Revised Common Lectionary (Complementary)
22 పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు. 23 అతనిలా అన్నాడు:
“ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు.
41-42 “ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీ ప్రతిభా విశేషాలను గురించి వింటారు. వారు దూర ప్రాంతాలనుండి దేవాలయానికి ప్రార్థనలు చేయటానికి వస్తారు. 43 నీ పరలోక నివాసంనుండి దయచేసి వారి మనవి ఆలకించు. ఇతర ప్రాంతాలవారు నిన్నడిగినదంతా దయచేసి నెరవేర్చు. ఇశ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ అలా నీపట్ల విధేయులైయుంటారు. అప్పుడు సర్వప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు.
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
1 మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడనైన పౌలు నుండియు,
2 మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు గలతీయలో ఉన్న సంఘాలకు:
3 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక! 4 ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడుతనం నుండి రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్ఛను పూర్తి చేసాడు. 5 దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! ఆమేన్.
ఒకే ఒక సువార్త
6 తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. 7 నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. 8 నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక. 9 మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!
10 నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు.
దేవుని పిలుపు
11 సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి. 12 నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.
యేసు శతాధిపతి సేవకుని నయం చేయటం
(మత్తయి 8:5-13; యోహాను 4:43-54)
7 యేసు తాను చెప్పవలసినవన్నీ చెప్పాడు. ప్రజలు ఆయన చెప్పినవన్నీ విన్నారు. ఆ తర్వాత యేసు కపెర్నహూముకు వెళ్ళాడు. 2 అక్కడ కపెర్నహూములో ఒక శతాధిపతి ఉండేవాడు. అతని సేవకుడు జబ్బుతో చాలా బాధపడ్తూ చివరి దశలో ఉన్నాడు. శతాధిపతి అతణ్ణి చాలా ప్రేమతో చూసుకొనేవాడు. 3 ఆ శతాధిపతి యేసును గురించి విన్నాడు. అతడు యూదుల పెద్దల్ని కొందర్ని పంపించి తన సేవకునికి వచ్చి నయం చేయమని అడగమన్నాడు. 4 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “ఈ మనిషి మీ సహాయం పొందటానికి అర్హుడు. 5 మన సమాజ మందిరాన్ని కట్టించిన వాడు అతడే” అని దీనంగా అన్నారు.
6 యేసు వాళ్ళ వెంట వెళ్ళాడు. ఆయన శతాధిపతి యింటికి వస్తుండగా ఆ శతాధిపతి తన స్నేహితుల్ని పంపి ఆయనతో యిలా చెప్పమన్నాడు: “ప్రభూ! మీరు నా గడప దాటి నా యింట్లో కాలు పెట్టే అర్హత నాకు లేదు. మీకా శ్రమ వద్దు. 7 నేను మీ దగ్గరకు వచ్చే అర్హత నాకు ఉందనుకోను. కనుక అక్కడినుండి ఆజ్ఞాపిస్తే నా సేవకునికి నయమైపోతుంది. 8 ఆజ్ఞాపించటం అంటే ఏమిటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకరి అధికారంలో ఉన్నవాణ్ణి. నా క్రింద ఉన్న సైనికులపై నాకు అధికారం ఉంది. ఇతణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. అతణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘యిది చెయ్యి’ అంటే చేస్తాడు.”
9 యేసు శతాధిపతి చెప్పి పంపింది విని ఆశ్చర్యపొయ్యాడు. తనను అనుసరిస్తున్న ప్రజల వైపు తిరిగి, “ఇంత భక్తి నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదని చెప్పగలను” అని అన్నాడు.
10 యేసు దగ్గరకు పంపబడిన పెద్దలు తిరిగి శతాధిపతి దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆ సేవకునికి నయమై ఉండటం గమనించారు.
© 1997 Bible League International