Old/New Testament
9 నా తల నీటితో నిండియున్నట్లయితే,
నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన
నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!
2 ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం
ఎడారిలో నాకొకటి ఉంటే
అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను.
వారినుండి నేను దూరంగా పోగలను!
ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు.
వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.
3 “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు.
వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి.
సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది.
వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు.
వారు నన్నెరుగకున్నారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.
4 “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి!
మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు!
ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే.
ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.
5 ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును.
ఎవ్వడూ సత్యం పలుకడు.
యూదా ప్రజలు అబద్ధమాడుటలో
తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు.
వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!
6 ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది.
అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి!
ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ
విషయాలను యెహోవా చెప్పినాడు!
7 కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెబుతున్నాడు,
“లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను!
నాకు వేరే మార్గం లేదు.
నా ప్రజలు పాపం చేశారు.
8 యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు.
వారి నాలుకలు అబద్ధాలనే మాట్లాడతాయి.
ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు.
కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.
9 మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?”
“ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు.
నేను వారికి తగిన శిక్ష విధించాలి.”
ఇది యెహోవా వాక్కు.
10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను.
వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను.
ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి.
ఎవ్వడూ అక్కడ పయనించడు.
ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు వినరావు.
పక్షులు ఎగిరి పోయాయి:
పశువులు పారిపోయాయి.
11 “నేను (యెహోవా) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను.
అది గుంట నక్కలకు[a] స్థావరమవుతుంది.
నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను.
అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”
12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా?
యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా?
యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా?
రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది?
జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.
13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు.
వారికి నా ఉపదేశములు ఇచ్చాను.
కాని వారు వినటానికి నిరాకరించారు.
వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.
14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు.
వారు మొండివారు.
వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు.
బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”
15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు,
“యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను.
విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.
16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను.
వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది.
వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు.
కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను.
యూదా ప్రజలను వారు చంపివేస్తారు.
ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”
17 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
“ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము!
శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను పిలిపించుము.
కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము.
18 ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి.
అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి.
కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.
19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన,
‘మేము నిజంగా నాశనమయ్యాము!
మేము నిజంగా అవమానం పాలైనాము!
మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”
20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి.
యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనివ్వండి.
యెహోవా ఇలా అంటున్నాడు, మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి.
ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:
21 “మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది.
మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది.
వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది.
బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.”
22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము,
పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి.
పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి
కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.’”
23 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి
గొప్పలు చెప్పుకోరాదు.
బలవంతులు తమ బలాన్ని గురించి
గొప్పలు చెప్పుకోరాదు.
శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి
గొప్పలు చెప్పుకోరాదు.
24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము.
నన్నతను అర్థం చేసుకున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనిమ్ము.
యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము.
నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.”
ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.
25 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయము ఆసన్నమవుతూ ఉంది. 26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”
దేవుడు మరియు విగ్రహాలు
10 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము! 2 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు!
ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు[b] నీవు భయపడవద్దు!
అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు.
కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవికావు.
వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు.
వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో చెక్కి మలుస్తాడు.
4 వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు.
వాటిని పడిపోకుండా సుత్తులతో
మేకులు కొట్టి నిలబెడతారు.
5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి.
వారి విగ్రహాలు మాట్లాడవు.
వారి విగ్రహాలు నడవలేవు.
ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి!
కావున ఆ విగ్రహాలకు భయపడకు.
అవి నిన్ను ఏమీ చేయలేవు.
పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”
6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు!
నీవు గొప్పవాడవు!
నీ నామము గొప్పది మరియు శక్తి గలది.
7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు.
వారందరి గౌరవానికి నీవు అర్హుడవు.
ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులున్నారు.
కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.
8 అన్యదేశవాసులు మందబుద్ధులు, మూర్ఖులు.
వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.
9 వారు తర్షీషు నగరంనుండి వెండిని,
ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు.
విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి.
ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు.
“జ్ఞానులు” ఆ “దేవుళ్ల” ని చేస్తారు.
10 కాని యెహోవా నిజమైన దేవుడు.
ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు!
శాశ్వతంగా పాలించే రాజు ఆయనే.
దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది.
ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు.
11-12 “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము,
‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు.
వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’”[c]
తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే.
దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు.
తన అవగాహనతో దేవుడు
ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు.
13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు.
ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు.
భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు.
ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు.
ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.
14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు!
లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు.
వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు.
అవి జడపదార్థములు[d]
15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి.
అవి హాస్యాస్పదమైనవి.
తీర్పు తీర్చే కాలంలో
ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.
16 కాని యాకోబు యొక్క దేవుడు[e] ఆ విగ్రహాలవంటి వాడు కాదు.
ఆయన సర్వసృష్టికి కారకుడు.
ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు.
ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”
నాశనం వస్తూవుంది
17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి.
యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు.
శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు.
18 యెహోవా ఇలా చెప్పాడు,
“ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను.
వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను.
వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను.”[f]
19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను
నా గాయం మానరానిది.
“ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే”
అని నేను తలపోశాను.
20 నా గుడారం పాడైపోయింది.
దాని తాళ్లన్నీ తెగిపోయాయి.
నా పిల్లలు నన్ను వదిలేశారు.
వారు వెళ్లిపోయారు.
నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు.
నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు.
21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు!
వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు,
వారు జ్ఞాన శూన్యులు.
అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదురై తప్పిపోయాయి.
22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము!
ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది.
అది యూదా నగరాలను నాశనం చేస్తుంది.
యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది.
అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.
23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు.
ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు.
జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు.
ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.
24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము!
నీవు మమ్ము నశింపజేయవచ్చు
కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము!
కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!
25 నీకు కోపంవస్తే,
అన్యదేశాలను శిక్షించుము.
వారు నిన్నెరుగరు; గౌరవించరు.
ఆ ప్రజలు నిన్ను పూజించరు.
ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి.
వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు.
వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.
ఒడంబడిక ఉల్లంఘన
11 ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినదిః 2 “యిర్మీయా, ఈ ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా ఈ విషయాలు తెలియజేయుము. 3 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినది ఇది: ‘ఈ ఒడంబడికను అనుసరించని ప్రతి వానికి కీడు వాటిల్లుతుంది.’ 4 నేను మీ పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్లాడుతున్నాను. వారిని ఈజిప్టునుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసుకొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలాఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను.
5 “నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాదిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమిని ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.”
నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.
6 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి. 7 ఈజిప్టునుండి విడుదల చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు విధేయులై వుండమని వారికి చెప్పాను. 8 కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారి దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”
9 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా! యూదా ప్రజలు, యెరూషలేము వాసులు రహస్య పథకాలు వేశారని నాకు తెలుసు. 10 ఆ ప్రజలు వారి పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీకులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించినారు.”
11 కావున యెహోవా ఇలా చెప్పినాడు, “త్వరలో యూదా వారికి భయంకర విపత్తు సంభవించేలా చేస్తాను. వారు దానినుండి తప్పించుకోలేరు! వారు దుఃఖపడతారు. వారు నా సహాయంకొరకు రోదిస్తారు. అయినా నేను వారి రోదన వినను. 12 అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.
13 “యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి.
14 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పుడు సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను.
15 “నా ప్రియురాలు (యూదా) నా ఇంట్లో (ఆలయం) ఎందుకు ఉన్నది?
అక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. ఆమె చాలా చెడుపనులు చేసింది.
యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమాణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని నీవనుకుంటున్నావా?
నాకు బలులు అర్పించటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని తలుస్తున్నావా?”
16 యెహోవా నీకొక పేరు ఇచ్చాడు.
“కంటికింపైన పచ్చని ఒలీవ చెట్టు” అని నిన్ను పిలిచాడు
కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు.
దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.[g]
17 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా
కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు.
ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు,
యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు.
మీరు బూటకపు దేవత బయలుకు బయట సమర్పించి
యెహహోవాకు కోపం తెప్పించారు.
యిర్మీయాపై కుట్ర
18 అనాతోతు ప్రజలు[h] నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది. 19 వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.” 20 యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి తగిన శిక్ష నీవే యిమ్ము.
21 అనాతోతు మనుష్యులు యిర్మీయాను చంపుటకు పథకం పన్నుచుండిరి. వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు యెహోవా పేరుతో ప్రకటనలు చేయవద్దు. లేనిచో నిన్ను మేము చంపివేస్తాం.” అనాతోతు మనుష్యుల విషయంలో యెహోవా ఒక నిర్ణయానికి వచ్చాడు. 22 సర్వశక్షిమంతుడైన యెహోవా ఇలా చెప్పాడు, “నేను త్వరలో అనాతోతు ప్రజలను శిక్షిస్తాను. వారి యువకులు యుద్ధంలో మరణిస్తారు. వారి కుమారులు, కమార్తెలు ఆకలితో మాడి చనిపోతారు. 23 అనాతోతులో ఒక్కడు కూడా వదిలిపెట్టబడడు. ఎవ్వడూ బ్రతకడు. వారిని నేను శిక్షిస్తాను. వారికి కీడు దాపురించేలా నేను చేస్తాను.”
బానిసలకు ప్రత్యేక నియమాలు
6 బానిసత్వంలో ఉన్నవాళ్ళు తమ యజమానులను పూర్తిగా గౌరవించాలి. అప్పుడే దేవునికి, మా బోధనకు చెడ్డపేరు రాకుండా ఉంటుంది. 2 యజమానులు దేవుని కుటుంబానికి చెందినంత మాత్రాన బానిసలు వారిని గౌరవించటం మానుకోరాదు. అలా కాక వాళ్ళకు యింకా ఎక్కువ సేవ చేయాలి. ఎందుకంటే ఈ సేవ పొందే వాళ్ళు భక్తులు. వీరు ప్రేమ చూపుతున్న వాళ్ళు.
ఈ విధంగా నీవు వీటిని ఉపదేశించి ఆచరణలో పెట్టుమని వాళ్ళకు చెప్పు.
ధన ఆశ
3 మన యేసు క్రీస్తు ప్రభువు బోధించిన చక్కటి ఉపదేశాలను, మన దేవుని సేవకు సంబంధించిన సక్రమ మార్గాలను వదిలి యితర మార్గాలను బోధించువాడు 4 మోసగాడు అన్నమాట. అలాంటి వానికి ఏమీ తెలియదన్నమాట. అలాంటి వానిలో వివాదాస్పదమైన విషయాలను అనవసరంగా తర్కించాలనే అనారోగ్యకరమైన ఆసక్తి ఉంటుంది. అది ద్వేషానికి, పోరాటానికి, దూషణలకు, దుష్టత్వంతో నిండిన అనుమానాలకు దారి తీస్తుంది. 5 అంతేకాక, సత్యాన్ని గ్రహించక దైవభక్తి, ధనార్జనకు ఒక సాధనమని భావించే దుష్టబుద్ధి గలవాళ్ళ మధ్య నిరంతరమైన ఘర్షణలు కలుగుతాయి.
6 కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంభిస్తే అదే ఒక గొప్ప ధనము. 7 ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము. 8 మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము. 9 కాని ధనవంతులు కావాలనుకొనేవారు, ఆశలకులోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి. 10 ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు.
తిమోతికి చెప్పిన ఉపదేశము
11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
17 ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు. 18 సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
20 తిమోతీ, నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు దూరంగా ఉండు. 21 కొందరు ఈ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు.
దైవానుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
© 1997 Bible League International