Old/New Testament
మోయాబును గురించిన సందేశం
48 ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“నెబో పర్వతానికి[a] చేటు కలుగుతుంది.
నెబో పర్వతం నాశనమవుతుంది.
కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది.
అది పట్టుబడుతుంది.
బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది.
అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.
2 మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు.
మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు.
‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు.
మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు.
కత్తి నిన్ను వెంటాడుతుంది.
3 హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలు విను.
అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.
4 మోయాబు ధ్వంసం చేయబడుతుంది.
దాని చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు.
5 మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు.
వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు.
హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను,
బాధతోను కూడిన రోదన వినిపించగలదు.
6 పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి!
ఎడారిలో అరుహ వృక్షం[b] వీచినట్లు మీరు పారిపొండి.
7 “మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు.
కావున మీరు పట్టుబడతారు.
కెమోషు[c] దైవం బందీగా కొనిపోబడతాడు.
అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు.
8 వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు.
ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు.
లోయ శిథిలము చేయబడుతుంది.
ఉన్నత మైదానం నాశనము చేయబడుతుంది.
యెహోవా ఇది జరుగుతుందని చెప్పినాడుగాన
ఇది జరిగి తీరుతుంది.
9 మోయాబు పొలాలపైన ఉప్పు[d] చల్లుము.
దేశం వట్టి ఎడారి అయిపోతుంది.
మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి.
వాటిలో ఎవ్వరూ నివసించరు.
10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా,
వారిని చంపటానికి తన కత్తిని వినియోగించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది.[e]
11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు.
కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది.
మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు.
అతడు నిర్బంధించబడి ఇతర దేశానికి కొనిపోబడలేదు.
పూర్వంవలెనే అతడు ఇప్పుడూ రుచిగానే వున్నాడు.
అతని సువాసన మారలేదు.”
12 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“కాని మిమ్మల్ని మీ జాడీలలో[f] నుంచి బయట పోయుటకు
అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను.
ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు.
తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.”
13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు[g] నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
14 “‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’
అని మీరు చెప్పుకోలేరు.
15 శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు.
శత్రువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం చేస్తాడు.
మోయాబు యువ వీరులంతా నరకబడతారు.”
ఈ వర్తమానం రాజునుండి వచ్చినది.
ఆ రాజు పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
16 “మోయాబు అంతం దగ్గర పడింది.
మోయాబు త్వరలో నాశనమైపోతుంది.
17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి.
మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు.
అందువల్ల వానికొరకు మీరు విచారించండి.
‘అధిపతుల అధికారం విరిగిపోయింది.
మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’
అని మీరు చెప్పండి.
18 “దీబోను వాసులారా
గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి.
నేలమీద మట్టిలో కూర్చోండి.
ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు.
అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.
19 “అరోయేరు నివాసులారా,
దారి ప్రక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి.
పారిపోయే మనిషిని చూడండి.
పారిపోయే స్త్రీని చూడండి.
ఏమి జరిగిందో వారిని అడగండి.
20 “మోయాబు పాడుపడి,
అవమానముతో నిండి పోతుంది.
మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది.
మోయాబు పాడుపడిపోయిందని అర్నోను నది[h] వద్ద ప్రకటించండి.
21 ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు.
తీర్పు హోలోనుకు వచ్చింది. యాహసు, మేఫాతు,
22 దీబోను, నెబో, బేత్-దిబ్లాతయీము,
23 కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను,
24 కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది.
మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది.
25 మోయాబు బలం తగ్గిపోయింది.
మోయాబు చేయి విరిగిపోయింది.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది.
కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి.
మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు.
ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.
27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు.
ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది.
నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి,
ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.
28 మోయాబు ప్రజలారా,
మీ పట్టణాలను వదిలిపెట్టండి.
వెళ్లి గుట్టల్లో నివసించండి.
గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”
29 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము.
అతడు మిక్కిలి గర్విష్ఠి.
తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు.
అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు.
అతడు మహా గర్విష్ఠి.”
30 యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు.
కాని అతని గొప్పలన్నీ అబద్ధాలు.
అతను చెప్పేవి చేయలేడు.
31 కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను.
మోయాబులో ప్రతి పౌరుని కొరకు విచారిస్తున్నాను.
కీర్హరెశు మనుష్యుల నిమిత్తం నేను బాధపడుతున్నాను.
32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను!
సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి.
అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి.
కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు.
33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి.
గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను.
రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి
వారి అలరింతలు అంతమయ్యాయి.
34 “హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది. 35 మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
36 “మోయాబు కొరకు నేను మిక్కిలి ఖిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి. 37 ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నది.[i] ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు. 38 మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు.
39 “మోయాబు విచ్ఛిన్నమవటంతో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”
40 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు.
అతను తన రెక్కలను మోయాబు మీదికి చాపుతున్నాడు.
41 మోయాబు పట్టణాలు పట్టుబడతాయి.
బలమైన దుర్గాలు ఓడింపబడతాయి.
ఆ సమయంలో మోయాబు సైనికులు
ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు.
42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది.
ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”
43 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
“మోయాబు ప్రజలారా, మీ కొరకై భయం లోతైన గోతులు, ఉరులు[j] పొంచివున్నాయి.
44 ప్రజలు భయపడి పారిపోతారు.
పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు.
ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే
అతడు ఉరిలో చిక్కుకుంటాడు.
మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.”
ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.
45 “బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు.
వారు రక్షణకై హెష్బోను పట్టణానికి పారిపోయారు.
అయినా అక్కడ రక్షణ దొరకలేదు.
హెష్బోనులో అగ్ని ప్రజ్వరిల్లింది.
సీహోను పట్టణంలో[k] నిప్పు చెలరేగింది.
అది మోయాబు నాయకులను దహించివేస్తున్నది. అది గర్విష్ఠులను కాల్చివేస్తున్నది.
46 మోయాబూ, నీకు చెడు దాపురించింది.
కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు.
నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి
బందీలుగా కొనిపోబడుతున్నారు.
47 “మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం.
ఇంతటితో మోయాబీయులపై తీర్పు సమాప్తం.
అమ్మోనును గురించిన సందేశం
49 ఈ వర్తమానం అమ్మోనీయులను గురించినది. యెహోవా ఇలా చెపుతున్నాడు,
“అమ్మోను ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు
పిల్లలు లేరని మీరు అనుకొంటున్నారా?
తల్లి తండ్రులు చనిపోతే భూమిని
స్వతంత్రించుకొనుటకు అక్కడ పిల్లలు లేరని మీరనుకొంటున్నారా?
బహుశః అందువల్లనే మల్కోము[l] గాదు[m] రాజ్యాన్ని తీసికొన్నాడా?”
2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు అమ్మోను[n] ప్రజలు
యుద్ధనాదాలు వినే సమయం వస్తుంది.
రబ్బోతు-అమ్మోను నాశనమవుతుంది.
అది కూలిపోయిన భవనాలతో నిండిన ఒక కొండలా ఉంటుంది.
దాని చట్టూ ఉన్న పట్టణాలు తగులబడతాయి.
ఆ జనం ఇశ్రాయేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని వత్తిడి చేశారు.
కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని బలవంతం చేస్తారు.”
మరియు వారు భూమిని వారి స్వంతము చేసుకుంటారు.
యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
3 “హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది.
రబ్బోతు-అమ్మోను మహిళల్లారా, విలపించండి!
విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి.
రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి.
ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు.
వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు.
4 నీవు నీ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటావు.
కాని నీవు నీ బలాన్ని కోల్పోతున్నావు.
నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నీవు నమ్మావు.
నిన్ను ఎదిరించటానికి ఏ ఒక్కడూ కనీసం ఆలోచన కూడా చేయడని నీవనుకున్నావు.”
5 కాని సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు,
“నలుమూలల నుండి నేను మీకు కష్టాలు తెచ్చిపెడతాను.
మీరంతా పారిపోతారు.
మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయలేరు.”
6 “అమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. కాని అమ్మోనీయులను నేను వెనుకకు తీసికొనివచ్చే సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
ఎదోమును గూర్చిన సందేశం
7 ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా?
ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక పోతున్నారా?
వారి జ్ఞానాన్ని వారు కోల్పోయారా?
8 దదానులో నివసించే ప్రజలారా, పారిపోండి! దాగుకోండి!
ఎందుకంటే, నేను ఏశావును[o] తాను చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను.
9 “మీ ద్రాక్ష తీగల నుండి పనివారు వారికి కావలసినన్ని ద్రాక్షకాయలను కోస్తారు.
అయినా వారు కొన్ని కాయలను చెట్లపై వదిలివేస్తారు.
రాత్రిళ్లు దొంగలు వచ్చినా వారికి కావలసిన
పరిమాణంలోనే తీసికొనిపోతారు.
10 కాని ఏశావు నుండి నేను అంతా తీసికుంటాను.
అతడు దాచుకొనే స్థలాలన్నింటినీ నేను కనుగొంటాను.
అతడు నానుండి ఏమీయు దాచలేడు.
అతని పిల్లలు, బంధువులు, పొరుగువారు అంతా చనిపోతారు.
11 అతని పిల్లల పట్ల శ్రద్ధ తీసికొనటానికి ఎవ్వరూ మిగలరు.
అతని విధవరాండ్రు ఒంటరిగా విడువబడుతారు (యెహోవానైన) నేను మాత్రమే మీ అనాధుల ప్రాణాల్ని కాపాడుతాను.
మరియు మీ విధవరాండ్రు నామీద నమ్మకముంచుతారు.”
12 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంతమంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు శిక్షకు పాత్రుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడతావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. నీవు దండించబడతావు.” 13 యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”
14 యెహోవా నుండి నేనొక సందేశం విన్నాను,
దేశాలకు యెహోవా ఒక దూతను పంపాడు.
ఆ సందేశం ఇలా వుంది,
“మీ సైన్యాలను సమకూర్చుకోండి!
యుద్ధానికి సిద్ధపడండీ.
ఎదోము దేశం మీదికి కదలి వెళ్లండి!
15 ఏదోమూ, నేను నీ ప్రాముఖ్యతను, ఘనతను తగ్గించివేస్తాను.
ప్రతివాడూ నిన్ను అసహ్యించుకుంటాడు.
16 ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు.
అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు.
కాని నీవు మోసపోయావు.
నీ గర్వం నిన్ను మోసగించింది.
ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు.
పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు.
గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను.
అక్కడినుండి నేను నిన్ను క్రిందికి దింపుతాను,”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
17 “ఎదోము నాశనం చేయబడుతుంది.
నాశనమయిన నగరాన్ని చూచి ప్రజలు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఈల వేస్తారు.
నాశనమయిన నగరాలను చూచి ప్రజలు ధిగ్భ్రాంతి చెంది సంభ్రమాశ్చర్య పడతారు.
18 సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది.
అక్కడ ఎవ్వరూ నివసించరు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
19 “యొర్దాను నది దగ్గర దట్టమైన పొదలనుండి కొన్నిసార్లు సింహం వస్తూఉంటుంది. పొలాల్లో ప్రజలు మందవేసిన గొర్రెల మీదికి, పశువుల మీదికి వెళుతుంది. నేను ఆ సింహంలాంటివాణ్ణి! నేను ఎదోము మీదికి వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గొర్రెల కాపరులలో (నాయకులు) ఏ ఒక్కడూ నన్నెదిరించి నిలువలేడు.”
20 కావున ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా వేసిన పధకాన్ని వినండి.
తేమాను వాసులకు యెహోవా ఏమి చేయ నిశ్చయించినది వినండి
ఎదోము మంద (ప్రజలు)లో నుండి చిన్నవాటినన్నిటినీ శత్రువు ఈడ్చుకుపోతాడు.
ఎదోము పచ్చిక బయళ్లు వారు చేసిన దాన్ని బట్టి ఆశ్చర్యపోతాయి.
21 ఎదోము పతనంతో పుట్టిన శబ్దానికి భూమి కంపిస్తుంది.
వారి ఆక్రందన ఎర్ర సముద్రం వరకు ప్రతిధ్వనిస్తుంది.
22 దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతువుపై తిరుగుతూ ఎగిరే గద్దలా యెహోవా ఉంటాడు.
బొస్రా నగరంపై తన రెక్కలు విప్పుతున్న గద్దవలె యెహోవా ఉన్నాడు.
ఆ సమయంలో ఎదోము సైనికులు మిక్కిలిగా బెదరిపోతారు.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు భయాందోళనలతో ఆక్రందిస్తారు.
దమస్కును గురించిన సందేశం
23 ఈ వర్తమానము దమస్కు[p] నగరాన్ని గురించినది:
“హమాతు, అర్పాదు పట్టణాలు భయపడ్డాయి.
దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి.
వారు అధైర్యపడ్డారు.
వారు వ్యాకులపడి బెదిరారు.
24 దమస్కు నగరం బలహీనమయ్యింది.
ప్రజలు పారిపోవాలనుకుంటున్నారు.
ప్రజలకు దిగులు పట్టుకున్నది.
ప్రసవ స్త్రీలా ప్రజలు బాధ, వేదన అనుభవిస్తున్నారు.
25 “దమస్కు సుఖసంతోషాలున్న ఒక నగరం.
ప్రజలింకా ఆ ‘వేడుక నగరాన్ని’ వదిలి పెట్టలేదు.
26 అందువల్ల యువకులు ఆ నగరంలోని కూడలి స్థలాలలో చనిపోతారు.
ఆ సమయంలో దాని సైనికులందరూ చంపబడతారు.”
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పినాడు.
27 “దమస్కు గోడలన్నిటికీ నేను నిప్పు పెడతాను.
బెన్హదదు బలమైన కోటలను అది పూర్తిగా కాల్చివేస్తుంది.”
కేదారు, హాసోరులను గూర్చిన సందేశం
28 ఈ వర్తమానం కేదారు[q] వంశస్తులను గూర్చియు, మరియు హాసోరు పాలకులను గురించినది. బబులోను రాజైన నెబుకద్నెజరు వారిని ఓడించారు. యెహోవా ఇలా చెపుతున్నాడు,
“కేదారు వంశీయుల మీదికి మీరు దండెత్తి వెళ్లండి.
తూర్పునవున్న ప్రజలను నాశనం చేయండి.
29 వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి.
వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి.
వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు.
‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.
30 త్వరగా పారిపొండి!
హాసోరు ప్రజలారా, దాగటానికి మంచి స్థలం చూడండి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది
“నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా పధకం పన్నాడు.
నిన్ను ఓడించటానికి అతడు ఒక తెలివైన పథకాన్ని ఆలోచించాడు.
31 “నిశ్చంతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా.
ఆ దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని ఏమీ లేవు.
వారు ఒంటరిగా నివసిస్తారు.
‘ఆ రాజ్యాన్ని ఎదుర్కోండి!’ అని యెహోవా అంటున్నాడు.
32 వారి ఒంటెలను, విస్తారమైన పశుసంపదను శత్రువు దొంగిలిస్తాడు.
శత్రువు వారి పెద్ద మందలను దొంగిలిస్తాడు.
చెంపలు కత్తిరించుకునే వారిని[r] భూమి నలుదిక్కులకు పంపివేస్తాను.
అన్నివైపుల నుండి వారి మీదికి మహా విపత్తులను తీసికొని వస్తాను.”
ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
33 “హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవుతుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారిపోతుంది.
అక్కడ మనుష్యులెవ్వరూ నివసించరు.
ఆ స్థలంలో ఏ ఒక్కడూ నివాసం చేయడు.”
ఏలామును గూర్చిన సందేశం
34 యూదా రాజైన సిద్కియా పరిపాలనారంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం ఏలాము[s] దేశానికి సంబంధించినది.
35 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“ఏలాము యొక్క ధనుస్సును నేను త్వరలో విరచివేస్తాను.
విల్లే ఏలాము యొక్క బలమైన ఆయుధం.
36 నాలుగు ప్రచండ వాయువులను ఏలాము మీదికి రప్పిస్తాను.
ఆకాశపు నాలుగు మూలల నుండి వాటిని రప్పిసాను.
భూమి మీదకు గాలి వీచే నలుమూలలకు ఏలాము ప్రజలను నేను చెదరగొడతాను.
ఏలాము ప్రజలు ప్రతి దేశానికి బందీలుగా కొనిపోబడతారు.
37 వారి శత్రువులు చూస్తూవుండగా ఏలామును తునాతునకలు చేస్తాను.
వారిని చంపజూచేవారి సమక్షంలో ఏలామును భయపెడతాను.
వారికి మహా విపత్తులను తెచ్చిపెడతాను.
నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.”
ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
“ఏలామును వెంటాడటానికి నేను కత్తిని పంపుతాను.
నేను వారందరినీ చంపేవరకు కత్తి వారిని తరుముతుంది.
38 నా సింహాసనం ప్రతిష్ఠించి నేనే అదుపుదారుడనని నిరూపిస్తాను.
దాని రాజును, రాజ్యాధికారులను నేను నాశనం చేస్తాను.”
ఇదే యెహోవా సందేశం.
39 “కాని ఏలామును వెనక్కు తీసుకొని వచ్చి వారికి మంచి సంభవించేటట్లుగా చేస్తాను.”
ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
మెల్కీసెదెకు
7 ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.
మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. 3 మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
4 మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. 5 ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. 6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. 7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.
8 ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. 9 ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.
11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? 12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, 13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. 14 మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపువాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.
యేసు మెల్కీసెదెకులాంటి యాజకుడు
15 పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. 16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. 17 ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు”(A) అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి.
18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. 19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది.
20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. 21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు:
“ప్రభువు ప్రమాణం చేశాడు.
తన మనస్సును మార్చుకోడు.
‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’”(B)
22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్ఠమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు.
23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. 24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.
26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. 27 ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! 28 ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
© 1997 Bible League International