Old/New Testament
యిర్మీయా దేవునికి ఫిర్యాదు చేయుట
12 యెహోవా, నేను నీతో వాదించినట్లయితే,
నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు!
కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలనుకొంటున్నాను.
దుర్మార్గులు ఎందుకు విజయవంతులవుతున్నారు?
నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?
2 ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి,
అభివృద్ధిచెంది కాయలు కాసారు.
నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెబుతారు.
కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు.
3 ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు.
నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు.
గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి.
సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి.
4 ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి?
ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి?
దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి.
ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం.
పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు”
అని ఆ దుర్మార్గులే అంటున్నారు.
యిర్మీయాకు దేవుని సమాధానం
5 “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే,
మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు?
సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే,
యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?
6 ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు.
నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు.
నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు.
వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా
నీవు వారిని నమ్మవద్దు.
యెహోవా యూదాను తిరస్కరించుట
7 “నేను (యెహోవాను) నా ఇంటిని (యూదాను) వదిలివేశాను.
నా స్వంత ఆస్తిని[a] నేను వదిలివేశాను.
నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.
8 నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా తయారయ్యింది.
అది నన్ను చూచి గర్జిస్తూవుంది.
అందుచే దాన్ని నేను అసహ్యించు కుంటున్నాను.
9 నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన
చనిపోయే జంతువులా వుంది.
ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి.
వన్య (అడవి) మృగములారా, రండి.
రండి, తినటానికి ఆహారం తీసుకోండి.
10 చాలామంది గొర్రెల కాపరులు (నాయకులు) నా ద్రాక్షా తోటను నాశనం చేసారు.
ఆ కాపరులు నా తోటలోని మొక్కలపై నడిచారు.
వారు నా అందాల తోటను వట్టి ఎడారిగా మార్చి వేశారు.
11 వారు నా భూమిని ఎడారిలా చేశారు.
అది ఎండి చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు.
దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది.
అక్కడ ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ లేరు.
12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు.
యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు.
రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు.
ఏ ఒక్కరికీ రక్షణ లేదు.
13 ప్రజలు గోధుమ పైరు నాటుతారు.
కాని వారు కోసేది ముండ్లను మాత్రమే.
వారు బాగా అలసిపోయేటంతగా శ్రమిస్తారు.
కాని వారి శ్రమకు ఫలం శూన్యం.
వారి పంట విషయంలో వారు సిగ్గు చెందుతారు.
యెహోవా కోపకారణంగా ఇదంతా జరిగింది.”
ఇశ్రాయేలు పొరుగు వారికి దేవుని వాగ్దానం
14 యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి త్రోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా పెల్లగించుతాను. 15 నేను వారిని తమ రాజ్యం నుండి భ్రష్టులను చేశాక, వారి విషయంలో నేను బాధపడతాను. తరువాత ప్రతి కుటుంబాన్నీ దాని స్వస్థలానికి, స్వంత ఆస్తికి తీసుకొని వస్తాను. 16 కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా …’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను. 17 కాని ఏ దేశమైనా మాట వినకపోతే, అప్పుడు నేను వారిని సర్వ నాశనం చేస్తాను. చచ్చిన మొక్కలవలె వారిని లాగి పారవేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
నడికట్టు సంకేతం
13 యెహోవా నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక నడికట్టు బట్టకొని[b] తీసుకురా. దానిని నీవు ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.”
2 కావున యెహోవా చెప్పిన విధంగా నేనొక నడికట్టు వస్త్రం కొని ధరించాను. 3 అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినబడింది. 4 ఆ వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు వస్త్రం తీసుకొని ఫరాతుకు[c] వెళ్లుము. అక్కడ ఒకబండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.”
5 అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను. 6 చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు.
7 అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది.
8 అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది. 9 యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, ఎందుకూ పనికిరానిదయి పోయింది. అదే విధంగా, యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టులనందరినీ నాశనం చేస్తాను. 10 యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు. 11 నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”
యూదాకు హెచ్చరికలు
12 “యిర్మీయా, యూదా ప్రజలకు ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడని తెలియజేయుము: ‘ప్రతి ద్రాక్షరసపు తిత్తియు[d] ద్రాక్షారసముతో నింపాలి.’ అది విన్న ఆ జనులు నవ్వి, ‘అవును. ప్రతి ద్రాక్షారసపు తిత్తీ ద్రాక్షారసంతోనే నింపాలని మాకు తెలుసు’ అని నీతో అంటారు. 13 అప్పుడు నీవిలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: ఈ రాజ్యంలో నివసించే ప్రతివానిని త్రాగిన వానిలా నిస్సహాయుని చేస్తాను. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను యాజకుల గురించి, ప్రవక్తల గురించి యెరూషలేము వారందరిని గురించి నేను మాట్లాడుతున్నాను. 14 యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.’ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది ‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.’”
15 శ్రద్ధగా ఆలకించండి.
యెహోవా మీతో మాట్లాడియున్నాడు.
మీరు గర్విష్టులు కావద్దు.
16 మీ యెహోవా దేవుని గౌరవించండి.
ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు.
మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనకు స్తోత్రం చేయండి.
యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు.
కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు.
యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు.
17 యూదా ప్రజలారా, మీరు యెహోవా వాక్కు వినకపోతే
నేను దాగుకొని విలపిస్తాను.
మీ గర్వం నన్ను విలపించేలా చేస్తోంది.
నేను బిగ్గరగా విలపిస్తాను.
నా కన్నీరు వరదలై పారుతుంది.
ఎందువల్లనంటే, యెహోవా మంద[e] బందీయైపోయింది.
18 ఈ విషయం రాజుకు, ఆయన భార్యకు తెలియ జెప్పండి:
“మీ సింహాసనాల నుండి మీరు దిగిరండి.
మీ అందాల కిరీటాలు మీ తలలనుండి క్రిందికి పడిపోయాయి.”
19 నెగెవు[f] ఎడారిలో మీ నగరాలు మూసివేయ బడ్డాయి.
వాటిని ఎవ్వరూ తెరువలేరు.
యూదా ప్రజలంతా చెరపట్టబడ్డారు.
వారంతా బందీలుగా కొనిపోబడ్డారు.
20 యెరూషలేమా, పైకి చూడు!
ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు.
నీ మంద ఎక్కడ? ఆ అందమైన మందను దేవుడు నీకిచ్చాడు.
ఆ మంద రక్షణ బాధ్యత నీదై వుంది.
21 ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి చెపుతావు?
నీవు దేవుని గురించి ప్రజలకు బోధించవలసివుంది.
నీ నాయకులు ప్రజలను నడిపించవలసి ఉంది.
కాని వారి పని వారు చేయలేదు!
కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను అనుభవిస్తావు.
నీ బాధ స్త్రీ యొక్క ప్రనవవేదనలాంటిది.
22 “నాకెందుకీ చెడు దాపురించింది?”
అని నీకు నీవే ప్రశ్నించుకో.
నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు.
నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది.
నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి.
నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు.
23 నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు.
చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు.
అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి పనులు చేయలేవు.
నీవు ఎల్లప్పుడూ చెడు చేయటానికే అలవాటు పడ్డావు.
24 “మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను.
మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని వైపులకూ పారిపోతారు.
ఎడారి గాలికి కొట్టుకు పోయే పొట్టులాంటి వారు మీరు.
25 ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి.
నా ప్రణాళికల్లో నీ పాత్ర ఇదే.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
“ఇది ఎందుకు సంభవిస్తుందంటే
నీవు నన్ను మర్చిపోయావు.
నీవు బూటకపు దేవుళ్లను నమ్మావు.
26 యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను.
ప్రతివాడూ నిన్ను చూస్తాడు. నీవు అవమానం పాలవుతావు.
27 నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను.[g]
నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను.
వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు.
నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను.
యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది.
అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.”
అనావృష్టి కపట ప్రవక్తలు
14 అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు యెహోవా పంపిన వర్తమానం:
2 “యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు రోధిస్తుంది.
యూదా నగరాల ప్రజలు నానాటికీ బలహీనమౌతారు.
వారు నేలమీద పడతారు.
యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు వెళుతుంది.
3 ప్రజా నాయకులు వారి సేవకులను నీటికొరకు పంపుతారు.
సేవకులు జలాశయాల వద్దకు వెళతారు.
కాని వారికి నీరు దొరకదు.
సేవకులు ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు.
దానితో వారు సిగ్గుపడి, కలత చెందుతారు.
అవమానంతో వారి తలలు బట్టతో కప్పుకుంటారు.
4 ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు
రాజ్యంలో వర్షం కురియదు.
రైతులు నిరాశతో క్రుంగి పోతారు.
వారు సిగ్గుతో తమ ముఖాలు కప్పుకుంటారు.
5 పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది.
పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది.
6 అడవి గాడిదలు వట్టి కొండలపైన నిలబడతాయి.
గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి.
వాటి కంటికి ఆహారమే కన్పించదు.
ఎందువల్లనంటే వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు లేవు.
7 “నా ప్రజలిలా నాకు మొరపెట్టుకుంటారు: జరిగిన విషయాలన్నిటికీ మా తప్పులే కారణమని మాకు తెలుసు.
మా పాపాల ఫలంగా మేమిప్పుడు కష్టాలనుభవిస్తున్నాము.
యెహోవా, నీ నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు సహాయపడుము.
నిన్ను అనేక సార్లు మేము వదిలిపెట్టినట్లు మేము ఒప్పుకుంటున్నాము.
నీ పట్ల మేము పాపం చేశాము.
8 ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి!
కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే.
అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు.
ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.
9 ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు.
ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు.
అయినా నీవు మాతో ఉన్నావు.
యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నాము. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”
10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.”
11 పిమ్మట యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, యూదా ప్రజలకు శుభం కలగాలని ప్రార్థన చేయవద్దు. 12 యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”
13 కాని నేను యెహోవాతో ఇలా అన్నాను: “నా ప్రభువా, ప్రజలకు ప్రవక్తలు వేరొక రకంగా చెపు తున్నారు. ప్రజలు శత్రువు కత్తికి గురికావలసిన గతి పట్టదనీ, వారికి కరువు రాదనీ, యెహోవా ఈ రాజ్యంలోనే వారికి సుఖశాంతులు కలుగజేస్తాడనీ ప్రవక్తలు చెపుతున్నారు.”
14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, ఆ ప్రవక్తలు నా పేరుతో అబద్దాలు బోధిస్తున్నారు. ఆ ప్రవక్తలను నేను పంపలేదు. నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారితో నేను మాట్లాడలేదు. ఆ ప్రవక్తలు బోధించేదంతా అబద్ధపు దర్శనాలు. వట్టి కనికట్టు. అది వారి స్వంత కల్పన. 15 అందువలన నా పేరుతో భవిష్యత్తును చెప్పే ప్రవక్తల విషయంలో నేను చెప్పేదేమంటే వారిని నేను పంపలేదు. ఆ ప్రవక్తలు ‘కత్తిపట్టిన శత్రువెవ్వడూ ఈ రాజ్యంమీదికి రాడు. ఈ రాజ్యంలో కరువనేది ఉండదు,’ అని కదా చెప్పారు. చూడుము; ఆ ప్రవక్తలే ఆకలితో మాడి చస్తారు. శత్రువు కత్తికి బలియైపోతారు. 16 ఆ ప్రవక్తలు ఏ ప్రజలతో మాట్లాడినారో, వారు వీధిలోనికి లాగబడతారు. ఆ ప్రజలు ఆకలితో చనిపోతారు. శత్రువుల కత్తి వారిని నరికివేస్తుంది. వారిని గాని, వారి భార్యలను గాని, వారి కుమారులను లేక కుమార్తెలను గాని పాతి పెట్టటానికి ఒక్కడుకూడా మిగలడు! నేను వారిని శిక్షిస్తాను.
17 “యిర్మీయా, యూదా ప్రజలకు
ఈ వర్తమానం అందజేయి.
‘నా కండ్లు కన్నీళ్ళతో నిండాయి. రాత్రింబవళ్లు నేను ఎల్లప్పుడూ విలపిస్తాను.
కన్యయగు నా కుమార్తె[h] కొరకు విలపిస్తాను. నా ప్రజలకొరకు నేను దుఃఖిస్తాను.
ఎందువల్లనంటే అన్యుడొకడు వారిని గాయపర్చినాడు; వారిని అణగద్రొక్కినాడు.
వారు తీవ్రంగా గాయపర్చబడినారు.
18 నేను పల్లెపట్టులకు వెళితే,
కత్తులతో సంహరింపబడినవారిని చూస్తాను.
నేను నగరానికి వెళితే
అక్కడ నేను తిండి లేక రోగగ్రస్థులైన వారిని చూస్తాను.
యాజకులు, ప్రవక్తలు వారెరుగని అన్యదేశానికి కొనిపోబడ్డారు.’”
19 యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా?
యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా?
నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది.
నీవు ఆ పని ఎందుకు చేశావు?
మేము శాంతిని కోరుకుంటున్నాము.
కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు.
మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము;
కాని భయము పుట్టుచున్నది.
20 యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు.
మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు.
అవును. మేము నీ పట్ల పాపం చేశాము.
21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకైనా మమ్మల్ని త్రోసివేయవద్దు!
దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు.
మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి.
ఆ నిబంధనను మరువవద్దు.
22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు.
ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు.
నీవే మాకు దిక్కు
నీవే ఈ కార్యములన్నీ జరిపించేది.
1 పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక!
2 నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.
దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.
విశ్వాసంలో ఉండండి
3 నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వికుల దేవునికి సేవచేస్తూ కృతజ్ఞుడనై యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. 4 నీలాంటివాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. 5 నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉంది. నీ తల్లి యునీకేలో కూడా ఉంది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. 6 అందుకోసం, నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు.
8 కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకు. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించు.
9 దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. 10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.
11 ఈ సువార్తను ప్రకటించటానికి నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు. 12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే, నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.
13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.
15 ఆసియ ప్రాంతములో ఉన్నవాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. “పుగెల్లు” “హెర్మొగెనే” కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు. 16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక! 17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. 18 ఆ “రానున్న రోజున” కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.
© 1997 Bible League International