Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 6-8

శత్రువులు యెరూషలేమును ముట్టడించుట

బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి!
    యెరూషలేము నగరం నుండి పారిపోండి!
తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి.
    బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి!
ఉత్తర దిశ[a] నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి.
మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!
సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి.[b]
కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని
    యెరూషలేముకు వస్తారు.
వారు నగరం చుట్టూ తమ గుడారాలు నిర్మించుకుంటారు.
    ప్రతి గొర్రెల కాపరీ తన మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకుంటాడు.

వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి.
    లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం!
ఇప్పటికే ఆలస్యమైంది.
    సాయంకాలపు నీడలు సాగుతున్నాయి.
కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం.
    యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”

సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
    “యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షాలను పడగొట్టండి.
    ఆ కర్రలతో, మట్టితో నగర గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు కల్పించండి.
ఈ నగరం శిక్షించబడాలి.
    ఈ నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు.
బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది.
    అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది.
ఈ నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను.
    యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.
యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు.
    మీరు వినకపోతే, మీనుండి నేను వెనుదిరిగి పోతాను.
మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా మార్చివేస్తాను.
    అక్కడ ఎవ్వరూ నివసించలేరు!”

సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు:
“ఈ రాజ్యంలో మిగిలిన
    వారినందరినీ ప్రోగు చేయుము[c]
నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే
    ద్రాక్షా కాయల్లా కూడదీయుము.
ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా
    నీవు ప్రతి తీగను వెదకుము.”
10 నేనెవరితో మాట్లాడగలను?
    ఎవరిని హెచ్చరించగలను?
    నా మాట ఎవరు వింటారు?
ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా
    తమ చెవులు మూసుకున్నారు.
యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు.
    కావున నా హెచ్చరికలు వారు వినలేరు.
యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు.
    యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.
11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉంది!
    దానిని నేను లోపల ఇముడ్చుకోలేక పోతున్నాను!
అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను,
    గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు.
భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.
12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి.
    వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు.
నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.”
ఈ వాక్కు యెహోవా నుండివచ్చినది.

13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు.
    క్రింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు!
    ప్రవక్తలు, యాజకులు అంతా కపట జీవనం సాగిస్తారు.
14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు.
    అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు.
‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు.
    కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.
15 ప్రవక్తలు, యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి!
    కాని వారికి సిగ్గనేది లేదు.
వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు.
    అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు.
    నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా క్ర్రిందికి తోయబడతారు.”
ఇది యెహోవా వాక్కు.

16 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:
“నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడిచూడుము.
    పాతబాట ఏదో అడిగి తోలిసికో.
    ఏది మంచి మార్గమో అడిగి తెలుసుకో. అప్పుడు ఆ మార్గంపై పయనించుము.
అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కనుగొంటారు.
కాని మీరేమన్నారో తెలుసా? ‘మేము మంచి మార్గంపై పయనించ’ మన్నారు.
17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను.
    నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని.
    కాని వారన్నారు: ‘మేము వినము.’
18 కావున, సర్వదేశవాసులారా వినండి!
    ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి[d] నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!
19 భూలోకవాసులారా, ఇది వినండి:
    యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను.
    ఎందుకంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే.
వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది.
    నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”

20 యెహోవా ఇలా అన్నాడు:
“మీరు షేబ[e] దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు?
    దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు?
మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు!
    మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”

21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:
“యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను.
    ప్రజల ఎదుట అడ్డుబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి.
తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు.
    స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”

22 యెహోవా ఇలా అన్నాడు:
“ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది.
    భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.
23 సైనికులు విల్లంబులు, ఈటెలు పట్టుకొనివస్తారు.
    వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు.
వారు మిక్కిలి శక్తిమంతులు!
    వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది.
ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది.
    ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”
24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము.
    భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము.
కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము.
    స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.
25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు!
    మీరు బాట వెంబడి వెళ్లవద్దు.
ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి.
    పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.
26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి.
    బూడిదలో పొర్లండి[f]
చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి!
    మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి.
ఇవన్నీ మీరు చేయండి;
    కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!

27 “యిర్మీయా, నేను (యెహోవా)
    నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను.
నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు,
    వారిని గమనిస్తూ ఉండుము.
28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు;
    వారు చాలా మొండివారు.
    వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు.
వారు తుప్పుతో కప్పబడియున్న కంచు,
    ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.
29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు.
కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది.
    కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది![g]
శుద్ద వెండిని చేయాలనుకోవటం వృధా ప్రయాస.
    వృధా కాలయాపన.
అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు.
యెహోవా వారిని ఆమోదించలేదు
    గనుక వారికాపేరు పెట్టబడింది.”

యిర్మీయా దేవాలయ ప్రసంగం

యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది: “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము:

“‘ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవాను ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను[h] కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం;[i] ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు. మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. క్రొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.

“‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు అప్రయోజనకరమైనవి. మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా? 10 మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా? 11 ఈ ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!’” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది!

12 “‘యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్కడైతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్టకార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా ఆ స్థలానికి నేను ఏమి చేసియున్నానో వెళ్లి చూడండి[j] 13 ఇశ్రాయేలీయులారా, మీరీ చెడుకార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు. 14 అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను. 15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.’

16 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు నీవు అడుగవద్దు; వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను ఆలకించను. 17 యూదా పట్టణాలలో ఆ ప్రజలు ఏమి చేస్తున్నారో నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. యెరూషలేము నగర వీధుల్లో వారేమి చేస్తున్నారో నీవు చూడవచ్చు. 18 యూదా ప్రజలు ఏమి చేస్తున్నారనగా: పిల్లలు కట్టెలను పోగుచేయటం; తండ్రులు వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, ఆకాశ రాణికి[k] నివేదించటానికి రొట్టెలు చేయటం, యూదా ప్రజలు ఇతర దేవతారాధనలో పానీయార్పణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే ఇవన్నీ చేస్తున్నారు. 19 కాని వాస్తవానికి యూదా ప్రజలు బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటున్నారు. వారిని వారే అవమానపర్చుకుంటున్నారు” ఇది యెహోవా వాక్కు,

20 కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”

యెహోవా కోరేది బలులు కాదు, విధేయత

21 సర్వ శక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నాడు: “మీరు వెళ్లి మీరు కోరినన్ని దహన బలులు, సాధారణ బలులు అర్పించండి. తద్వారా వచ్చిన మాంసాన్ని మీరే తినండి. 22 మీ పూర్వీకులను నేను ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను వారితో మాట్లాడాను. కాని దహన బలుల గురించి, సాధరణ బలుల గురించి నేను వారికి ఏ రకమైన ఆజ్ఞలూ ఇవ్వలేదు. 23 వారికి ఈ ఆజ్ఞ మాత్రమే ఇచ్చియున్నాను, ‘నాకు విధేయులై వుండండి. అప్పుడు నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలైయుంటారు. నేను చెప్పినదంతా చేయండి. మీకు శుభం కలుగుతుంది.’

24 “కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. నన్ను లెక్కచేయలేదు. మొండిగా, వారు చేయదలచుకున్నదంతా చేశారు. వారు సన్మార్గులు కాలేదు. వారు మరింత దుష్టులయ్యారు. ముందుకు సాగక వెనుకకు తిరిగారు. 25 మీ పూర్వీకులు ఈజిప్టును వదలిన నాటినుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపియున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్లు పంపాను. 26 కాని మీ పూర్వికులు వారి మాట వినలేదు. వారు నన్ను లెక్కచేయలేదు. వారు మిక్కిలి మొండివారు. వారి తండ్రుల కంటె వారు ఎక్కువ చెడుకార్యాలు చేశారు.

27 “యిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని పిలుస్తావు. కాని వారు పలుకరు. 28 అందువల్ల వారికి నీవీ మాటలు చెప్పాలి: తన యెహోవా దేవునికి విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు ఎరుగరు.

వధ లోయ

29 “యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి[l] కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? యెహోవా ఈ తరం ప్రజలను తిరస్కరించినాడు. ఈ ప్రజలకు యెహోవా విముఖుడైనాడు. కోపంతో ఆయన వారిని శిక్షిస్తాడు. 30 ఏడ్వండి, ఎందుకంటే యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసియున్నాను.” ఇది యెహోవా వాక్కు. “వారు విగ్రహాలను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించుకుంటున్నాను! నా పేరుతో పిలువబడే ఆలయంలో వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు అపవిత్రపర్చారు. 31 యూదా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు[m] నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు! 32 కావున నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు అనిగాని, బెన్ హిన్నోములోయ అనిగాని పిలవకుండా వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. పైగా వారు దీనిని కసాయి లోయ[n] అని పిలుస్తారు. “వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా చనిపోయిన వారిని పాతిపెడతారు. 33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొని తింటాయి. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బ్రతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు. 34 యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేములోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.”

ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్యపాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధులనుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూషలేము ప్రజలు ఎముకలను కూడ వారి సమాధుల నుండి తీస్తారు. ఆ మనుష్యులు ఆ ఎముకలను ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు కనపడేలా పడవేస్తారు. యోరూషలేము ప్రజలు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్టపడతారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె బయట పారవేయబడును.

“యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.

పాపము శిక్ష

“యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:

“‘ఒక వ్యక్తి క్రింద పడితే
    తిరిగి లేస్తాడని మీకు తెలుసు.
ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే
    అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.
యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు.
కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు?
వారి అబద్ధాలను వారే నమ్ముతారు.
    వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.
వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను.
    కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు.
ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు.
    ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు.
ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు.
    వారు యుధ్ధానికి పరుగెత్తే గుర్రాల్లా ఉన్నారు.
ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం
    తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు.
కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ)
    వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు.
కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.

“‘యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము! అని మీరు చెప్పుకుంటూ వుంటారు.
    కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు[o] (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.
ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు.
    కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు.
ఆ “జ్ఞానవంతులు” అనబడే వారు మోసంలో పడ్డారు.
    వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.
10 కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను.
    వారి పొలాలను క్రొత్త యజమానులకిచ్చివేస్తాను.
ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధనసంపాదనపై ఆసక్తిగలవారు.
    ప్రాముఖ్యంలేని అతి సామాన్యుల నుండి ముఖ్యుల వరకు ప్రజలంతా అలాంటివారే.
    ప్రవక్తల నుండి యాజకుల వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే.
11 నా ప్రజలు బాగా గాయపడ్డారు.
    కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు.
“అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!” అని వారంటారు.
    కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!
12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి.
    కాని వారు సిగ్గుపడనే లేదు.
వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు.
    అందరితో పాటు వారూ శిక్షించబడతారు.
    నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’”
ఇది యెహోవా వాక్కు.

13 “‘వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను
    అందుచేత అక్కడ పంటకోత ఉండదు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు.
    వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి.
నేను వారికిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.’”[p]

14 “మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము?
    రండి, బలమైన నగరాలకు పారిపోదాం.
మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం.
మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం.
    అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.
15 మనం శాంతిని కోరుకున్నాం;
    కాని శాంతి కలుగలేదు.
స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం,
    కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.
16 దాను వంశీయుల రాజ్యంనుండి
    శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి.
    వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది.
వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ
    నాశనం చేయాలని వచ్చియున్నారు.
వారీ నగరాన్ని, నగరవాసులను
    సర్వనాశనం చేయటానికి వచ్చారు.

17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను[q] పంపుతున్నాను.
    ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు.
    ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!

18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.
19 నా ప్రజల మొరాలకించుము!
    దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు.
“సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా?
    సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు.

కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు?
    వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
20 మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు:
    “పంటకోత కాలం అయిపోయింది.
    వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”

21 నా జనులు బాధపడియుండుటచేత[r] బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
22 వాస్తవానికి గిలియాదులో తగిన ఔషధం ఉంది!
    వాస్తవానికి గిలియాదులో వైద్యుడు కూడా ఉన్నాడు!
అయితే నా ప్రజల గాయాలు ఎందుకు నయం చేయబడలేదు?

1 తిమోతికి 5

వృద్ధులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్ళను తండ్రులుగా భావించి సలహాలు చెప్పు. చిన్నవాళ్ళను నీ తమ్ముళ్ళుగా భావించు. వయస్సు మళ్ళిన స్త్రీని నీ తల్లిగా, చిన్న వయస్సుగల స్త్రీని పవిత్ర హృదయంతో నీ సోదరిగా భావించు.

వితంతువులను జాగ్రత్తగా చూడు

అవసరంలో ఉన్న వితంతువులకు సహాయం చేయి. వితంతువులకు పిల్లలు గాని, పిల్లల పిల్లలు గాని ఉన్నట్లైతే, వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ విధంగా తమ సంఘానికి సంబంధించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. అలా చేస్తే తమ తల్లిదండ్రుల రుణం, తాత ముత్తాతల రుణం తీర్చుకొన్నట్లవుతుంది. అది దేవునికి సంతృప్తి కలుగ చేస్తుంది. ఒంటరిగా దీనావస్థలో ఉన్న వితంతువు తన ఆశల్ని దేవునిలో పెట్టుకొని, సహాయం కోసం రాత్రింబగళ్ళు ప్రార్థిస్తుంది. కాని భోగాలకొరకు జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినట్లే. ఈ ఉపదేశాలను ప్రజలకు బోధించు. అప్పుడు వాళ్ళలో ఎవ్వరూ నీలో తప్పు పట్టలేరు. తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం.

ఒకే పురుషుణ్ణి పెండ్లాడి అరవై ఏండ్లు దాటి ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో చేర్చరాదు. 10 అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కారాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి.

11 చిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. 12 తద్వారా తమ మొదటి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటంవల్ల వాళ్ళకు శిక్ష లభిస్తుంది. 13 పైగా వాళ్ళు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలయాపన చెయ్యటమే కాకుండా, యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్తారు. వాళ్ళకు మౌనంగా ఉండటం చేతకాదు. 14 అందువల్ల చిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్ళను నిందించడానికి యితర్లకు ఆస్కారము ఉండదు. 15 నిజానికి కొందరు సాతాన్ను అనుసరించటానికి యిదివరకే తిరిగి వెళ్ళారు.

16 క్రీస్తును విశ్వసించే స్త్రీ,[a] తన కుటుంబంలో వితంతువులున్నట్లైతే, వాళ్ళకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయకల్గుతుంది.

పెద్దలూ, తదితర సంగతుల్నిగూర్చి

17 క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి కష్టపడి పని చేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు. 18 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “ధాన్యము తొక్కే ఎద్దు మూతి కట్టరాదు” మరియు “పని చేసే వానికి కూలి దొరకాలి” అని వ్రాయబడి ఉంది.

19 ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటే తప్ప సంఘం పెద్దల మీద మోపిన నేరాన్ని పరిశీలించవద్దు. 20 తప్పు చేసినవాళ్ళను బహిరంగంగా ఖండించు. అలా చేస్తే అది చూసి మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు.

21 నేను దేవుని సమక్షంలో, యేసు క్రీస్తు సమక్షంలో, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల సమక్షంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని అమలులో పెట్టు. ఏది పక్షపాతంతో చెయ్యవద్దు.

22 నీవు తొందరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయవద్దు. ఇతర్ల పాపాల్లో భాగస్తుడవు కావద్దు. నిన్ను నీవు పవిత్రంగా చూచుకో.

23 నీళ్ళు మాత్రమే త్రాగవద్దు. నీ కడుపు బాగు కావటానికి కొద్దిగా ద్రాక్షారసము త్రాగు. అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు.

24 కొందరు చేసిన పాపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వాళ్ళకన్నా ముందు తీర్పుకై పరుగెత్తుచున్నాయి. మరి కొందరి పాపాలు ఆలస్యంగా కనిపిస్తాయి. 25 అదే విధంగా మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. రహస్యంగానుండే మంచి పనులు కూడా బయలు పరచబడును.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International