Print Page Options
Previous Prev Day Next DayNext

Proverbs Monthly

Read through the book of Proverbs every month of the year.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 6

అప్పు ప్రమాదాలు

నా కుమారుడా, ఇంకొకని అప్పుకు బాధ్యునిగా ఉండకు. ఆ వ్యక్తి తన అప్పు చెల్లించలేనని చెబితే, అది నీవే చెల్లిస్తానని వాగ్దానం చేశావా? మరో మనిషి అప్పులకు నిన్ను నీవే బాధ్యునిగా చేసుకొన్నావా? అలాగైతే నీవు పట్టుబడ్డట్టే! నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేశాయి! నీవు ఆ మనిషి శక్తి కింద ఉన్నావు. కనుక అతని దగ్గరకు వెళ్లి, నిన్ను నీవే విముక్తుని చేసుకో. అతని బాకీ నుండి నిన్ను విడిపించమని నీవు అతణ్ణి బ్రతిమాలు. నిద్రపోయి, విశ్రాంతి తీసుకోనేంతవరకు వేచి ఉండవద్దు. వేటగాని బారినుండి పారిపోతున్న లేడివలె ఆ ఉచ్చు నుండి తప్పించుకో. ఉచ్చులో నుండి పారిపోతున్న పక్షివలె, నిన్ను నీవే నిడుదల చేసుకో.

సోమరిగా ఉండుటవల్ల అపాయాలు

సోమరీ, నీవు చీమల దగ్గరకు వెళ్లి చీమలు ఏమి చేస్తుంటాయో చూడు. చీమ దగ్గర నేర్చుకో. చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. కాని చీమ, దాని ఆహారాన్ని వేసవిలో కూర్చుకొంటుంది. చీమ, దాని ఆహారాన్ని దాచుకొంటుంది. చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది.

సోమరీ, ఇంకెంతనేపు నీవు అక్కడ పండుకొంటావు. నీ విశ్రాంతి నుండి నీవు యింకెప్పుడు లేస్తావు? 10 “నాకు ఇంకొంచెం నిద్ర కావాలి. యింకాకొంచెంసేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను” అని సోమరి చెబుతాడు. 11 కాని అతడు నిద్రపోతాడు, మళ్లీ నిద్రపోతాడు; అతడు అతి దరిద్రుడవుతాడు. త్వరలోనే అతనికి ఏమీ ఉండదు. ఒక దొంగవాడు వచ్చి సమస్తం దోచుకున్నట్టు ఉంటుంది.

సమస్య కారకులు

12 దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్ధాలు చెబుతాడు. చెడ్డ సంగతులే చెబుతాడు. 13 అతడు కన్నుగీటి, సూచనలు చేసి మనుష్యులను మోసం చేస్తాడు. 14 ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపూ అతడు దుర్మార్గపు పథకాలే వేస్తాడు. అన్నిచోట్లా అతడు చిక్కులు పెడుతుంటాడు. 15 కాని అతడు శిక్షించబడతాడు. కష్టం అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం చేయరు.

యెహోవా అసహ్యించుకొనే ఏడు సంగతులు

16 ఈ ఆరు విషయాలను యెహోవా అసహ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన అసహ్యించుకొంటాడు.
17     ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే మనిషి. అబద్దాలు చెప్పే మనిషి. నిర్దోషులను చంపే మనిషి.
18     చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. దుర్మార్గం చేయాలని కోరే మనిషి.
19     అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి. వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి.

వ్యభిచారముకు విరోధంగా హెచ్చరిక

20 నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. మరియు నీ తల్లి ఉపదేశాలు మరువకు. 21 వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. వారి ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకో. 22 నీవు ఎక్కడికి వెళ్లినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకొని ఉంటాయి. మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి.

23 నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరైన దారి చూపించే వెలుగులా ఉంటాయి. నీవు జీవమార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది, నీకు శిక్షణ ఇస్తాయి. 24 నీవు చెడు స్త్రీ దగ్గరకు వెళ్లకుండా వారి ఉపదేశము నిన్ను వారిస్తుంది. తన భర్తను విడిచిపెట్టేసిన భార్య మెత్తటి మాటల నుండి వారి మాటలు నిన్ను కాపాడుతాయి. 25 ఆ స్త్రీ అందమైనది కావచ్చు. కాని ఆ అందం నీలో నిన్ను మండింపచేసి శోధించ నీయకు. ఆమె కండ్లను నిన్ను బంధించనియ్యకు. 26 ఒక వేశ్య ఖర్చు ఒక రొట్టె ముక్క కావచ్చు. కాని మరో పురుషుని భార్య నీ జీవితమంతా ఖర్చు చేయవచ్చు. 27 ఒకడు తన మీద నిప్పువేసుకుంటే అతని బట్టలు కూడా కాలిపోతాయి. 28 ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది. 29 మరొకడి భార్యతో పండుకొనే ఏ మనిషి విషయమైనా ఇంతే. ఆ మనిషి నష్టపోతాడు.

30-31 ఒకడు ఆకలితో ఉండి తినుటకు భోజనం దొంగిలించవచ్చు. ఒకవేళ అతడు పట్టుబడితే అతడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు అదనంగా చెల్లించాలి. అతనికి ఉన్న సమస్తం దీని మూలంగా ఖర్చు కావచ్చును. కాని ఇతరులు గ్రహిస్తారు. అతని మీద వారికి గల గౌరవం అంతా పోదు. 32 అయితే, వ్యభిచారం చేసే పురుషుడు బుద్ధిహీనుడు. అతడు తనకు తానే నాశనం చేసుకుంటాడు. తన నాశనానికి తానే కారణం అవుతాడు. 33 ప్రజలకు అతని మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. మరియు ఆ అవమానాన్ని అతడు ఎన్నటికీ మరచిపోడు. 34 ఆ స్త్రీ యొక్క భర్తకు రోషం వస్తుంది. ఆ భర్తకు చాలా కోపం వస్తుంది. అవతలి వాడిని శిక్షించేందుకు ఇతడు చేయగలిగింది ఏదైనా చేసేస్తాడు. 35 ఏ విధంగా చెల్లించినా ఎంత డబ్బు చెల్లించినా అతని కోపాన్ని ఆపేందుకు చాలదు!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International