Revised Common Lectionary (Complementary)
17 కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ్రమయ్యింది. చివరిగా అతని శ్వాస ఆగిపోయింది. 18 ఆమె ఏలీయా వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా చేయటానికే నీవు వచ్చావా?” అని అడిగింది.
19 “నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు. 20 తరువాత ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభువైన దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద నీవు కలుగజేస్తావా? ఆమె కుమారుడు చనిపోయేలా చేస్తావా?” 21 పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! ఈ బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు.
22 యెహోవా ఏలీయా ప్రార్థన ఆలకించాడు. బాలుడు శ్వాసపీల్చటం ప్రారంభించాడు. వాడు బతికాడు. 23 ఏలీయా బాలుని కిందికి తీసుకుని వచ్చాడు. బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు బతికాడు” అని ఏలీయా అన్నాడు.
24 “నీవు నిజంగా దైవజనుడవేనని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లాడుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ స్త్రీ అన్నది.
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
దేవుని పిలుపు
11 సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి. 12 నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.
13 నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు. 14 నేను యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైనవాడను. నా పూర్వికుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది.
15 కాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కుమారుణ్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు. 16 నేను యూదులు కానివాళ్ళకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేనీ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించ లేదు. 17 నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్నవాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను.
18 మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను. 19 ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపొస్తలులెవరూ నాకు కనిపించలేదు. 20 నేను అబద్ధం వ్రాయటంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను. 21 ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు వెళ్ళాను.
22 యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. 23 “ఇదివరలో మనవాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు. 24 మరియు నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
చనిపోయిన వాణ్ణి బ్రతికించటం
11 ఆ తర్వాత యేసు నాయీను అనే పట్టణానికి వెళ్ళాడు. ఆయన శిష్యులు, చాలా మంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. 12 ఆయన ఆ పట్టణం యొక్క ముఖ్య ద్వారం చేరుకుంటుండగా కొందరు శవాన్ని మోసుకొని వెళ్తుండటం చూశాడు. అతని తల్లికి ఈ చనిపోయిన వాడు మాత్రమే కుమారుడు. తల్లి వితంతువు. ఆ వూరి వాళ్ళు అనేకులు ఆమె వెంటవున్నారు. 13 ఆమెను చూసి ప్రభువు హృదయం కరిగి పోయింది. ఆయన ఆమెతో, “దుఃఖించకమ్మా” అని అన్నాడు. 14 ఆ తదుపరి వెళ్ళి పాడెను తాకాడు. పాడె మోసుకు వెళ్తున్న వాళ్ళు కదలకుండా ఆగిపోయారు. యేసు, “బాబూ! లెమ్మని నీతో చెబుతున్నాను!” అని అన్నాడు. 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు అతణ్ణి అతని తల్లికి అప్పగించాడు.
16 వాళ్ళందరిలో భక్తి, భయము నిండుకు పోయాయి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు, “ఒక గొప్ప ప్రవక్త మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడటానికి వచ్చాడు” అని అన్నారు.
17 యేసును గురించి యూదయ ప్రాంతంలోను, దాని చుట్టూవున్న ప్రాంతాల్లోను తెలిసిపోయింది.
© 1997 Bible League International