Old/New Testament
15 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, చివరకు మోషే మరియు సమూయేలు ఇక్కడికి వచ్చి యూదా కొరకు ప్రార్థన చేసినా, ఈ ప్రజలకై నేను విచారపడను. నానుండి యూదా ప్రజలను దూరంగా పంపివేయి! పొమ్మని వారికి చెప్పు! 2 ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగవచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు:
“‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను.
వారు మృత్యువు వాతబడతారు.
కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను.
వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు.
కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను.
వారు కరువుకు గురవుతారు.
మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను.
వారు బందీలై పరదేశానికి తీసుకుపోబడతారు.
3 నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి పంపుతాను.’
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
‘నేను ఖడ్గధారులైన శత్రువులను సంహారానికి పంపుతాను.
చనిపోయినవారి శరీరాలను లాగివేయటానికి కుక్కలను పంపుతాను.
వారి శవాలను తినివేయటానికి, నాశనం చేయటానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను.
4 ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా
యూదా ప్రజలను భయంకరమైనదానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను.
మనష్షే[a] రాజు యెరూషలేములో చేసిన దానిని బట్టి
యూదా ప్రజలకు నేనీ విధంగా చేస్తాను.
మనష్షే యూదా రాజైన హిజ్కియా కుమారుడు.
మనష్షే యూదా రాజ్యానికి ఒక రాజు.’
5 “యెరూషలేము నగరమా, నీకొరకు ఒక్కడు కూడా విచారించడు.
ఎవ్వడూ నిన్ను గూర్చి విలపించడు.
నీ యోగ క్షేమాలు తెలుసుకొనేందుకు కూడా ఎవ్వరూ దగ్గరకు రారు.
6 యెరూషలేమా, నీవు నన్ను వదిలిపెట్టావు.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
“అనేక పర్యాయములు నీవు నన్ను చేరలేదు!
కావున నిన్ను నేను శిక్షించి నాశనం చేస్తాను.
మీ శిక్షను మీ మీదకు రాకుండా పట్టుకొని నేను అలసి పోయాను.
7 యూదా ప్రజలను నా కొంకె కర్రతో[b] వేరు చేస్తాను.
వారిని రాజ్యంలోగల నగర ద్వారాలవద్ద నిరుపయోగంగా పారవేస్తాను.
నా ప్రజలలో మార్పు రాలేదు.
అందుచే నేను వారిని నాశనం చేస్తాను.
వారి పిల్లలను నేను తీసుకొని పోతాను.
8 అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు.
సముద్రతీరాన ఉన్న ఇసుకకంటె ఎక్కువగా విధవ స్త్రీలు వుంటారు.
మధ్యాహ్న సమయంలో నేను నాశన కారులను తీసుకొని వస్తాను.
యూదా యువకుల తల్లులపై వారు దాడి చేస్తారు.
యూదా ప్రజలకు బాధను, భయాన్ని కలుగ జేస్తాను.
ఇదంతా అతి త్వరలో సంభవించేలా చేస్తాను.
9 శత్రువు కత్తులతో దాడిచేసి ప్రజలను చంపుతాడు.
మిగిలిన యూదా వారిని వారు చంపుతారు.
ఒక స్త్రీకి ఏడుగురు కుమారులుండవచ్చు, కాని వారంతా హత్య చేయబడతారు.
ఆమె ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది.
ఆమె కలవరపడి, తబ్బిబ్బై పోతుంది.
దుఃఖంవల్ల పట్టపగలే ఆమెకు చీకటి కలుగుతుంది.”
దేవునికి మరల యిర్మీయా తెలియజేయుట
10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది.
నేను దుఃఖపడుతున్నాను.
నేను దురదృష్టవంతుడను.
ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను.
నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు.
కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు!
11 యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను.
ఆపదకాలం వచ్చినప్పుడు నా శత్రువుల గురించి నేను నిన్ను వేడుకున్నాను.
యెహోవానుండి యిర్మీయాకు జవాబు
12 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గుచేయటం
ఎవరితరమూ కాదని నీకు తెలుసు.
అంటే నా ఉద్దేశ్యం ఉత్తరాన్నుంచి వచ్చేది ఇనుమువలె ఉంటుంది[c]
అలాగే ఇనుప ముక్కను చిదుకగొట్టే వారెవరు?
13 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి.
ఆ సంపదను పరులకు ఇస్తాను.
అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు.
నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను.
ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది.
యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.
14 యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను.
ముందెన్నడూ ఎరుగని రాజ్యంలో మీరు బానిసలవుతారు.
నేను మిక్కిలి కోపంతో ఉన్నాను.
నా కోపం రగులుతున్న అగ్నిలా ఉంది.
అందులో మీరు కాలిపోతారు.”
యిర్మీయా ఈ విధంగా చెప్పాడు:
15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో.
నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో.
ప్రజలు నన్ను గాయపర్చుతున్నారు.
వారికి తగిన శిక్ష విధించుము.
ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు.
వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు.
నా గురించి ఆలోచించుము.
యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.
16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుతున్నాను.
నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది.
నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.
17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు.
కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, ఎగతాళి చేశారు.
నామీద నీ ప్రభావం పడుటవలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను.
నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను కోపగించుకొనేలా చేశావు.
18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు.
నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు.
యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను.
నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు.
నీవు ఇంకిపోయిన నీటిబుగ్గలా ఉన్నావు.
19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే
నిన్ను నేను శిక్షించను.
నీవు మారి నావద్దకు వస్తే
నీవు నన్ను వెంబడించగలవు.
వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే
నాగురించి నీవు మాట్లాడగలవు.
యూదా ప్రజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి.
అంతేగాని నీవు మారి, వారిలా వుండకూడదు.
20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను.
నిన్ను చూచి వారంతా
కంచుగోడలాంటి వాడని అనుకుంటారు.
యూదావారు నీతో పోట్లాడుతారు.
కాని వారు నిన్ను ఓడించలేరు.
ఎందువల్లనంటే నేను నీతో వున్నాను.
నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను.
వారు నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి నిన్ను నేను రక్షిస్తాను.”
ఆపద రోజు
16 యెహోవా వర్తమానం నాకు వచ్చింది: 2 “యిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి యుండరాదు.”
3 యూదా రాజ్యంలో పుట్టిన కొడుకులు, కూతుళ్లను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మరియు ఆ పిల్లల తల్లిదండ్రులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు: 4 “ఆ ప్రజలు ఒక భయంకరమైన చావు చస్తారు! వారిని గురించి ఒక్కడు కూడా ఏడ్వడు, విచారించడు. వారినెవ్వడూ సమాధిచేయడు. పశువుల పేడవలె వారి శవాలు నేలమీద పడివుంటాయి. వారు శత్రువు కత్తికి బలియైపోతారు. లేదా ఆకలితో మాడి చనిపోతారు. వారి శవాలు ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు ఆహారమవుతాయి.”
5 అందువల్ల యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, ఏ ఇంటిలోనయితే చావు దినపు భోజనాలు జరుగుతూ వుంటాయో, నీవా ఇంటిలోనికి పోవద్దు. చనిపోయిన వారికొరకు విలపించటానికి గాని, నీ సంతాపాన్ని వెలిబుచ్చటానికి గాని నీవక్కడికి వెళ్లవద్దు. ఆ పనులు నీవు చేయవద్దు. ఎందువల్లనంటే, నా ఆశీర్వాదాన్ని నేను తిరిగి తీసుకున్నాను. యూదా ప్రజలకు నేను కరుణ చూపను. వారి కొరకు నేను బాధపడను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
6 “యూదా రాజ్యంలో ప్రముఖులు, సామాన్యులు అంతా చనిపోతారు. వారినెవరూ సమాధిచేయరు. లేక వారి కొరకు ఎవ్వరూ దుఃఖించరు. మృతుల కొరకు దుఃఖ సూచకంగా ఎవ్వడూ తన శరీరం చీరుకొనటంగాని, తల గొరిగించుకోవటం గాని చేయడు. 7 చనిపోయిన వారికొరకై విలపించేవారికి ఎవ్వరూ ఆహారం తెచ్చియివ్వరు. తల్లిదండ్రులు చనిపోయి విలపించేవారిని ఎవ్వరూ ఓదార్చరు. మృతుల కొరకు రోదించేవారిని ఆదరించుటకు ఎవ్వరూ తాగటానికి నీరు ఇవ్వరు.
8 “విందు జరుపుకుంటూన్న ఏ ఇంటిలోనికీ నీవు వెళ్లవద్దు. ఆ ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి కూర్చోవద్దు. 9 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెప్పినాడు: ‘వేడుక చేసుకొనే వారు ఆనందమును నేను వెంటనే ఆపివేస్తాను. ఇది నీ జీవితకాలంలోనే జరుగుతుంది. ఇవన్నీ త్వరలోనే చేస్తాను.’
10 “యిర్మీయా, యూదా ప్రజలకు నీవు ఈ విషయాలన్నీ చెపుతావు. తిరిగి వారు నిన్నిలా అడుగుతారు: ‘మా విషయంలో దేవుడు ఆ భయంకర విషయాలు జరుగుతాయని ఎందుకు చెప్పాడు? మేము చేసిన తప్పేమిటి? మా యెహోవా దేవునికి వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’ 11 అప్పుడు వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి: ‘ఈ భయంకర పరిణామాలు జరగబోవడానికి కారణం మీ పితరులు నన్ను అనుసరించటం మానివేయటమే’ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది: ‘వారు నన్ను వదిలి అనేక ఇతర దైవముల ననుసరించి ఆరాధించినారు. మీ పితరులు నన్ను వదిలి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించుట మానివేశారు. 12 కాని మీరు మీ పూర్వీకులకంటె నీచంగా పాపం చేశారు. మీరు కఠినాత్ములై చాలా మొండివైఖిరి దాల్చారు. మీరు చేయదలచుకున్నదే మీరు చేస్తున్నారు. మీరు నాకు విధేయులుగా లేరు. మీకు యిష్టమైనదే మీరు చేస్తున్నారు. 13 కావున మిమ్మల్ని ఈ దేశంనుండి బహిష్కరిస్తాను. మిమ్మల్ని అన్యదేశానికి తరిమివేస్తాను. మీరు, మీ పూర్వీకులు ముందెన్నడూ చూడని దేశానికి మీరు వెళతారు. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు బూటకపు దేవతలను వెంబడించవచ్చు. నేను మీకు సహాయం చేయను. ఏ రకమైన ఉపకారమూ చేయను.’
14 “ప్రజలు ప్రమాణాలు చేస్తూ, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చిన నిత్యుడైన దేవునితోడు’ అని వారు అంటారు. కాని ప్రజలు ఈ మాటలు అనకుండా ఉండే సమయం ఆసన్నమవుతూఉంది.” ఇది యెహోవా వాక్కు. 15 ప్రజలు వాగ్దానాలు చేసి అంటారు: “నిత్యుడైన దేవుని సాక్షిగా అని, ‘ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని వచ్చినది నిత్యుడైన యెహోవాయే!’ అని, ‘ఇశ్రాయేలీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల తీసుకొని వచ్చినది ఆయనే’ అని అంటారు. ప్రజలు ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయేలీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి మరల తీకుకొనివస్తాను.
16 “ఈ రాజ్యానికి చాలామంది జాలరులను త్వరలో పంపిస్తాను” ఇది యెహోవా వాక్కు “ఆ జాలరులు యూదా ప్రజలను పట్టుకుంటారు. అది జరిగిన పిమ్మట ఈ రాజ్యానికి చాలామంది వేటగాండ్రను పిలిపిస్తాను. ఈ వేటగాండ్రు[d] యూదావారిని ప్రతి కొండమీద, పర్వతంమీద, కొండ బొరియల్లోను వేటాడతారు. 17 వారు చేసేదంతా నేను చూస్తాను. యూదా వారు చేసేది దేనినీ నానుండి దాచలేరు. వారి పాపం నానుండి మరుగు పర్చబడలేదు. 18 యూదా ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. వారి ప్రతి పాపానికీ రెండు సార్లు శిక్షిస్తాను. ఇది ఎందుకు చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని ‘అపవిత్ర’ పర్చారు. వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో ‘కలుషితం’ చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించుకుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘోరమైన చెడు విగ్రహాలతో నింపివేశారు.”
19 యెహోవా, నీవే నాకు బలం; నీవే నాకు రక్షణ.
ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు.
ప్రపంచ దేశాలన్నీ నీ శరణు వేడి వస్తాయి.
ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు.
వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేవు.
20 ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయగలరా?
చేయలేరు! వారు విగ్రహాలను మాత్రమే చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే కారు!”
21 “అందుచేత బొమ్మల దేవుళ్లను చేసేవారికి నేను గుణపాఠం నేర్పుతాను.
ఇప్పుడే వారికి నా శక్తిని గురించీ, నా బలాన్ని గురించీ తెలియజెబుతాను.
అప్పుడు నేనే దేవుడననే జ్ఞానం వారికి కలుగుతుంది.
నేనే యోహోవా అని వారు తెలుసుకుంటారు.”
నేరం గుండెపై వ్రాయబడింది
17 “యూదా ప్రజల పాపం తుడిచి వేయలేని
చోట వ్రాయబడింది.
వారి పాపాలు ఇనుపకలంతో రాతిలోకి చెక్కబడ్డాయి.
వారి పాపాలు వజ్రపు మొనతో రాతిలోకి చెక్కబడ్డాయి.
వారి గుండెలే ఆ రాతి ఫలకలు.
2 బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు
వారి పిల్లలకు గుర్తున్నాయి.
ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ములమీద[e] చెక్కబడినాయి.
అషేరా దేవతకు అంకితం చేయబడిన
దేవతా చెక్కస్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి.
కొండలమీద, పచ్చని చెట్లక్రింద జరిగిన
తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి.
3 మైదాన ప్రదేశాలలోగల పర్వాతాల మీద జరిగిన
సంగతులు వారికి గుర్తున్నాయి.
యూదా ప్రజలకు నిధి నిక్షేపాలున్నాయి.
వాటిని నేను అన్య ప్రజలకు ఇచ్చివేస్తాను!
మీ దేశంలోగల ఉన్నత స్థలాలన్నీ (పూజా ప్రదేశాలు) ప్రజలు నాశనం చేస్తారు.
ఆ ప్రదేశాలలో ఆరాధనలు చేసి మీరు పాపం చేశారు.
4 నేను మీకిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు.
మీ విరోధులు మిమ్మల్ని బానిసలుగా తీసుకొని పోయేలా చేస్తాను.
ఎందువల్లనంటే, నేను చాలా కోపంగా ఉన్నాను.
నా కోపం దహించే అగ్నిలా ఉంది. మీరందులో శాశ్వతంగ కాలిపోతారు.”
ప్రజలలో నమ్మిక మరియు దేవునిలో నమ్మిక
5 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు:
“ఇతర ప్రజలను నమ్మేవారికి
కీడు జరుగుతుంది.
బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడేవారికి
కష్ట నష్టాలు వస్తాయి.
ఎందువల్లనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మాని వేశారు.
6 ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు.
ఆ పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు.
ఆ పొద ఎండిన ఉష్ణ ప్రదేశంలో ఉంది.
ఆ పొద చవుడు భూమిలో ఉంది.
ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు.
7 కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు.
ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
8 నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె
ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు.
నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది.
దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి.
ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు.
ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.
9 “మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుండి.
మనస్సు చాలా వ్యాధిగ్రస్తమయ్యింది.
మానవ మనస్సును ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు.
10 కాని యెహోవానైన నేను
ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను.
వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను.
ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను.
11 ఒకానొక పక్షి తను గ్రుడ్లు పెట్టకుండానే
వేరే పక్షులు పెట్టిన గ్రుడ్లను పొదుగుతుంది.
డబ్బుకోసం ఇతరులను మోసం చేసే వాడుకూడా
అలాంటి పక్షిలాంటి వాడే.
వాని జీవితం సగంగడిచే సరికి
వాని ధనం పోతుంది.
తన జీవిత ఆఖరి (చివరి) దశలో వాడు
పరమ మూర్ఖుడై పోతాడనేది విదితమైన విషయం.”
12 ఆదినుంచీ మన దేవాలయం
ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది.
అది చాలా ముఖ్యమైన స్థలం.
13 యెహోవా, నీవు ఇశ్రాయేలీయులకు ఆశాజ్యోతివి.
దేవా, నీవు జీవజలధారలా ఉన్నావు!
ఆయనను విడిచిపెట్టిన వారు అవమానానికి గురవుతారు.
వారు అవమానించబడుతారు. జీవిత ప్రమాణం తగ్గిపోతుంది.[f]
యిర్మీయా మూడవ విన్నపం
14 యెహోవా, నీవు నన్ను బాగుచేస్తే
నేను నిజంగా స్వస్థపడతాను!
నన్ను రక్షిస్తే,
నేను నిజంగా రక్షింపబడతాను.
యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
15 యూదా ప్రజలు నన్ను ప్రశ్నలడుగుతూవుంటారు.
“యిర్మీయా, యెహోవా వర్తమానం ఎక్కడ?
ఆ వర్తమానం నెరవేరేలా చేయి!” అని వారంటారు.
16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారిపోలేదు.
నేను నిన్ను అనుసరించాను.
నీవు కోరిన విధంగా నేను గొర్రెలకాపరినయ్యాను.
ఆ భయంకరమైన రోజు రావాలని నేను కోరుకోలేదు.[g]
యెహోవా, నేను చెప్పిన విషయాలు నీకు తెలుసు.
జరుగుతున్నదంతా నీవు చూస్తూనే ఉన్నావు.
17 యెహోవా, నన్ను నాశనం చేయవద్దు.
కష్టకాలంలో నేను నిన్నాశ్రయిస్తాను.
18 ప్రజలు నన్ను హింసిస్తున్నారు.
వారిని సిగ్గుపడేలాచేయి.
కాని నాకు ఆశాభంగం కలుగచేయకుము.
ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము.
కాని నన్ను మాత్రం పారిపోనీయవద్దు.
ఆ భయంకరమైన దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము.
వారిని పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా భంగపర్చుము.
సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించటం
19 యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ‘ముఖద్వారం’[h] వద్ద నిలబడు. అక్కడ యూదా రాజులు లోనికి, బయటికి వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రజలకు నా వర్తమానం అందజేయి. తరువాత అన్ని ద్వారాల వద్దకూ వెళ్లి అలాగే చేయి.”
20 ఆ ప్రజలకు ఇలా చెప్పుము: “యెహోవా వర్తమానం వినండి. యూదా రాజులారా, వినండి. యూదా ప్రజలారా, వినండి. ఈ ద్వారం ద్వారా యెరూషలేములోనికి వచ్చే ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి! 21 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు సబ్బాతు దినాన మీరేమీ బరువులు మోయకుండా జాగ్రత్త తీసుకోండి. యెరూషలేము నగర ద్వారాల గుండా విశ్రాంతి దినాన ఏమీ బరువులు తేవద్దు. 22 మీ ఇండ్లనుండి కూడా పవిత్ర విశ్రాంతి దినాన బరువులు తేవద్దు. ఆ రోజున మీరు ఏపనీ చేయవద్దు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్ర పర్చాలి. ఇదే రకపు ఆజ్ఞను మీ పూర్వీకులకు కూడ యిచ్చియున్నాను. 23 కాని మీ పూర్వీకులు నా ఆజ్ఞను శిరసావహించలేదు. వారు నేను చెప్పిన దానిని లక్ష్య పెట్టలేదు. మీ పితరులు బహు మొండివారు. నేను వారిని శిక్షించాను. కాని దానివల్ల ఏమీ మంచి జరగలేదు. వారు నేను చెప్పినది వినలేదు. 24 కాని మీరు నా ఆజ్ఞను అనుసరించేలా జాగ్రత్తపడాలి.” ఇది యెహోవా వాక్కు. “మీరు ఎట్టి పరిస్థితిలోనూ విశ్రాంతి దినాన యెరూషలేము నగర ద్వారాలనుండి బరువులు తేరాదు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపర్చాలి. అనగా మీరు ఆ రోజు ఏ పనీ చేయకుండా దాని పవిత్రతను కాపాడవచ్చు.
25 “‘మీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం గుండా వస్తారు. ఆ రాజులు రధాలమీద, గుర్రాల మీద ఎక్కి వస్తారు. ఆ రాజుల వెంట యూదా, యెరూషలేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూషలేము నగరంలో శాశ్వతంగా ప్రజలు నివసిస్తారు. 26 యూదా పట్టణాలనుండి ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. చుట్టుపట్లవున్న చిన్న చిన్న గ్రామాలనుండి కూడా ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. బెన్యామీను వంశీయులున్న రాజ్యంనుండి కూడా ప్రజలు వస్తారు[i] పడమట నున్న కొండవాలు ప్రాంతం నుండి, మన్యప్రాంతం నుండి కూడా ప్రజలు వస్తారు. మరియు యూదా దక్షిణ ప్రాంతంనుండి కూడా నెగెవు ప్రజలు వస్తారు. ఆ ప్రజలు కృతజ్ఞతార్పణలు, దహన బలులు, బలులు, ధాన్యార్పణలు, ధూపద్రవ్వాలు, తెస్తారు. వారా అర్పణలను, బలులను యెహోవా ఆలయానికి తెస్తారు.
27 “‘అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వారములవద్ద మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.’”
క్రీస్తు యేసు యొక్క విధేయ సైనికుడు
2 నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. 2 నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగలవాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్నవాళ్ళకు అప్పగించు. 3 యేసు క్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు. 4 సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు, తన సైన్యాధిపతిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. 5 అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు. 6 కష్టించి పని చేసే రైతుకు, వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది. 7 నేను చెప్పేవాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకొనే జ్ఞానం కల్గిస్తాడు.
8 దావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త. 9 ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్ళతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు. 10 కనుకనే, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.
11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది:
మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం.
12 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం!
మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు.
13 మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు.
తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
దేవుడు సమ్మతించిన పనివాడు
14 వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను హెచ్చరించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది. 15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
16 విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. 17 వీళ్ళ బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్ళు. 18 వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.
19 అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు.(A) ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.
20 గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. 21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
22 యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు. 23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 26 అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు.
© 1997 Bible League International