Old/New Testament
దర్మార్గపు రాజులకు వ్యతిరేకంగా తీర్పు
22 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు రాజభవనానికి వెళ్లు. అక్కడ యూదా రాజును కలిసి ఈ వర్తమానాన్ని అతనికి చెప్పు. 2 ‘ఓ యూదా రాజా, యెహోవా యొక్క ఈ వర్తమానాన్ని ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నావు గనుక, ఇది వినుము. ఓ రాజా! నీవును నీ అధికారులును శ్రద్ధగా వినండి. యెరూషలేము ద్వారాల నుండి వచ్చే నీ ప్రజలంతా ఈ యెహోవా వాక్కును తప్పక వినాలి. 3 యెహోవా ఇలా చెపుతున్నాడు: న్యాయమైన, నీతిగల పనులనే చేయండి. దోపిడిగాండ్ర బారినుండి దోచుకోబడిన వారిని ఆదుకోండి. అనాధ పిల్లలను, వితంతువులను బాధించవద్దు. వారిపట్ల మీరు అపచారం చేయవద్దు. అమాయకులను చంపవద్దు. 4 ఈ ఆదేశ సూత్రాలను మీరు పాటిస్తే, మీకు ఈ మంచి పనులు జరుగుతాయి: దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులంతా నగర ద్వారాలగుండా యెరూషలేముకు నిరంతరం రాగలుగుతారు. ఆ రాజులు వారి అధికారులతో సహా నగర ద్వారాల నుండి వస్తారు. ఆ రాజులు, వారి అధికారులు, వారి ప్రజలు అందరూ రథాలలోను, గుర్రాల మీదను స్వారీ చేస్తూ వస్తారు. 5 కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, ఈ రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది.’”
6 యూదా రాజు నివసించే భవనాన్ని గురించి యెహోవా చెప్పేదేమంటే:
“గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంది
లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగావుంది
కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చివేస్తాను.
నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ భవంతి ఖాళీగా వుండి పోతుంది.
7 ఈ భవనాన్ని నాశనం చేయటానికి నేను మనుష్యులను పంపుతాను.
ఆ రాజగృహ నాశనానికి వచ్చిన ప్రతి వాని చేతిలోను ఒక ఆయుధం ఉంటుంది.
అందమైన, బలమైన మీ దేవదారు దూలాలను వారు నరికి వేస్తారు.
నరికిన ఆ దూలాలను వారు తగలబెడతారు.
8 “ఇతర దేశాల ప్రజలెందరో ఈ నగరం ప్రక్కగా వెళతారు. వారంతా, ‘యెహోవా యెరూషలేమునకు ఎందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప నగరం’ అని ఒకరి నొకరు అడుగుతారు. 9 దానికి సమాధానమిది: ‘యూదా రాజ్య ప్రజలు వారి యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి ఆరాధించారు.’”
యెహోయాహాజురాజు (షల్లూము)కు వ్యతిరేకంగా తీర్పు
10 చనిపోయిన రాజు కొరకు దుఃఖించవద్దు.[a]
అతని కొరకు విచారించవద్దు.
కాని ఇక్కడ నుండి వెళ్లి పోయే రాజు కొరకు
మిక్కిలిగా దుఃఖించండి.[b]
అతని కొరకు దుఃఖించండి; ఎందువల్లనంటే అతడు మరి తిరిగి రాడు.
యెహోయాహాజు తన మాతృ భూమిని మరల చూడడు.
11 యోషీయా కుమారుడైన షల్లూము (యెహోయాహాజు తన తండ్రి మరణానంతరం అతడు రాజయ్యాడు) ను గురించి యెహోవా యిలా అంటున్నాడు: “యెహోయాహాజు యెరూషలేము నుండి దూరంగా వెళ్లిపోయాడు. యెరూషలేముకు అతడు మరల తిరిగి రాడు. 12 ఈజిప్టీయులు యెహోయాహాజును ఎక్కడికి తీసుకొని వెళ్లారో అతనక్కడే చనిపోతాడు. ఈ రాజ్యాన్ని అతడు మరల చూడడు.”
రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా తీర్పు
13 “రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా ఇది మిక్కిలి కీడు.
తన భవన నిర్మాణానికి అతడు మిక్కిలి చెడ్డ పనులు చేస్తున్నాడు.
పై అంతస్తులో గదులు కట్టడానికి అతడు ప్రజలను మోసగిస్తున్నాడు.
నా ప్రజలచే అతడు వూరికే పని చేయిస్తూ ఉన్నాడు.
వారి పనికి అతడు ప్రతి ఫలం ఇవ్వటం లేదు.
14 “నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను.
‘పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను,’ అని యెహోయాకీము అంటాడు.
అలా అని అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో నిర్మిస్తాడు.
వాటి చట్రాలకు, తలుపులకు దేవదారు కలపను ఉపయోగించాడు. వాటికి అందంగా ఎరువు రంగు వేశాడు.
15 “యెహోయాకీమా, నీ ఇంటిలో విశేషించి ఉన్న దేవదారు కలప
నిన్ను గొప్ప రాజును చేయదు.
నీ తండ్రియగు యోషీయా తనకు కావలసిన ఆహారపానీయాలతో తృప్తి పడ్డాడు.
అతడు ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానిని చేశాడు.
యోషీయా సత్ప్రవర్తనుడై నందున అతనికి అంతా సవ్యంగా జరిగిపోయింది.
16 యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని ఆదుకున్నాడు.
యోషీయా అలా చేయుటవల్ల అతనికి అంతా సవ్యంగా జరిగి పోయింది.
యెహోయాకీమా, ‘దేవుని తెలుసు కొనుట’ అంటే ఏమిటి?
దీనులకు దరిద్రులకు సహాయం చేయటం
మరియు న్యాయంగా ప్రవర్తించటమే నన్ను తెలుసుకొనే మార్గాలు.”
ఇదే యెహోవా వాక్కు.
17 “యెహోయాకీమా, నీకు ఏది లాభదాయకంగా ఉంటుందా, అని నీ కళ్లు వెదకుతూ ఉంటాయి.
ఇంకా, ఇంకా ఎలా సంపాదించాలా అని సదా నీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది.
అందుకు అమాయకులను బలి చేయటానికి కూడా నీవు సిద్ధంగా ఉన్నావు
ఇతరుల సొమ్మును దొంగిలించటానికి నీవు ఇష్టపడుతున్నావు.”
18 కావున యోషీయా కుమారుడైన యెహోయాకీము రాజునకు యెహోవా చెప్పుచున్న దేమనగా:
“యూదా ప్రజలు యెహోయాకీమును గూర్చి ఏడ్వరు ‘అయ్యో, నా సోదరుడా, నేను యెహోయాకీమును గురించి దుఃఖిస్తున్నాను!
అయ్యో, నా సహోదరీ, నేను యెహోయాకీమును గురించి విచారిస్తున్నాను!’
అని ప్రజలు ఒకరి కొకరు చెప్పుకోరు.
యూదా ప్రజలు యెహోయాకీమును గిరించి విచారించరు.
‘ఓ యజమానీ, నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
ఓ రాజా, నేను నీకై విచారిస్తున్నాను!’
అని వారతనిని గురించి చెప్పరు.
19 చచ్చిన గాడిదను పూడ్చి పెట్టినట్లు యెరూషలేము ప్రజలు యెహోయాకీమును పాతిపెడతారు.
అతని శవాన్ని వారు ఈడ్చి పార వేస్తారు. వారు అతని శవాన్ని యెరూషలేము తలుపుల బయటికి విసరి వేస్తారు.
20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి.
నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి.
అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు.
ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.
21 “యూదా! నీవు చాలా సురక్షితంగా ఉన్నట్టు భావించావు.
కాని నిన్ను నేను హెచ్చరించాను!
నేను నిన్ను హెచ్చరించినా
నీవు లక్ష్యపెట్టలేదు!
నీవు చిన్న వయస్సులో ఈ విధంగా నివసించావు.
యూదా, నీ చిన్న వయస్సు నుండే నీవు నాకు విధేయుడవు కాలేదు
22 యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది.
అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది.
ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు.
కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి.
అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది.
నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గుపడతావు.
23 “ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు.
ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీవున్నట్లుగా వుంది.
కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు
సురక్షితం అనుకుంటున్నావు.
కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు.
స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”
యెహోయాకీను (కొన్యా) పై తీర్పు
24 “యెహోయాకీము కుమారుడవు, యూదా రాజువైన యెహోయాకీనూ, నేను నివసించునంత నిశ్చయముగ చెపుతున్నాను.” ఇది యెహోవా వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా నిన్ను నేను లాగి పడవేస్తాను! 25 యెహోయాకీనూ, నిన్ను నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, కల్దీయులకు అప్పగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు. 26 నిన్ను, నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తారు. నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు. 27 యెహోయాకీనూ, నీ మాతృ భూమికి రావాలని నీవు గాఢంగా కోరుకుంటావు. కాని నీ కోరిక తీరదు. నీవు వచ్చుటకు నేను అనుమతించను.”
28 ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ మాదిరి, కొన్యా యొక్క (యోహోయాకీను) స్థితి వున్నది.
ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ మాదిరిగా అతడున్నాడు.
యెహోయాకీను, అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు?
వారెందుకు అన్య దేశానికి తోయబడతారు?
29 యూదా రాజ్యమా, ఓ రాజ్యమా, ఓ రాజ్యమా!
యెహోవా వర్తమానం వినుము!
30 యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి:
‘అతడు పిల్లలు లేని వానితో లెక్క!
తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు.
అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు.
అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.’”
23 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.
2 ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. 3 “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి. 4 నా గొర్రెల మందపై నేను క్రొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.
నీతియుక్తమైన “అంకురం” (క్రొత్త రాజు)
5 “నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని[c] మొలిపింప జేసే సమయం వస్తూవుంది,”
ఇదే యెహోవా వాక్కు.
అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు.
దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు.
6 శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు.
ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది.
“యెహోవా మనకు న్యాయం”[d]
అని అతనికి పేరుగా ఉంటుంది.
7 కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు. 8 కాని ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు’ అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.”
దొంగ ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్పు
9 ప్రవక్తలకు పవిత్రమైన మాటలు:
నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది.
నా ఎముకలు వణుకుతున్నాయి.
నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను.
యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.
10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది.
వారనేక విధాలుగా అవిశ్వాసులై ఉన్నారు.
యెహోవా రాజ్యాన్ని శపించాడు.
అందుచే అది బీడై పోయింది.
పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి.
పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి.
ప్రవక్తలంతా దుష్టులయ్యారు.
ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.
11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు.
వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.”
ఇదే యెహోవా వాక్కు.
12 “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను.
వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచినట్లుంటుంది.
ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది.
గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు.
వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను.
ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.”
ఇదే యెహోవా వాక్కు.
13 “సమరయ[e] ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను.
బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను.
ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.
14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన
పనులు చేయటం నేను చూశాను.
ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు.
వారు అబద్ధాలను వింటారు.
వారు తప్పుడు బోధలను అనుసరించారు.
వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు.
అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు.
వారు సొదొమ నగరం వలె ఉన్నారు.
యెరూషలేము ప్రజలు నా దృష్టిలో
గొమొర్రా నగరం వలె ఉన్నారు!”
15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు.
“ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది.
ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన
ఒక రుగ్మతను ప్రబలింప చేశారు.
ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”
16 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు:
“ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు.
వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు.
కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు.
వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే.
17 కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు.
అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు.
‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు.
కొంత మంది ప్రజలు బహు మొండివారు.
వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు.
కావున వారికి ఆ ప్రవక్తలు,
‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు.
18 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో[f] నిలవలేదు.
వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు.
వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.
19 ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది!
యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది!
ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.
20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు
ఆయన కోపం చల్లారదు.
అంత్యదినాల్లో దీనిని మీరు
సరిగా అర్థం చేసుకుంటారు.
21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు.
కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు.
నేను వారితో మాట్లాడలేదు.
కాని వారు నా పేరుతో ప్రవచించారు.
22 వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే
వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు.
ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు.
వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.”
23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను.
నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను.
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం
నేను దూరంలో లేను!
24 ఒక వ్యక్తి నాకు కనపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు.
కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే
నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!”
25 “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను. 26 ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలోచిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు. 27 యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు. 28 ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి. 29 నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహోవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది.
30 “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.[g] 31 నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు. 32 అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు.
యెహోవా నుండి విషాద వార్త
33 “యూదా ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక ఒక యాజకుడు గాని నిన్ను పిలిచి, ‘యిర్మీయా, యెహోవా ఏమి ప్రకటిస్తున్నాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు వారికి సమాధానంగా, ‘యెహోవాకు మీరే భారంగా[h] ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని క్రిందికి విసరి వేస్తాను.’ ఇదే యెహోవా వాక్కు, అని నీవు చెప్పు.
34 “ఒక ప్రవక్తే గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో ఎవ్వరే గాని, ‘ఇది యెహోవా నుండి వచ్చిన ప్రకటన ….’ అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను. 35 మీరొకరికొకరు ఇలా చెప్పుకోండి, ‘యెహోవా ఏమి సమాధానమిచ్చాడు?’ లేక ‘యెహోవా ఏమి చెప్పాడు?’ 36 అంతేగాని మరెన్నడు, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం)’ అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందువల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు మార్చివేశారు! ఆయన నిత్యుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా!
37 “మీరు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక ప్రవక్తను, ‘యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు’ అని గాని; ‘యెహోవా ఏమి చెప్పినాడు?’ అని గాని అడగండి. 38 కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి?’ అని అడగవద్దు. మీరామాటలు వాడితే, ‘అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: “మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన” (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను. 39 కాని నా సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను ఇచ్చియున్నాను. కాని మిమ్మల్ని, మీ నగరాన్నీ నా నుండి దూరంగా పార వేస్తాను. 40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.’”
1 దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడును అయినటువంటి పౌలు వ్రాయుచున్న పత్రిక. దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు. 2 ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు. 3 సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.
4 మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!
క్రేతులో తీతు చేయవలసిన పని
5 అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. 6 క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. 7 సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. 8 అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. 9 తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.
10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. 11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం. 12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటివాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్తలలో ఒకడు అన్నాడు. 13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం దృఢమౌతుంది. 14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.
15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేనివాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. 16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.
© 1997 Bible League International