Revised Common Lectionary (Complementary)
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
8 సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
9 అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!
20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.
షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట
10 షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది. 2 అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది. 3 సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు. 4 షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది. 5 రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి.
6 కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది! 7 నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి. 8 నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది! 9 నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్ల నిరంతర ప్రేమగలిగి వున్నాడు. కావుననే ఆయన నిన్ను రాజుగా చేశాడు; నీవు న్యాయమార్గంలో రాజ్యపాలన చేస్తున్నావు.”
10 పిమ్మట షేబ దేశపు రాణి రెండు వందల నలభై మణుగుల[a] బంగారాన్ని, చాలా సుగంధ ద్రవ్యాలను, రత్నాలను రాజుకు కానుకగా సమర్పించింది. ముందెన్నడూ ఎవ్వరూ ఇశ్రాయేలు రాజ్యాలలోకి తేనన్ని సుగంధ ద్రవ్యాలను షేబ దేశపు రాణి సొలొమోనుకు సమర్పించింది.
11 హీరాము యొక్క ఓడలు కూడ ఓఫీరు నుండి బంగారం తీసుకుని వచ్చాయి. ఆ ఓడలు చాలా కలప[b], వజ్రాలు కూడ తీసుకుని వచ్చాయి. 12 ఆ కలపను దేవాలయంలోను, రాజభవనంలోను స్తంభాలు చేయటానికి సొలొమోను ఉపయోగించాడు. గాయకులకు సితారలను, స్వరమండలములను చేయటానికి కూడ ఆ కలపను అతడు ఉపయోగించాడు. ఇశ్రాయేలు లోనికి ఆ రకమైన కలపను ఎవ్వరూ తేలేదు. అప్పటినుండి మళ్లీ ఎవ్వరూ ఆ విధమైన కట్టెను చూడలేదు.
13 సాటి రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర వస్తువులను కూడా ఆమెకు సమర్పించాడు. ఆ తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి పోయారు.
ఎఫెసీయుల కోసం ప్రార్థన
14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.
20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International