Old/New Testament
తూరు—సముద్రాలకు ద్వారం
27 మరొకసారి యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము. 3 తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము:
“‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు.
అనేక దేశాలకు నీవు వ్యాపారివి.
తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు.
నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు.
నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!
4 మధ్యధరా సముద్రం నీ నగరం చుట్టూ సరిహద్దు.
నిన్ను నిర్మించిన వారు నిన్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు!
నీ నుండి ప్రయాణమై వెళ్లే ఓడలవలె నీవు ఉన్నావు.
5 నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి
తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు.
లెబానోను సరళవృక్షపు కర్రతో
నీ ఓడ స్తంభాలను చేశారు.
6 బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో
పడవ తెడ్లు చేశారు.
కిత్తీయుల ద్వీపం (సైప్రస్) నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను వినియోగించి
అడుగు అంతస్థులో గదిని నిర్మించారు.
ఈ గదిని దంతపు పనితో అలంకరించారు.
7 ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు.
ఆ తెరచాపయే నీ పతాకం.
నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి.
అవి ఎలిషా (సైప్రస్)[a] ద్వీపంనుండి వచ్చినవి.
8 సీదోనూ, అర్వదు నివాసులు నీ కొరకు నీ పడవలు నడిపారు.
తూరూ, నీ వారిలో తెలివి గలవారు నీ ఓడలకు చుక్కాని పట్టారు.
9 బిబ్లోసు (గెబలు) పెద్దలు, నేర్పరులైన పనివారు ఓడమీద ఉండి
చెక్కల మధ్య కీలువేసి ఓడను బాగుచేశారు.
సముద్రం మీదనున్న అన్ని ఓడలు, వాటి నావికులు
నీతో వర్తక వ్యాపారాలు చేయటానికి నీ వద్దకు వచ్చారు.’
10 “పారసీకులు (పర్షియావారు), లూదు వారు, పూతువారు నీ సైన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ వీరులు. వారు తమ డాళ్లను, శిరస్త్రాణాలను నీ గోడలకు వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు. 11 నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ వాళ్లు తమ డాళ్లను వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు.
12 “తర్షీషు[b] నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. నీవు అమ్మే అద్భుతమైన వస్తువులకు వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు. 13 గ్రీకేయులు, టర్కీ (తుబాలువారు) మరియు నల్ల సముద్రపు (మెషెకు) ప్రాంత ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు అమ్మే సరుకులకు వారు బానిసలను, కంచును ఇచ్చేవారు. 14 తోగర్మా ప్రజలు నీవు అమ్మిన వస్తువులకు గుర్రాలను, యుద్ధాశ్వాలను, కంచర గాడిదలను ఇచ్చేవారు. 15 దదాను ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు నీ సరుకులను అనేకచోట్ల అమ్మావు. నీ సరుకులకు మూల్యంగా వారు ఏనుగు దంతాలు, విలువగల కోవిదారు కలపను ఇచ్చేవారు. 16 నీవద్ద అనేక మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టలు, సున్నితమైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకైన నారబట్టలు, పగడాలు, కెంపులు ఇచ్చేవారు.
17 “యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీతో వర్తకం చేశారు. వారు నీవద్ద కొనే సరుకులకు గోధుమ, ఒలీవలు, ముందు వచ్చే అత్తిపళ్లు, తేనె, నూనె, గుగ్గిలం యిచ్చేవారు. 18 దమస్కు నీకు మరో మంచి ఖాతాదారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు కొనుగోలు చేశారు. ప్రతిగా వారు హెల్బోను నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు. 19 నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్ నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు మారుగా ఇచ్చేవారు. 20 వ్యాపారం ముమ్మరంగా సాగటానికి దదాను దోహద పడింది. వారు గుర్రపు గంతపై వేసే బట్టను, స్వారీ గుర్రాలను నీకిచ్చి సరుకులు కొనేవారు. 21 అరబీయులు (అరేబియావారు) కేదారు నాయకులు నీకు గొర్రె పిల్లలను, పొట్లేళ్లను, మేకలను ఇచ్చి నీవద్ద ఉన్న సరుకులు కొనేవారు. 22 షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు. 23 హారాను, కన్నే, ఏదెను, షేబ, అష్షూరు మరియు కిల్మదు దేశాల ప్రజలు, వర్తకులు నీతో వ్యాపారం చేశారు. 24 నీవద్ద కొన్న సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, నీలవర్ణపు, అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, బాగా పురిపెట్టి పేనిన తాళ్ళు, దేవదారు కలపతో చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు సామగ్రులతో వారు నీతో వ్యాపారం చేశారు. 25 నీవు అమ్మిన సరుకులు తర్షీషు ఓడలు మోసుకుపోయేవి.
“తూరూ! నీవు సరుకులతో నిండిన ఓడలాంటి దానివి.
నీవు సముద్రం మీద అనేకమైన విలువగల సరుకులతో ఉన్నదానివి.
26 నీ పడవలను నడిపిన నావికులు నిన్ను మహా సముద్రాల మధ్యగా తీసుకొని వెళ్తారు.
కాని బలమైన తూర్పు గాలులు నీ ఓడను నడిసముద్రంలో నాశనం చేస్తాయి.
27 నీ ధనమంతా సముద్రం పాలవుతుంది.
నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు,
కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది
అంతా సముద్రంలో మునిగిపోతారు!
నీవు నాశనమయ్యే రోజున
ఇదంతా జరుగుతుంది.
28 “నీ వ్యాపారులను నీవు బహుదూర ప్రాంతాలకు పంపిస్తావు.
అయితే నీ ఓడ చుక్కాని పట్టేవాని రోదన విన్నప్పుడు ఆ ప్రాంతాలు భయంతో వణకిపోతాయి!
29 నీ ఓడ సిబ్బంది అంతా ఓడ నుండి దుముకుతారు.
నీ నావికులు, చుక్కాని పట్టేవారు ఓడ నుండి దుమికి ఒడ్డుకు ఈదుతారు.
30 వారు నిన్ను గురించి చాలా బాధపడతారు.
వారు రోదిస్తారు. వారు తమ తలలపై దుమ్ము పోసుకుంటారు. వారు బూడిదలో పొర్లాడుతారు.
31 నీ కొరకు వారు తమ తలలు గొరిగించుకుంటారు.
వారు విషాద సూచక దుస్తులు ధరిస్తారు.
వారు నీకొరకు దుఃఖిస్తారు.
మృతుడైన వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు.
32 “వారి భయంకర రోదనలో, ఈ విషాద గీతం వారు ఆలపిస్తూ నీకొరకు విలపిస్తారు,
“‘తూరు వంటిది మరొక్కటి లేదు!
నడి సముద్రంలో తూరు నాశనమయ్యింది!
33 నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు.
నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులతోను నీవనేక మందిని తృప్తిపర్చావు.
ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!
34 కాని నీవు నడిసముద్రంలో,
అగాధంలో ముక్కలై పోయావు.
నీవు అమ్మే వస్తువులతో పాటు
నీ మనుష్యులందరూ కూలిపోయారు!
35 తీరవాసులంతా నీ విషయంలో అదిరిపోయారు.
వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
వారి ముఖాలు చిన్నబోయాయి.
36 ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా మాట్లాడారు.
నీకు జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి.
ఎందువల్లనంటే నీవు సర్వనాశనమయ్యావు.
నీవిక లేవు.’”
తూరు తనను తాను దేవునిగా భావించుకోవటం
28 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: 2 “నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా:
“‘నీవు గర్విష్ఠివి!
“నేనే దేవుడను!
సముద్ర మధ్యంలో దైవ స్థానంలో కూర్చున్నాను”
అని నీవంటున్నావు.
“‘కాని నీవు మానవ మాత్రుడవు. దేవుడవు, మాత్రం కాదు.
నీవు దేవుడవని నీకై నీవే అనుకుంటున్నావు.
3 నీవు దానియేలు[c] కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు!
రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.!
4 నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు.
నీ ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు.
5 గొప్పదైన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్యారా నీ సంపదను పెంచావు.
ఇప్పుడా ఐశ్వర్యాన్ని చూచు కొని నీవు గర్వపడుతున్నావు.
6 “‘అందువల్ల నా ప్రభువైన యెహోవా చెపుతున్న దేమంటే,
నీవొక దేవుడిలా ఉన్నావని తలంచావు.
7 అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను.
వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు!
వారు తమ కత్తులను దూస్తారు.
నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు.
వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.
8 వారు నిన్ను సమాధిలోకి దించుతారు.
నడి సముద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు.
9 నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు.
అప్పుడు “నేను దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా?
ఆ సమయంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచుతాడు.
దానితో నీవొక మానవ మాత్రుడవనీ, దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు!
10 క్రొత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపివేస్తారు.
నేను ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ఆ పనులు జరుగుతాయి!’”
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
11 యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 12 “నరపుత్రుడా, తూరు రాజును గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘నీవు ఆదర్శ పురుషుడవు.
నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
13 దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు.
నీవద్ద ప్రతి విలువైన రత్నం ఉంది.
కెంపులు, గోమేధికము, ఇతర రత్నాలు;
గరుడ పచ్చలు, సులిమానురాయి, పచ్చరాయి;
నీల మణులు, వైడూర్యము, మరకత పచ్చలు.
వీటిలో ప్రతిరాయీ బంగారంలో పొదగబడింది.
నీవు సృష్టింపబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు.
14 నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ[d] ఒకడవై యున్నావు.
నీ రెక్కలు నా సింహాసనం మీదికి చాపబడ్డాయి.
దేవుని పవిత్ర పర్వతం మీద నిన్ను ఉంచాను.
అగ్నిలా మెరిసే ఆభరణాల గుండా నీవు నడిచావు.
15 నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, యోగ్యుడిగా ఉన్నావు.
కాని ఆ తరువాత నీవు దుష్టుడవయ్యావు.
16 నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది.
ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు.
అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను.
దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను.
నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు.
నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి.
కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను
వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.
17 నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు.
నీ గొప్పతనం యొక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది.
అందువల్ల నిన్ను క్రిందికి పడదోశాను.
ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.
18 నీవు చాలా పాపాలు చేశావు.
నీవు చాలా కుటిలమైన వర్తకుడవు.
ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు.
కావున నీలో నేను అగ్ని పుట్టించాను.
అది నిన్ను దహించి వేసింది!
నీవు నేలమీద బూడిదవయ్యావు.
ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.
19 ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని
చూచి ఆశ్చర్యపోయారు.
నీకు వచ్చిన ఆపద ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.
నీవు సర్వనాశనమయ్యావు.’”
సీదోనుకు వ్యతిరేకంగా వర్తమానం
20 యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, సీదోను పట్టణం వైపు చూడు. నా తరపున ఆ ప్రదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుము. 22 ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని!
నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు!
నేను సీదోనును శిక్షిస్తాను.
ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు.
నేను పవిత్రుడనని వారు నేర్చుకుని
నన్ను ఆ విధంగా చూసుకుంటారు.
23 రోగాలను, మరణాన్ని నేను సీదోనుకు పంపిస్తాను.
ఖడ్గం (శత్రు సైన్యం) నగరం వెలుపల చాలా మందిని చంపుతుంది.
వారప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటారు!’”
ఇతర రాజ్యాలు ఇశ్రాయేలును పరిహసించటం మానుట
24 “‘గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే ముండ్లు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’”
25 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చాను. 26 వారు ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, ద్రాక్షాతోటలు పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొంటారు.”
ఈజిప్టుకు వ్యతిరేకంగా వర్తమానం
29 దేశం నుండి వెళ్లగొట్టబడిన పదవ సంవత్సరం, పదవనెల (జనవరి) పన్నెండవరోజున నా ప్రభువైన యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోవైపు చూడు. నా తరపున నీవు అతనికి (ఈజిప్టుకు) వ్యతిరేకంగా మాట్లాడుము. 3 నీవు ఈ విధముగా మాట్లాడుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘ఈజిప్టు రాజువైన ఫరో, నేను నీకు విరోధిని.
నీవు నైలునదీ తీరాన పడివున్న ఒక పెద్ద క్రూర జంతువువి.
“ఈ నది నాది! ఈ నదిని నేను ఏర్పాటు చేశాను!”
అని నీవు చెప్పుకొనుచున్నావు.
4-5 “‘కాని నేను నీ దవడలకు గాలం వేస్తాను.
నైలునదిలోని చేపలు నీ చర్మపు పొలుసులను అంటుకుంటాయి.
పిమ్మట నిన్ను, నీ చేపలను నదిలోనుంచి లాగి నేలమీదికి ఈడ్చుతాను.
నీవు నేలమీద పడతావు.
నిన్నెవ్వరూ లేవనెత్తటం గాని,
పాతిపెట్టడం గాని, చేయరు.
నేను నిన్ను అడవి జంతువులకు, పక్షులకు వదిలివేస్తాను.
నీవు వాటికి ఆహారమవుతావు.
6 ఈజిప్టు నివసిస్తున్న ప్రజలంతా నేనే
యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు!
“‘నేనీ పనులు ఎందుకు చేయాలి?
ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
కాని ఈజిప్టు రెల్లు గడ్డిలా బలహీనమైనది.
7 ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
కాని ఈజిప్టువారి చేతులకు, భుజాలకు తూట్లు పొడిచింది.
వారు సహాయం కొరకు నీ మీద ఆధారపడ్డారు.
కాని నీవు వారి నడుము విరుగగొట్టి, మెలిపెట్టావు.’”
8 కావున నా ప్రభువైన యెహోవా, ఈ విషయాలు చెపుతున్నాడు:
“నేను నీ మీదికి కత్తిని రప్పిస్తున్నాను.
నేను నీ ప్రజలందరినీ, పశువులనూ నాశనం చేస్తాను.
9 ఈజిప్టు నిర్మానుష్యమై నాశనమవుతుంది.
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
దేవుడు ఇలా చెప్పాడు: “నేనెందుకీ పనులు చేయాలి? ‘ఈ నది నాది. ఈ నదిని నేను ఏర్పాటు చేశాను’ అని నీవు చెప్పుకున్నందువల్ల! నేను ఆ పనులు చేయదలిచాను. 10 కావున నేను (దేవుడు) నీకు వ్యతిరేకిని. అనేకంగా ఉన్న నైలు నదీ శాఖలకు నేను విరోధిని. నేను ఈజిప్టును పూర్తిగా నాశనం చేస్తాను. మిగ్దోలునుండి ఆశ్వన్ (సెవేనే) వరకు, మరియు ఇథియోపియ (కూషు) సరిహద్దు వరకు గల నగరాలన్నీ నిర్మానుష్యమై పోతాయి. 11 మనుష్యుడే గాని, జంతువే గాని ఈజిప్టు దేశం గుండా వెళ్లరు. 12 పాడుబడ్డ దేశాల మధ్యలో ఈజిప్టు దేశాన్ని పాడుబడ్డ నగరాల మధ్యలో దాని నగరాన్ని పాడుగా చేస్తాను. అది నలభై సంవత్సరాలు పాడుగా ఉంటుంది. ఈజిప్టు వారిని జనాల మధ్యలోనికి తోలివేసి చెదరగొడతాను. చెదరగొట్టిన దేశాల్లో నేను వారిని పరాయి వారినిగా చేస్తాను.”
13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టు ప్రజలను నేను అనేక దేశాలకు చెదరి పోయేలా చేస్తాను. కాని నలభై సంవత్సరాల అనంతరం ఆ ప్రజలను నేను మళ్లీ సమీకరిస్తాను. 14 ఈజిప్టు బందీలను నేను వెనుకకు తీసుకొని వస్తాను. ఈజిప్టువారిని వారి జన్మస్థలమైన పత్రోసుకు తిరిగి తీసుకొని వస్తాను. అయితే వారి రాజ్యానికి మాత్రం ప్రాముఖ్యం ఉండదు. 15 అది పాముఖ్యం లేని రాజ్యంగా తయారవుతుంది. అది మరెన్నడూ సాటి రాజ్యాల కంటె మిన్నగా పెరగజాలదు. అది ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చేయలేనంత చిన్నగా దానిని నేను తగ్గించి వేస్తాను. 16 ఇశ్రాయేలు వంశం వారు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద మరెన్నడు ఆధార పడరు. ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటారు. తమ సహాయం కొరకు దేవుని అర్థించకుండా ఈజిప్టును ఆశ్రయించిన తమ పాపాన్ని వారు గుర్తు తెచ్చుకుంటారు. నేనే ప్రభువైన యెహోవానని వారు గుర్తిస్తారు.”
బబులోను ఈజిప్టును వశపర్చుకొంటుంది
17 దేశంనుండి వెళ్ల గొట్టబడిన ఇరవై ఏడవ సంవత్సరం, మొదటి నెల (ఏప్రిల్) మొదటి రోజున దేవుని వాక్కు నాకు వినబడింది. ఆయన ఇలా చెప్పాడు, 18 “నరపుత్రుడా, బబులోను రాజైన నెబుకద్నెజరు తూరుపై యుద్ధంలో తన సైన్యాలు తీవ్రంగా పోరాడేలాగు చేశాడు. వాళ్లు ప్రతి సైనికుని తల గొరిగారు. బరువైన పనులు ప్రతి సైనికుని తలమీద రుద్దబడినవి. ప్రతి సైనికుని భుజం కొట్టుకుపోయి పుండయ్యింది. తూరును ఓడించటానికి నెబుకద్నెజరు, అతని సైన్యం చాలా శ్రమ పడవలసి వచ్చింది. కాని ఆ శ్రమకు తగిన ప్రతిఫలం వారికి దక్కలేదు.” 19 అందువల్ల నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజ్యాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. నెబుకద్నెజరు ఈజిప్టు ప్రజలను పట్టుకు పోతాడు. ఈజిప్టు నుంచి విలువైన వస్తువుల నెన్నింటినో నెబుకద్నెజరు తీసుకొనిపోతాడు. అదే నెబుకద్నెజరు సైన్యానికి పారితోషికం. 20 నెబుకద్నెజరు చేసిన కష్టానికి అతనికి నేను ఈజిప్టు రాజ్యాన్ని ప్రతిఫలంగా ఇస్తున్నాను. వారు నా కొరకు పనిచేశారు గనుక నేనిది వారికి చేస్తున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
21 “ఆ రోజన ఇశ్రాయేలు వంశాన్ని నేను బలపర్చుతాను. పైగా నీ ప్రజలు ఈజిప్టువారిని చూచి నవ్వుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”
భార్యభర్తలు
3 అదే విధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒకవేళ ఏ పురుషుడైనా దైవసందేశానుసారం నడుచుకోక పోతే ఆ సందేశాన్ని గురించి ప్రస్తావించకుండానే స్త్రీలారా, మీ నడత ద్వారా 2 మీ పవిత్రతను, భక్తిని వాళ్ళు చూడటంవల్ల మీ భర్తలు మంచి దారికి రాగలరు. 3 జడలు వేసి, బంగారు నగలు ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటంకన్నా 4 మీ అంతరాత్మను సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు.
5 దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన పూర్వకాలపు స్త్రీలు యిలాంటి గుణాలతో అలంకరించుకునేవాళ్ళు. వాళ్ళు తమ భర్తలకు అణిగిమణిగి ఉండేవాళ్ళు. 6 శారా తన భర్త అబ్రాహాముకు అణిగిమణిగి ఉండి, అతణ్ణి “యజమాని” అని పిలిచేది. మీరు కూడా నీతిగా ప్రవర్తిస్తూ, భయపడకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని శారా కుమార్తెల్లా పరిగణిస్తాడు.
7 భర్తలు, తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్ళని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి. మీతో సహ వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు. కనుక వాళ్ళను మీరు గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఏ ఆటంకము కలుగదు.
నీతి కోసం బాధలనుభవించటం
8 చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. 9 అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది:
“బ్రతకాలని ఇష్టపడే వాడు,
మంచిరోజులు చూడదలచినవాడు,
తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి.
తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి.
11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి.
శాంతిని కోరి సాధించాలి.
12 నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు.
వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు.
కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”(A)
13 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు? 14 కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” 15 క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. 16 కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.
17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.
18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
తీసుకు రావాలని నీతిమంతుడైన
క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.
© 1997 Bible League International