవా! యెహోవాదూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని అరిచాడు.

23 కానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు.

24 కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజ్రీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.

ఎఫెసీయులకు 5:6-14

వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:

“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
    బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International