Old/New Testament
కుమ్మరి మరియు బంకమట్టి
18 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవానుండి వచ్చినది: 2 “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.”
3 నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కుమ్మరి తన సారె (చక్రం) పై కుండలు చేస్తున్నాడు. 4 బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.
5 అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది: 6 “ఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విషయంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి వానిలా వున్నాను! 7 నేను ఒక దేశాన్ని గురించిగాని, ఒక సామ్రాజ్యాన్ని గురించి గాని మాట్లాడే సమయం రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్పవచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామ్రాజ్యాన్నిగాని క్రిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను. 8 అయితే ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడవడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు తెచ్చి పెట్టిన పథకాన్ని నేను అమలుపర్చను. 9 ఒక దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయంరావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరుస్తానని అనవచ్చు. 10 కాని ఆ దేశ ప్రజలు నాకు విధేయులుకాకుండా దుష్టకార్యాలు చేస్తూ ఉండవచ్చు. అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది.
11 “కావున యిర్మీయా, యూదా ప్రజలకు, యెరూషలేము వాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడని చెప్పుము: ‘మీకు నేనిప్పుడే కష్టాలు సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్టకార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ మార్పు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు పెట్టాలి!’ 12 కాని యూదా ప్రజలు ఇలా సమాధాన మిస్తారు, ‘మార్చుటకు ప్రయత్నం చేయుటవల్ల ఏమీ ప్రయోజనముండదు. మేము చేయదలచుకున్నదేదో అదే చేస్తూపోతాము. మాలో ప్రతివాడూ తన కఠినమైన దుష్టమైన హృదయం ఎలా చెపితే అలా నడుచుకుంటాడు.’”
13 యెహోవా చెప్పే విషయాలు వినండి:
“అన్య దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి:
‘ఇశ్రాయేలు చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తున్నట్లు మీరెప్పుడైనా విన్నారా?’
పైగా ఇశ్రాయేలు దేవుని వధువులా ఉంది!
14 పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు.[a]
లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు.
అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.
15 కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు.
వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్పించారు.
నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు పాటు చెందుతారు.
వారి పితరులు నడచిన పాత దారిలో నడిచి తడబడతారు.
నా ప్రజలు వేరే మార్గాన నడుస్తారు.
గతుకుల బాటలపై నడుస్తారు.
కాని వారు మంచి మార్గంపై నన్ననుసరించరు!
16 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది!
ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు.
ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!
17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి రానివారిగా పడవేస్తాను.
బలమైన తూర్పుగాలి వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని విసరివేస్తాను.
నేనా ప్రజలను నాశనం చేస్తాను. ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు నన్ను చూడలేరు.
మరియు! నేను వారిని వదిలి పెడుతున్నట్లుగా చూస్తారు!”
ప్రజల కుట్ర, యిర్మియా విన్నపం
18 పిమ్మట యిర్మీయా శత్రువులు ఇలా అన్నారు: “రండి. మనం యిర్మీయా పై కుట్ర పన్నుదాము. నిశ్చయముగా యాజకుడు చెప్పిన ధర్మశాస్త్రము వృధాపోదు, జ్ఞానులు చెప్పిన సలహాలు ఇంకా మనతో ఉంటాయి. ప్రవక్తల మాటలు మనకు ఇంకా ఉంటాయి. అందువల్ల మనం అతనిపై అబద్ధప్రచారం చేద్దాం. అది అతనిని నాశనం చేస్తుంది. అతడి మాటలను మనం వినము.”
19 యెహోవా, నా మనవి ఆలకించుము.
నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము.
20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను.
వారు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు.
నన్ను చంపే ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు.
21 కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి లేక మాడి పోయేలా జేయి.
వారి శత్రువులు వారిని కత్తులతో ఓడించును గాక!
వారి భార్యలు తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక!
యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవుదురు గాక!
వారి భార్యలను వితంతువులుగా చేయి.
వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు చనిపోవును గాక.
22 వారి ఇండ్లలో రోదనలు కలుగును గాక!
నీవు వారిపైకి ఆకస్మికంగా శత్రువును రప్పించినపుడు వారు మిక్కిలి విలపించేలా చేయి.
నా శత్రువులు నన్ను మోసం చేయదలచినందుకు ఇదంతా వారికి సంభవించును గాక!
నా అడుగు పడ్డ వెంటనే పట్టడానికి బోనులు అమర్చారు.
23 యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తుగడలన్నీ నీకు తెలుసు.
వారి నేరాలను క్షమించవద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు.
నా శత్రువులను మట్టు బెట్టు!
నీకు కోపం వచ్చినపుడు వారిని శిక్షించు!
పగిలిన జాడీ
19 యెహోవా నాతో ఇలా చెప్పినాడు: “యిర్మీయా, నీవు ఒక కుమ్మరి వాని వద్దకు వెళ్లి ఒక మట్టి జాడీ కొనుగోలు చేయి. 2 యెరూషలేము నగర కుమ్మరి ద్వారానికి[b] ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు నాయకులను, యాజకులను తీసికొని వెళ్లు. ఆ స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని వారికి తెలియజేయుము. 3 నీతో ఉన్న వారితో ఇలా చెప్పు, ‘యూదా రాజా, యెరూషలేము వాసులారా, యెహోవా వాక్కు వినండి! ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: ఈ ప్రదేశానికి త్వరలో నేను ఘోర విపత్తు సంభవించేలా చేస్తాను! దానిని గురించి విన్న ప్రతి ఒక్కడు ఆశ్ఛర్యపడి భయంతో నిండిపోతాడు. 4 నేను ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్ననుసరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని వారు పరదేశాల ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనైవేద్యాలు సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదేశాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు. 5 బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు. 6 మరియు బెన్‌హిన్నోములో గల ఈ స్థలాన్ని వారిప్పుడు తోఫెతు అని పిలుస్తారు. కాని నేను మీకీ హెచ్చరిక ఇస్తున్నాను: ప్రజలీ స్థలాన్ని కసాయి లోయ అని పిలిచే రోజులు వస్తున్నాయి. ఇది యెహోవా వాక్కు. 7 యూదా ప్రజల, యెరూషలేము వాసుల పథకాలన్నీ నేనీ ప్రదేశంలో వమ్ము చేస్తాను. శత్రువు ఈ ప్రజలను తరిమికొడతాడు. యూదా ప్రజలు ఈ ప్రదేశంలో శత్రువు కత్తికి ఆహుతైపోయేలా నేను చేస్తాను. వారి శవములను పక్షులకు, అడవి మృగాలకు ఆహారమయ్యేలా చేస్తాను. 8 ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయం చెందుతారు. 9 శత్రు సైన్యాలు నగరాన్ని చుట్టు ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందువల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు ఆకలి భాధను తట్టుకొలేక తమ పిల్లల శరీరాలనే తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు తింటారు.’
10 “యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియచెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని క్రింద పడవేసి పగుల గొట్టుము. 11 అప్పుడీ మాటలు చెప్పు: ‘ఒకానొకడు మట్టి జాడీని పగులగొట్టినట్లు నేను యూదా రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్నీ విచ్ఛిన్నం చేస్తానని సర్వశక్తిమంతుడగు యెహోవా చెపుతున్నాడు! ఈ ముక్కలను మరల క్రొత్త జాడీగా కూర్చలేము. 12 యూదా రాజ్యం విషయంలో కూడ అలాగే జరుగుతుంది. చనిపోయిన వారంతా తోఫెతులో, సందు లేకుండా పాతిపెట్టిబడతారు. 13 యెరూషలేము లోని ఇండ్లన్నీ తోఫెతువలె “అపవిత్ర” పర్చబడతాయి. తోఫెతువలె యూదా రాజుల రాజభవనాలన్నీ పాడవుతాయి. ఇది ఎందువల్ల జరుగుతుందంటే ప్రజలు వారి ఇండ్లలో కప్పుల మీద బూటకపు దేవతలను ఆరాధించినారు. నక్షత్రాలను వారు ఆరాధించి, వాటి గౌరవార్థం బలులు సమర్పించేవారు. బూటకపు దేవతలకు పానీయార్పణలు సమర్పించారు.’”
14 తోఫెతును వదిలి, దేవుడు తనను బోధించమన్న చోటికి యిర్మీయా వెళ్లాడు. యిర్మీయా దేవాలయానికి వెళ్లి, గుడి ఆవరణలో నిలబడినాడు. అక్కడి ప్రజలనుద్దేశించి యిర్మీయా ఇలా అన్నాడు: 15 “ఇశ్రాయేలు దేవుడు. సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెలవిచ్చినాడు: ‘యెరూషలేముకు, దాని చుట్టు పట్ల గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పియున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండటానికి నిరాకరిస్తున్నారు.’”
చివరి కాలపు సంగతులు
3 ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. 2 మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత, 3 ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం, 4 ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం. 5 పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు.
6 వాళ్ళు ఇళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు. 7 ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. 8 యన్నే మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. 9 వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించినవాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.
చివరి సలహాలు
10 కాని, నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ, నా సహనం, 11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు, నా బాధలు, ఇవన్ని పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను వీటినుండి రక్షించాడు. 12 యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకొన్న ప్రతీ ఒక్కడూ హింసింపబడతాడు. 13 దుష్టులు, వేషధారులు, మోసంచేస్తూ, మోసపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకూ అధికమవుతుంది.
14 కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్నవాటిని, విశ్వసించినవాటిని పాటిస్తూ ఉండు. 15 అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి. 16 లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. 17 వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు.
© 1997 Bible League International