Revised Common Lectionary (Complementary)
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియున్నారు. రాజైన సొలొమోను వారి వైపు తిరిగి వారిని దీవించుమని దేవుడిని అడిగాడు. 15 తరువాత రాజైన సొలొమోను దేవునికి సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. అతడిలా అన్నాడు:
“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నతుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట ప్రకారం అతడు అన్నీ నెరవేర్చాడు. 16 యెహోవా నా తండ్రితో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టునుండి విముక్తులను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయలేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించటానికి దావీదును ఎంపిక చేశాను’ అని చెప్పాడు.
17 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఘనంగా ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కిలిగా కోరుకున్నాడు. 18 కాని యెహోవా నా తండ్రి దావీదుతో ‘నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం సంతోషించ తగ్గ విషయం. 19 కాని నాకు దేవాలయం కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు,’ అని అన్నాడు.
20 “కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నా తండ్రి దావీదు స్థానంలో ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను దేవాలయం కట్టించాను. 21 దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు.”
పౌలు మరియు అబద్ధపు అపొస్తలులు
11 నా తెలివితక్కువతనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. 2 మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను. 3 సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. 4 ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.[a]
5 ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను. 6 మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.
© 1997 Bible League International