Old/New Testament
యిర్మీయా, పషూరు
20 ఆ దేవాలయంలో పషూరు అనబడే ఒక యాజకుడున్నాడు. అతడు దేవాలయంలో ప్రధానాధికారి. పషూరు తండ్రి పేరు ఇమ్మేరు. యిర్మీయా ఈ భవిష్యత్ విషయాలు ఆలయ ప్రాంగణంలో చెప్పటం పషూరు విన్నాడు. 2 అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య[a] వేయించాడు. 3 ఆ మరునాడు యిర్మీయాను పషూరు బొండ కొయ్య బంధం నుండి తొలగించాడు. అప్పుడు యిర్మీయా పషూరుతో ఇలా అన్నాడు, “దేవుడు నిన్ను పిలిచే పేరు పషూరు కాదు. ఆయన నీకు మాగోర్ మిస్సాబీబ్[b] అని పేరు పెడతాడు. 4 ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబులోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబులోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు. 5 యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబులోను దేశానికి పట్టుకు పోతాడు. 6 ఓ పషూరూ, నీవు, మరియు నీ ఇంటి వారందరునూ కూడా తీసుకొని పోబడతారు. బబులోనులో నివసించటానికి నీవు బలవంతంగా కొనిపోబడతావు! నీవు బబులోనులోనే చనిపోతావు. నీవా అన్య దేశంలోనే సమాధి చేయబడతావు. నీ స్నేహితులకు నీవు అబద్ధాలు బోధించావు. నేను చెప్పే విషయాలన్నీ జరగవని నీవు చెప్పినావు. నీ సహచరులంతా బబులోనులో చనిపోయి అక్కడే సమాధి చేయబడతారు.’”
ఐదవసారి యిర్మీయా విన్నపం
7 యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను.
నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు.
నేను నవ్వుల పాలయ్యాను.
రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.
8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను.
దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను.
యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను.
కాని నా ప్రజలు నన్ను కేవలం అవమానపర్చి,
హేళనచేస్తున్నారు.
9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను.
ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!”
అని నేను కొన్ని సార్లు అనుకున్నాను.
కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది!
అది నన్ను లోపల దహించి వేస్తుంది.
దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను.
ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను.
ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను.
నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు.
“మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం!
లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు!
అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు.
తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు.
లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు” నని వారంటున్నారు.
11 కాని యెహోవా నాతో వున్నాడు.
యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు.
కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు.
వారు నన్ను ఓడించలేరు.
వారి ప్రయత్నం వ్యర్థం.
వారు ఆశా భంగం చెందుతారు.
వారు అవమానం పాలవుతారు.
వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.
12 సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు.
మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు.
ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను
కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.
13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము!
యెహోవా పేద వారిని ఆదుకుంటాడు!
ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!
యిర్మీయా ఆరవసారి మొరపెట్టుకొనుట
14 నేను పుట్టిన రోజు శపింపబడును గాక!
నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు.
15 నేను పుట్టినట్లు నా తండ్రికి వర్తమానం యిచ్చిన మనుష్యుని శపించుము
“నీకు పుత్ర సంతానం కలిగింది”
అని చెప్పి అతడు
నా తండ్రిని మిక్కిలి సంతోషపరిచాడు.
16 యెహోవా సర్వనాశనం చేసిన ఆ నగరాల మాదిరిగానే[c] ఆ మనుష్యుడు కూడా దౌర్భాగ్యుడగును గాక!
యెహోవా ఆ నగరాలపై ఏమాత్రం కనికరం చూపలేదు
వారు ఉదయాన్నే యుద్ధ నినాదాలను విందురుగాక!
మధ్యాహ్న సమయంలో అతడు యుద్ధశోకాలు వినును గాక!
17 ఎందువల్లననగా అతడు నేను నా తల్లి గర్భంలో
ఉండగానే నన్ను చంపలేదు.
అతడే గనుక అప్పుడు నన్ను చంపి వుంటే
నా తల్లి గర్భమే నాకు నా సమాధి అయివుండేది.
నేను పుట్టివుండే వాడినే కాను.
18 నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటికి వచ్చినట్లు?
నేను వచ్చి చూచినదంతా కష్టము, దుఃఖమే!
నా జీవితం అవమానంతో అంతమవుతుంది.
సిద్కియా రాజు అభ్యర్థనను దేవుడు తిరస్కరించుట
21 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు[d] అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు. 2 యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. “మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహోవాను అడిగి తెలుసుకొనుము. బబులోను రాజైన[e] నెబుకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబుకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”
3 అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధానమిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: 4 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబులోను రాజు నుండి, కల్దీయుల[f] నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుపయోగమయ్యేలా నేను చేస్తాను.
“‘బబులోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాన్ని యెరూషలేము లోనికి రప్పిస్తాను. 5 యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను. 6 యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా వారంతా చనిపోతారు. 7 అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’
8 “యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి! 9 యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగిపోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. 10 యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి నేను సంకల్పించాను.’” ఇదే యెహోవా వాక్కు “‘బబులోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.’”
11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి:
‘యెహోవా వర్తమానాన్ని వినండి!
12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి.
నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము.
నీవది చేయకపోతే
నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం ఎవ్వరూ ఆపలేని
దహించు అగ్నిలా ఉంటుంది.
మీరు దుష్ట కార్యాలు చేశారు
గనుక ఇది జరుగుతుంది.’
13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను.
నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు.
నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు.
యెరూషలేము వాసులారా
‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు,
ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.”
కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.
14 “మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు!
మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను.
ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”
4 చనిపోయినవాళ్ళపై, బతికివున్నవాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. 2 దైవసందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో బోధిస్తూ ఉండు.
3 ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మానివేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగుచేసుకొంటారు. 4 సత్యం వినటం మాని, కల్పిత సంగతులు వింటారు. 5 కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు.
6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. 7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. 8 ఇప్పుడు “నీతి” అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు “ఆ రానున్న రోజు” దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నవాళ్ళందరికీ ఆ బహుమతి లభిస్తుంది.
వ్యక్తిగత సలహాలు
9 నా దగ్గరకు త్వరలో రావటానికి సాధ్యమైనంత ప్రయత్నం చెయ్యి. 10 ఎందుకంటే, “దేమా” ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్ళిపొయ్యాడు. క్రేస్కే గలతీయకు వెళ్ళిపొయ్యాడు. తీతు దల్మతియకు వెళ్ళిపొయ్యాడు. 11 లూకా మాత్రము నాతో ఉన్నాడు. మార్కు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నీ వెంట పిలుచుకొని రా. నా ఈ సేవా కార్యక్రమంలో అతని సహాయం నాకు ఉపయోగపడుతుంది. 12 తుకికును ఎఫెసుకు పంపాను.
13 నేను త్రోయలో ఉన్నప్పుడు కర్పు ఇంట్లో నా అంగీ మరిచిపొయ్యాను. దాన్ని, గ్రంథాలను, ముఖ్యంగా తోలు కాగితాల గ్రంథాలను తీసుకొని రా.
14 కంచరి అలెక్సంద్రు నాకు చాలా అపకారం చేసాడు. అతడు చేసిన దానికి ప్రభువు అతనికి తగిన శిక్ష విధిస్తాడు. 15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు.
16 నా విషయంలో మొదటి సారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక! 17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు. 18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
19 ప్రిస్కిల్లను, అకులను, ఒనేసిఫోరు కుటుంబం వాళ్ళకు నా వందనాలు చెప్పు. 20 ఎరస్తు కొరింథులోనే ఉండిపొయ్యాడు. త్రోఫిము జబ్బుతో ఉండటం వల్ల అతణ్ణి మిలేతులో వదలవలసి వచ్చింది. 21 చలి కాలానికి ముందే నీవిక్కడికి రావటానికి గట్టిగా ప్రయత్నించు.
యుబూలు, పుదే, లిను, క్లౌదియ మరియు మిగతా సోదరులందరు నీకు వందనాలు చెప్పుచున్నారు.
22 ప్రభువు నీ ఆత్మకు తోడైయుండునుగాక! దైవానుగ్రహం నీపై ఉండుగాక!
© 1997 Bible League International