Revised Common Lectionary (Complementary)
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
సౌలు మరియు ఏన్దోరు మంత్రగత్తె
3 సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా అతని మరణానికి దుఃఖించారు. అతని స్వంత పట్టణమైన రామాలోనే సమూయేలు శరీరాన్ని ప్రజలు సమాధి చేశారు.
అంతకు ముందే సౌలు కర్ణపిశాచముగల వారిని[a] చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెడల గొట్టాడు.
4 ఫిలిష్తీయులంతా యుద్ధానికి సిద్ధమై షూనేము అనే చోట గుడారాలు వేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమీకరించి, గిల్బోవలో గుడారాలు వేసుకున్నాడు. 5 ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది. 6 సౌలు యెహోవాను ప్రార్థించాడు. కానీ యెహోవా అతనికి జవాబు ఇవ్వలేదు. కలలోకూడ దేవుడు సౌలుతో మాట్లాడలేదు. అతనికి జవాబు ఇచ్చేందుకు దేవుడు ఊరీము[b] ప్రయోగించ లేదు. 7 చివరికి సౌలు తన మనుష్యులతో, “ఒక కర్ణపిశాచంగల స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతుందో ఆమెను అడుగుతాను” అని చెప్పాడు.
“ఏన్దోరులో కర్ణపిశాచం గల ఒక స్త్రీ వుందని” అతని అధికారులు అతనితో చెప్పారు.
8 అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని ఆ స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.
9 కానీ ఆ స్త్రీ, “సౌలు ఏమి చేసాడో నీకు ఖచ్చితంగా తెలుసు. కర్ణపిశాచముగలవారిని, చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెళ్లగొట్టాడు. నీవు నన్ను ఉరివేసి చంపాలని చూస్తున్నావు” అని సౌలుతో అంది.
10 సౌలు యెహోవా పేరును ప్రయోగించి ఆ స్త్రీకి ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా చెబుతున్నాను. నీవు ఈ పని చేసినందుకు శిక్షపొందవు” అన్నాడు.
11 “అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించమంటావు?” అని ఆ స్త్రీ సౌలును అడిగింది.
“సమూయేలును” అన్నాడు సౌలు.
12 ఆ స్త్రీ సమూయేలును చూచి చావుకేక వేసింది. “నీవు నన్ను మాయ చేసావు, నీవు సౌలువే” అంది ఆ స్త్రీ సౌలుతో.
13 “అయినా ఏమీ భయపడకు! నీవు ఏమి చూస్తున్నావు?” అన్నాడు సౌలు ఆమెతో.
“భూమిలో నుండి[c] ఒక ఆత్మ రావటం నేను చూస్తున్నాను” అంది ఆ స్త్రీ.
14 “అయితే, వాని ఆకారం ఎలా ఉంది?” అని సౌలు అడిగాడు.
“అతడు అంగీ ధరించిన ముసలివానిలా కనబడుతున్నాడు” అని ఆ స్త్రీ జవాబిచ్చింది.
అది సమూయేలు అని అప్పుడు సౌలుకు తెలిసింది. సౌలు సాష్టాంగపడి నమస్కరించాడు. 15 “నన్నెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు?” అన్నాడు సమూయేలు సౌలుతో.
సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, ప్రవక్తల ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు చెప్పాలి” అన్నాడు.
16 సమూయేలు, “యెహోవా నిన్ను విసర్జించి ఇప్పుడు ఆయన నీ పొరుగువానితో ఉన్నాడు. అందు చేత నీవు నన్నెందుకు పిలిచావు? 17 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో అదే చేసాడు. ఈ విషయాలు నాద్వారా నీకు చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతులనుండి తీసివేసాడు. దానిని నీ పొరుగు వారిలో ఒకనికి ఆయన ఇచ్చాడు. ఆ పొరుగు వాడే దావీదు! 18 నీవు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. నీవు అమాలేకీయులను నాశనం చేయలేదు, వారిమీద యెహోవా ఎంత కోపగించాడో వారికి చూపించలేదు. అందుకే దేవుడు ఈ వేళ నీకు దీనిని చేసాడు. 19 యెహోవా ఇశ్రాయేలును, నిన్ను కూడ ఫిలిష్తీయులకు ఇచ్చివేసాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. రేపు నీవూ, నీ కుమారులు కూడా నాతో పాటు ఇక్కడ ఉంటారు” అని చెప్పాడు.
యూదులుకానివాళ్ళు చేసిన పాపాలు
18 భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు. 19 తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.
20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
21 ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అంధకారమైపోయాయి. 22 వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. 23 ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.
24 అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు. 25 దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!
© 1997 Bible League International