Revised Common Lectionary (Complementary)
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
31 “ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు. ఆ వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు. 32 పరలోకంలోనుండి నీవు అది విని, ఆ వ్యక్తి పట్ల న్యాయనిర్ణయం చెయ్యి. దోషిని శిక్షించి, అమాయకుడైన వానిని క్షమించు.
33 “కొన్నిసార్లు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ పట్ల పాపం చేయవచ్చు; మరియు వారి శత్రువులు వారిని ఓడించవచ్చు. వారు మరల నీ వద్దకు తిరిగివచ్చి నీకు స్తోత్రం చేస్తారు. ఈ దేవాలయంలో వారు నిన్ను వేడుకొంటూ ప్రార్థనలు చేస్తారు. 34 పరలోకంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించు. మళ్లీ వారి రాజ్యం వారికి వచ్చేలా చేయి. ఈ రాజ్యం వారి పూర్వీకులకు నీవు ఇచ్చినదే!
35 “మరి కొన్ని సార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు చేస్తావు. వారు మరల ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు. 36 ఇది జరిగినప్పుడు, పరలోకంలో నీవు వారి ప్రార్థన ఆలకించుము. నీ సేవకుడనగు నా తప్పులు, ఇశ్రాయేలు ప్రజల తప్పులను మన్నించు. పరలోకాన్నిగురించి వారికి బోధించు. యెహోవా, అప్పుడు దయచేసి రాజ్యంలో వర్షం కురిపించు. ఈ రాజ్యం వారికి నీవిచ్చినదే!
37 “ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు. బహుశా పండిన పంటనంతా క్రిమికీటకాదులు నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్థులు కావచ్చు. 38 వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఏ ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే, 39 దయచేసి అతని ప్రార్థన ఆలకించు. పరలోకంలో నీవు నీ నివాసంలో వుండగా దానిని ఆలకించు. ఆలకించి ఈ ప్రజలను మన్నించి, వారికి సహాయం చేయి. ప్రజలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోగల శక్తి నీకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కావున ప్రతి వ్యక్తికీ తీర్పు తీర్చి ఏది ఉచితమో వానికి అది చేయి. 40 నీవు అలాగున చేయి. దానివల్ల వారు నీ పట్ల భయభ్రాంతులతో, భక్తి భావంతో మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో సదా జీవిస్తారు.
యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం
(మార్కు 1:21-28)
31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.
33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.
36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.
© 1997 Bible League International