Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
దావీదు మరణించుట
2 దావీదుకు మరణకాలం సమీపించింది. కావున దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు: 2 “నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, సమర్థవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో. 3 దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పినవన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది. 4 నీవు యెహోవాకు విధేయుడవయివుంటే, ఆయన నాగురించి చేసిన ప్రమాణం నెరవేర్చుతాడు. యెహోవా నాకు చేసిన వాగ్దానమిది: ‘నీవారు నా ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించినరీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగివుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలపై పాలకుడుగా వుంటాడు.’”
5 “సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి. 6 కాని ఇప్పుడు నీవు రాజువు. నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంపబడాలి.”
7 “గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల నీవు దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీకరించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ సోదరుడగు అబ్షాలోము నుండి నేను పారిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు.
8 “గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసి షిమీని నేను చంపనని చెప్పాను. 9 కావున నీవు వానిని శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.”
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(లూకా 11:9-13)
7 “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. 8 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.
9 “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? 10 లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా? 11 దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు.
© 1997 Bible League International