Old/New Testament
క్రొత్త యెరూషలేము మంచితనంతో నిండిన నగరం
62 సీయోను అంటే నాకు ప్రేమ.
అందుచేత నేను ఆమె పక్షంగా ఇంకా మాట్లాడతాను.
యెరూషలేము అంటే నాకు ప్రేమ.
అందుచేత నేను మాట్లాడటం చాలించను.
మంచితనం పెద్ద వెలుగుగా ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
ఒక జ్వాలలా రక్షణ నుండి ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
2 అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని చూస్తాయి.
రాజులందరూ నీ గౌరవాన్ని చూస్తారు.
అప్పుడు నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుంది.
ప్రజలారా, యెహోవా తానే మీకు ఆ క్రొత్త పేరు ఇస్తాడు.
3 యెహోవా మీ విషయం ఎంతో అతిశయిస్తాడు.
యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు మీరు.
4 “దేవుడు విడిచిపెట్టిన ప్రజలు” అని ఇంకెన్నడూ మీరు పిలువబడరు.
“దేవుడు నాశనం చేసిన దేశం” అని మీ దేశం ఇంకెన్నటికి పిలువబడదు.
“దేవుడు ప్రేమించే ప్రజలు” అని మీరు పిలువబతుతారు.
“దేవుని వధువు” అని మీ దేశం పిలువబడుతుంది.
ఎందుకంటె యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక.
మరియు మీ దేశం ఆయనకు చెందుతుంది.
5 ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు ఆమె అతనికి భార్య అవుతుంది.
అదేవిధంగా మీ దేశం మీ పిల్లలకు చెందుతుంది.
ఒకడు తన నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు.
అదే విధంగా, మీ దేవుడు మీతో ఎంతో సంతోషిస్తాడు.
6 కావలి ఉండుటకు యెరూషలేము గోడల మీద కావలివారిని (ప్రవక్తలను) నేను ఉంచుతాను.
ఈ కావలివారు మౌనంగా ఉండరు.
రాత్రింబవళ్లు వారు కనిపెట్టి ఉంటారు.
యెహోవాను గూర్చి ఉపదేశించే మీరు ఎన్నటికీ మౌనంగా ఉండకూడదు.
యెహోవాను ప్రార్థించటం మీరు చాలించకూడదు.
7 మీరు ఎల్లప్పుడూ యెహోవాను ప్రార్థించాలి. ఆయన యెరూషలేమును మరల ఒక పట్టణంగా చేసేంతవరకు యెహోవాకు ప్రార్థించండి.
భూమిమీద ప్రజలంతా పొగడే పట్టణంగా ఆయన యెరూషలేమును చేసేంత వరకు యెహోవాకు ప్రార్థించండి.
8 యెహోవా ఒక వాగ్దానం చేశాడు. యెహోవా తన స్వంత శక్తిని రుజువుగా వినియోగించి ఆ వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు యెహోవా తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా చెప్పాడు, “మీ ఆహారాన్ని మరెన్నడూ మీ శత్రువులకు ఇవ్వనని నేను వాగ్దానం చెస్తున్నాను.
మీరు తయారు చేసే మీ ద్రాక్షరసాన్ని మీ శత్రువులు ఎన్నటికీ తీసుకోరని నేను వాగ్దానం చేస్తున్నాను.
9 ఆహారం కూర్చుకొనేవాడు దానిని తింటాడు. మరియు ఆ వ్యక్తి యెహోవాను స్తుతిస్తాడు.
ద్రాక్షపండ్లను కూర్చుకొనేవాడు ఆ ద్రాక్షపండ్ల రసం త్రాగుతాడు. ఈ సంగతులన్నీ నా పవిత్రదేశంలో జరుగుతాయి.”
10 గుమ్మాలద్వారా రండి,
ప్రజలకు దారి సరళం చేయండి.
మార్గం సిద్ధం చేయండి!
మార్గంలోని రాళ్లన్నీ తీసివేయండి.
ప్రజలకు గుర్తుగా పతాకం ఎగురవేయండి!
11 వినండి, దూర దేశాల ప్రజలందరితో యెహోవా మాట్లాడుతున్నాడు:
“సీయోను ప్రజలకు చెప్పండి.
చూడండి, మీ రక్షకుడు వస్తున్నాడు.
ఆయన మీ బహుమానం మీ కోసం తెస్తున్నాడు.
ఆయన ఆ బహుమానాన్ని తనతో కూడ తెస్తున్నాడు.”
12 ఆయన ప్రజలు, “పరిశుద్ధ ప్రజలు”
“విమోచించబడిన యెహోవా ప్రజలు” అని పిలువబడతారు.
“దేవుడు కోరే పట్టణం” “దేవుడు తోడుగా ఉన్న పట్టణం”
అని యెరూషలేము పిలువబడుతుంది.
యెహోవా తన జనాంగాన్ని శిక్షిస్తాడు
63 ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు?
ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు.
అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు.
అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు.
“మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను”
అని అతడు చెబుతున్నాడు.
2 “నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా ఉన్నాయి?
ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షరసం చేసే వానిలా ఎర్రగా ఉన్నాయెందుకు నీ వస్త్రాలు?”
3 అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను.
నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు.
నాకు కోపం వచ్చింది, ద్రాక్షపండ్ల మీద నడిచాను.
ద్రాక్ష పండ్ల రసం నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా బట్టలు మైలపడ్డాయి.
4 ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను.
నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది.
5 చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు.
నన్ను ఒక్కరూ బలపర్చకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
కనుక నా ప్రజలను రక్షించుటకు నా స్వంత శక్తి నేను ప్రయోగించాను.
నా కోపమే నాకు బలం ఇచ్చింది.
6 నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను.
నాకు వెర్రికోపం వచ్చినప్పుడు నేను వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద ఒలకబోశాను.”
యెహోవా తన ప్రజల ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు
7 యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను.
ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు.
యెహోవా మా యెడల చాలా దయచూపించాడు.
యెహోవా మా యెడల కరుణ చూపించాడు.
8 “వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు”
అని యెహోవా చెప్పాడు.
కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు.
9 ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి.
కానీ యెహోవా వారికి విరోధంగా లేడు.
యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు.
కనుక యెహోవా ప్రజలను రక్షించాడు.
వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు.
మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు.
10 అయితే ప్రజలు యెహోవాకు విరోధం అయ్యారు.
ఆయన పరిశుద్ధాత్మను ప్రజలు చాలా దుఃఖపర్చారు.
అందుచేత యెహోవా వారికి శత్రువు అయ్యాడు.
యెహోవా ఆ ప్రజలకు విరోధంగా పోరాడాడు.
11 కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగినదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
మోషే, అతని ప్రజలూ యెహోవాకు జ్ఞాపకం.
సముద్రంలోనుండి ప్రజలను బయటకు తీసుకొనివచ్చిన వాడు యెహోవాయే.
యెహోవా తన మందను (ప్రజలను) నడిపించటానికి తన కాపరులను (ప్రవక్తలను) వాడుకొన్నాడు.
అయితే మోషేలో తన ఆత్మను ఉంచిన ఆ యెహోవా ఇప్పుడు ఎక్కడ?
12 యెహోవా తన కుడిచేత మోషేను నడిపించాడు. మోషేను నడిపించుటకుగాను యెహోవా తన అద్భుత శక్తిని ఉపయోగించాడు.
ప్రజలు సముద్రంలోనుండి నడువగలిగేట్టు
యెహోవా నీళ్లను పాయలు చేశాడు.
ఈ గొప్ప కార్యాలు చేయటం వల్ల
యెహోవా తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకొన్నాడు.
13 లోతైన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను యెహోవా నడిపించాడు.
ప్రజలు పడిపోకుండా నడిచారు.
అరణ్యంలో గుర్రం నడచినట్టు వారు నడిచారు.
14 ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు.
అదేవిధంగా ప్రజలు సముద్రంలోనుండి వెళ్తూ పడిపోలేదు.
ఒక విశ్రాంతి స్థలానికి ప్రజలను యెహోవా ఆత్మ నడిపించాడు.
అంతవరకు ప్రజలు క్షేమంగా ఉన్నారు. యెహోవా, నీవు నీ ప్రజలను నడిపించిన విధం అది.
ప్రజలను నీవు నడిపించావు, నీ నామాన్ని నీవు ఆశ్చర్యకరమైనదిగా చేసుకొన్నావు.
తన ప్రజలకు సహాయం చేయమని దేవునికొక ప్రార్థన
15 యెహోవా, పరలోకము నుండి చూడుము.
ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము.
పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి క్రిందనున్న మమ్మల్ని చూడుము.
మా మీద నీ బలమైన ప్రేమ ఏది?
నీ అంతరంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి?
నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు?
16 చూడు, నీవు మా తండ్రివి!
మేము అబ్రాహాము పిల్లలమని అతనికి తెలియదు.
ఇశ్రాయేలు (యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు.
యెహోవా, నీవు మా తండ్రివి.
మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవే.
17 యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండి ఎందుకు త్రోసివేస్తున్నావు?
మేము నిన్ను అనుసరించటం మాకు కష్టతరంగా నీవెందుకు చేస్తున్నావు?
యెహోవా, మా దగ్గరకు తిరిగి రమ్ము.
మేము నీ సేవకులం.
మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయి.
మా కుటుంబాలు నీకు చెందినవి.
18 నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి.
మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం మీద నడుస్తున్నారు.
19 కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు.
ఆ ప్రజలు నీ నామం ధరించరు.
మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.
64 నీవు ఆకాశాలను చీల్చుకొని
భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది.
పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.
2 మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి.
నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి.
అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు.
అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి.
3 (కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు.
పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.)
4 నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు.
నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు.
నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.
ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.
5 మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు.
నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు.
కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము
అందుచేత నీవు మా మీద కోపగించావు.
6 మేమందరం పాపంతో మైలపడ్డాం.
మా “నీతి” అంతా పాత మైల గుడ్డల్లాంటిదే.
మేమందరం ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము.
మా పాపాలు మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి.
7 మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు.
నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు.
అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు.
మేము పాపంతో నిండిపోయాం
గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం.
8 కానీ, యెహోవా, నీవు మా తండ్రివి.
మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి.
నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి.
9 యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు.
మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు.
దయచేసి మమ్మల్ని చూడు,
మేము నీ ప్రజలము.
10 నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి.
సీయోను ఒక అరణ్యం.
యెరూషలేము నాశనం చేయబడింది.
11 మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది.
ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది.
మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు.
మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి.
12 నీవు నీ ప్రేమను ఎన్నటికీ మాకు చూపకుండా ఉంచుతాయా ఈ వస్తువులు?
నీవు ఏమీ పలుకకుండనే కొనసాగుతావా?
శాశ్వతంగా నీవు మమ్మల్ని శిక్షిస్తావా?
1 విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసు క్రీస్తు ఆజ్ఞానుసారమూ, యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.
2 తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను.
దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త
3 నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్ళతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. 4 అంతేకాక, వాళ్ళు కల్పితగాథలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని వంశావళులతో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్నపని. 5 ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండీ, స్వచ్ఛమైన అంతరాత్మ నుండీ, నిజమైన విశ్వాసం నుండీ ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే. 6 కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. 7 తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకొంటారు. కాని వాళ్ళకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్ళకు తెలియదు.
8 ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. 9 మంచివాళ్ళ కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళకోసం, తిరుగుబాటు చేసేవాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మనివాళ్ళకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైనవాళ్ళకోసం, తల్లిదండ్రులను గౌరవపరచనివాళ్ళకోసం, హంతకుల కోసం, 10 వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించేవాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ళకోసం, అసత్యాలాడేవాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళ కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకొనేవాళ్ళకోసం, అది వ్రాయబడింది. 11 నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు.
దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి
12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.
15 పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయేవాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.
18 తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు. 20 హుమెనై, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను సాతానుకు అప్పగించాను.
© 1997 Bible League International