Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 56-58

అన్ని జనాంగాలు యెహోవాను వెంబడిస్తాయి

56 యెహోవా ఈ సంగతులు చెప్పాడు, “మనుష్యులందరికి న్యాయం చూపండి. సరైన వాటినే చేయండి. ఎందుకంటే త్వరలోనే నా రక్షణ మీకు లభిస్తుంది. నా మంచితనం[a] త్వరలోనే సర్వలోకానికి చూపించబడుతుంది గనుక.” సబ్బాతును[b] గూర్చిన దేవుని చట్టానికి విధేయత చూపే వ్యక్తి ఆశీర్వదించబడును. ఏ కీడు చేయని వ్యక్తి సంతోషంగా ఉంటాడు.

యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవా వైపు తిరుగుతారు. “యెహోవా తన ప్రజలతో పాటు నన్ను స్వీకరించడు” అని ఆ మనుష్యులు చెప్పకూడదు. “నేను ఎండిన కట్టె ముక్కను, నాకు పిల్లలు పుట్టరు” అని నపుంసకుడు చెప్పకూడదు.

4-5 “సబ్బాతుకు సంబంధించిన చట్టాలకు విధేయులయ్యే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. నేను కోరే వాటిని జరిగించే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. వారు నా ఆలయంలో, నా పట్టణంలో ఉంటారు. నా ఒడంబడికను[c] పాటించే నా ప్రజలందరికీ నేను ఈ విషయాలు జరిగిస్తాను. కుమారులు, కుమార్తెలకంటె శ్రేష్ఠమైన దానిని నేను వారికి ఇస్తాను. శాశ్వతంగా కొనసాగే పేరు నేను వారికి ఇస్తాను” అని యెహోవా చెబుతున్నాడు గనుక వారు ఆ మాటలు చెప్పకూడదు.

యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవావైపు చేరుతారు. యెహోవాను సేవించి, ఆయనను ప్రేమించగలిగేట్టు వారు ఇలా చేస్తారు. వారు యెహోవాకు సేవకులు అయ్యేందుకు యెహోవావైపు చేరుతారు. సబ్బాతును ప్రత్యేక ఆరాధన రోజుగా వారు పాటిస్తారు, నా ఒడంబడిక (ధర్మశాస్త్రాన్ని) సన్నిహితంగా పాటించటం కొనసాగిస్తారు. “ఆ మనుష్యులను నా పరిశుద్ధ పర్వతానికి నేను తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని సంతోషింప చేస్తాను. వారు నాకు అర్పించే అర్పణలు, బలులు నాకు సంతోషం కలిగిస్తాయి. ఎందుకంటే, నా ఆలయం సకల రాజ్యాలకూ ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది” అని యెహోవా చెబుతున్నాడు. నా ప్రభువు యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ఇశ్రాయేలు ప్రజలు వారి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు. కానీ యెహోవా వారిని మరల ఒక్కచోట చేరుస్తాడు. “ఈ ప్రజలను నేను మరల ఒక్కచోట చేరుస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.

అరణ్యంలోని అడవి మృగములారా తినుటకురండి!
10 కావలి వాళ్లు (ప్రవక్తలు) అందరు గుడ్డివాళ్లు.
    వారు చేస్తుంది ఏమిటో వారికే తెలియదు.
వారు మొరగటం చేతకాని కుక్కల్లాంటి వాళ్లు.
    వారు నేలమీద పండుకొని, నిద్రపోతారు.
    ఆహా, నిద్రపోవటం వారికి ఇష్టం.
11 వారు ఆకలిగొన్న కుక్కల్లా ఉన్నారు.
    వారు ఎన్నటికి తృప్తిపొందరు.
ఆ కాపరులు ఏమిచేస్తున్నది. వారికే తెలియదు.
    తప్పిపోయి తిరుగుతున్న వారి గొర్రెల్లానే ఉన్నారు వారూను.
వారు దురాశపరులు.
    వారు చేయాలని ఆశించేది అంతా వారిని వారు తృప్తిపరచుకోవటమే.
12     “నేను కొంచెం ద్రాక్షమద్యం త్రాగుతాను.
    నేను కొంచెం మద్యం త్రాగుతాను.
    నేను రేపు కూడా ఇలానే చేస్తాను.
    ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువ కూడా త్రాగుతాను”
అని వారు వచ్చి చెబుతారు.

ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వెంబడించరు

57 మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ వ్యక్తి అది గమనించలేదు.
    ఏం జరుగుతుందో ప్రజలు గ్రహించరు.
కానీ వారు మంచి మనుష్యులందరిని సమావేశపరచారు.
    కష్టాలు వస్తున్నాయని ప్రజలు గ్రహించరు.

మంచి వాళ్లంతా భద్రతకోసం
    సమావేశం చేయబడ్డారని వారికి తెలియదు.
అయితే శాంతి కలుగుతుంది. మరియు ప్రజలు వారి స్వంత పడకలమీద విశ్రాంతి తీసుకొంటారు.
    వారు ఎలా జీవించాలని దేవుడు కోరుతాడో వారు అలా జీవిస్తారు.

“దయ్యాల పిల్లల్లారా, ఇక్కడకు రండి.
    మీ తండ్రి (సాతాను) లైంగిక పాపాల మూలంగా దోషి.
    మరియు మీ తల్లి (ఇశ్రాయేలు) లైంగిక పరంగా తన శరీరాన్ని అమ్ముకొంటుంది. ఇక్కడకు రండి!
మీరు అబద్ధాలు చెప్పేవాళ్లు, చెడ్డవాళ్లు.
    మీరు నన్ను ఎగతాళి చేస్తారు.
మీరు నన్ను వెక్కిరిస్తారు.
    మీరు నా మీద నాలుకలు చాపుతారు.
మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని చెట్టు క్రింది
    తప్పుడు దేవుళ్లనూ పూజించటమే.
మీరు ప్రతికాలువ ప్రక్క పిల్లల్నీ చంపుతారు,
    బండల స్థలాల్లో వారిని బలి ఇస్తారు.
నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు ఇష్టం.
    వాటిని పూజించుటకు మీరు వాటిమీద ద్రాక్షమద్యం పోస్తారు.
మీరు వాటికి బలులు ఇస్తారు. కానీ మీకు దొరికేది అంతా ఆ రాళ్లే.
    ఇది నాకు సంతోషం కలిగిస్తుందని మీరు తలుస్తున్నారా?
    లేదు! అది నాకు సంతోషం కలిగించదు.
మీరు ప్రతి కొండ మీద,
    ప్రతి పర్వతంమీద మీ పడక వేసుకొంటారు.
మీరు ఆ స్థలాలకు వెళ్లి
    బలులు అర్పిస్తారు.
తర్వాత మీరు ఆ పడకల మీదికి వెళ్లి,
    ఆ దేవుళ్లను ప్రేమించటం ద్వారా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు.
మీరు ఆ దేవతలను ప్రేమిస్తారు.
    వాటి దిగంబర దేహాలను చూడటం మీకు ఇష్టం.
మీరు నాతో ఉన్నారు
    కాని వాటితో ఉండేందుకు మీరు నన్ను విడిచి పెట్టారు.
నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు
    సహాయపడే వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
గుమ్మాల వెనుక, ద్వారబంధాల వెనుక వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
    మరియు మీరు వెళ్లి ఆ తప్పుడు దేవుళ్ళతో ఒడంబడికలు చేసుకుంటారు.
మొలెక్[d] దేవతకు అందంగా కనబడాలని
    మీరు తైలాలు, పరిమళాలు ఉపయోగిస్తారు.
మీరు మీ సందేశకులను దూరదేశాలకు పంపించారు.
    ఇది మిమ్మల్ని పాతాళానికి, మరణ స్థానానికి తీసుకొని వస్తుంది.
10 ఈ పనులు చేయటానికి మీరు కష్టపడి పని చేశారు
    కానీ మీరు ఎన్నడూ అలసిపోలేదు.
మీరు క్రొత్త బలం కనుగొన్నారు.
    ఎందుకంటే, వీటిలో మీరు ఆనందించారు.
11 మీరు నన్ను జ్ఞాపకం చేసికోలేదు
    మీరు నన్ను కనీసం గుర్తించలేదు.
కనుక మీరు ఎవరిని గూర్చి చింతిస్తున్నారు?
    మీరు ఎవరిని గూర్చి భయపడుతున్నారు?
    మీరెందుకు అబద్ధం పలికారు?
చూడండి, చాలాకాలంగా నేను మౌనంగా ఉన్నాను.
    మరి మీరు నన్ను గౌరవించలేదు.
12 మీ ‘మంచితనం’ గూర్చి, మీరు చేసే ‘మతపరమైన’ పనులు అన్నింటిని గూర్చి నేను చెప్పగలను.
    కానీ అవన్నీ పనికిమాలినవి.
13 మీకు సహాయం అవసరమైనప్పుడు
    మీరు మీ చుట్టూరా ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవుళ్ళకు మొరపెట్టండి.
అయితే, వాటినన్నింటినీ గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతున్నాను.
    ఒక్క గాలి విసురు వాటినన్నింటినీ మీ వద్దనుండి తొలగించివేస్తుంది.
అయితే నా మీద ఆధారపడే వ్యక్తి
    భూమిని సంపాదించుకొంటాడు.
    ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది.”

యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు

14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి.
    నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.

15 మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు
    శాశ్వతంగా జీవించేవాడు,
పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు:
“నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను.
    అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను.
ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను.
    హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను.
    నేను ఎప్పటికీ కోపంగానే ఉండను.
నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ,
    వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.
17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది.
    కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను.
నేను కోపంగా ఉన్నాను గనుక
    అతని నుండి నేను తిరిగిపోయాను.
మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు.
    ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.
18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను).
    నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు.
19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే క్రొత్త పదం నేను ఉపదేశిస్తాను.
    నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి ప్రసాదిస్తాను.
ఆ ప్రజలను నేను స్యస్థపరుస్తాను (క్షమిస్తాను).”
ఈ సంగతులు యెహోవా చెప్పాడు.

20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు.
    వారు నెమ్మదిగా, శాంతంగా ఉండలేరు.
వారు కోపంగా ఉన్నారు,
    మహాసముద్రంలా మట్టిని కెలుకుతారు.
21 “దుష్టులకు శాంతి లేదు”
    అని నా దేవుడు చెబుతున్నాడు.

ప్రజలు దేవుణ్ణి వెంబడించాలని చెప్పాలి

58 మీకు చేతనైనంత గట్టిగా కేకలు వేయండి. మీరు ఆపవద్దు.
    బూరలా కేకలు వేయండి.
ప్రజలు చేసిన చెడు పనులను గూర్చి వారికి చెప్పండి.
    యాకోబు వంశానికి వారి పాపాలను గూర్చి చెప్పండి.
అప్పుడు వారు నన్ను ఆరాధించేందుకు రోజూ వస్తారు.
    మరియు ప్రజలు నా మార్గాలు తెలుసుకోవాలని కోరుతారు.
అప్పుడు వారు సరైన పనులు చేసే ఒక రాజ్యం అవుతారు.
    ఆ ప్రజలు దేవుని మంచి ఆదేశాలను పాటించడం మానివేయరు.
వారికి న్యాయంగా తీర్పు తీర్చమని ఆ ప్రజలు నన్ను అడుగుతారు.
    దేవుని న్యాయ నిర్ణయాలకోసం వారు దేవుని దగ్గరకు వెళ్లాలని కోరుకొంటారు.

ఇప్పుడు ఆ ప్రజలు చెబుతారు: “నీ గౌరవ సూచకంగా మేము భోజనం మానివేశాం. నీవెందుకు మమ్మల్ని చూడవు? నీ గౌరవ సూచకంగా మేము మా దేహాలను బాధించుకొంటాం. నీవెందుకు మమ్మల్ని గమనించవు?”

అయితే యెహోవా అంటున్నాడు, “ఆ ప్రత్యేక దినాల్లో భోజనం చేయకుండా ఉండి మిమ్మల్ని మీరే సంతోషపెట్టుకొనేందుకు ఈ పనులు చేస్తారు. మరియు మీరు మీ శరీరాలను గాక, మీ సేవకుల్ని శిక్షిస్తారు. మీరు ఆకలిగా ఉన్నారు కాని అన్నంకోసర కాదు. ఆహారంకోసం గాక వాదనకోసం, పోరాటం కొసం మీరు ఆకలిగా ఉన్నారు. మీ చెడ్డ చేతులతో ప్రజలను కొట్టాలని మీరు ఆకలిగా ఉన్నారు. మీరు భోజనం మానివేయటం నాకోసం కాదు. నన్ను స్తుతించుటకు మీరు మీ స్వరం వినియోగించటం మీకు ఇష్టం లేదు. నేను కోరేది అంతా ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్రమేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కనబడాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మానివేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా?

“నేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతంత్రులను చేసే రోజు ఎలాంటిదో నేను మీకు చెబుతాను. ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రులుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. ఆకలిగొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్లలోనికి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. బట్టలు లేనివాడ్ని మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; వాళ్లూ మీలాంటి వారే.”

వీటిని మీరు చేస్తే, మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. అప్పుడు మీ గాయాలు బాగవుతాయి. మీ “మంచితనం” (దేవుడు) మీకు ముందు నడువగా, యెహోవా మహిమ మీ వెనుకగా మిమ్మల్ని వెంబడిస్తుంది. అప్పుడు మీరు యెహోవాకు మొరపెడ్తారు, యెహోవా మీకు జవాబు ఇస్తాడు. మీరు యెహోవాకు గట్టిగా కేకెలు వేస్తారు. ఆయన “ఇదిగో నేనిక్కడే ఉన్నాను” అంటాడు.

మీరు ప్రజలకు కష్టాలు, భారాలు కలిగించటం మానివేయాలి. విషయాలను బట్టి మీరు ప్రజలమీద కోపంగా మాట్లాడటం. వారిని నిందించటం మీరు మానివేయాలి. 10 ఆకలితో ఉన్న ప్రజలను గూర్చి మీరు విచారపడి, వారికి భోజనం పెట్టాలి. కలవరపడిన వారికి మీరు సహాయం చేయాలి వారి అవసరాలు తీర్చాలి. అప్పుడు మీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మరియు మీకు దుఃఖం ఉండదు. మధ్యాహ్నపు సూర్యకాంతిలా మీరు ప్రకాశిస్తారు.

11 అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడిపిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం ఇస్తాడు. విస్తారమైన నీళ్లుగల తోటలా మీరు ఉంటారు. ఎల్లప్పుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా మీరుంటారు.

12 ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. కానీ క్రొత్త పట్టణాలు నిర్మించబడతాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “త్రోవలు, ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు.

13 సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి. 14 అప్పుడు నీవు యెహోవా, నాయందు దయచూపమని అడగవచ్చు. మరియు యెహోవా అంటాడు, భూమికి పైగా ఉన్నతమైన చోట్లకు నేను నిన్ను మోసికొనివెళ్తాను. నేను నీకు భోజనం పెడ్తాను. నీ తండ్రి యాకోబుకు కలిగిన వాటిని నేను నీకు ఇస్తాను. ఈ విషయాలు యెహోవా చెప్పాడు గనుక అవి జరుగుతాయి.

2 థెస్సలొనీకయులకు 2

పాప పురుషుడు

సోదరులారా! మన యేసు ప్రభువు రాకను గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎవరైనా వచ్చి తమకు మేము ఏదైనా ఉత్తరం వ్రాసినట్లు లేదా ప్రభువు రానున్న దినం వచ్చినట్లు తెలిసిందని చెప్పినా, లేక ఆత్మ ద్వారా ఆ విషయం తెలిసిందని చెప్పినా, లేక ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని ఎవరైనా వారించినా భయపడకండి. దిగులు చెందకండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు. అంతేగాక దేవునికి సంబంధించిన ప్రతిదానిపై ఆ భ్రష్టుడు తనను తాను హెచ్చించుకొంటూ మందిరంలో ప్రతిష్ఠించుకుని తానే దేవుణ్ణని ప్రకటిస్తాడు.

నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంది కదా? ఆ భ్రష్టుని రాకను ఏది అడ్డగిస్తుందో మీకు తెలుసు. సరియైన సమయానికి రావాలని వాని రాక ఆపబడింది. వాని అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించేవాడు ఒకాయన ఉన్నాడు. వాణ్ణి అడ్డగిస్తున్నవాడు తీసివేయబడేదాకా ఆయన వాణ్ణి అడ్డగిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు వాణ్ణి తన ఊపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవంతంగా ప్రత్యక్షమై ఆ భ్రష్టుణ్ణి నాశనం చేస్తాడు.

ఆ భ్రష్టుడు సాతాను శక్తితో వచ్చి రకరకాల మహత్కార్యాలు చేస్తాడు. దొంగ చిహ్నాలు, అద్భుతాలు చేసి మోసం చేస్తాడు. 10 నాశనం కానున్నవాళ్ళను అన్ని విధాలా మోసం చేస్తాడు. వాళ్ళు సత్యాన్ని ప్రేమించటానికి, దేవుని రక్షణను స్వీకరించటానికి నిరాకరించారు కనుక నశించిపోతారు. 11 ఈ కారణంగా దేవుడు వాళ్ళకు మోసం చేసే శక్తిని పంపుతాడు. వాళ్ళు దాన్ని నమ్ముతారు. 12 సత్యాన్ని నమ్మక అధర్మంగా జీవించాలని నిశ్చయించుకొన్నవాళ్ళందరినీ శిక్షిస్తాడు.

బలంగా నిలబడండి

13 సోదరులారా! ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కోసం మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉండాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుటవల్ల, సత్యంలో మీకున్న విశ్వాసం వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించటానికి కాలానికి ముందే ఎన్నుకొన్నాడు. 14 మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో మీరు భాగం పంచుకోవాలని, మీరు రక్షణ పొందాలనీ దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు. 15 సోదరులారా! మేము లేఖ ద్వారా మరియు మా బోధ ద్వారా బోధించిన సత్యాలను విడువకుండా నిష్ఠతో అనుసరించండి.

16 యేసు క్రీస్తు ప్రభువు, మనల్ని ప్రేమించిన మన తండ్రియైన దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు అనంతమైన ధైర్యాన్ని, మంచి ఆశాభావాన్ని ఇచ్చారు. 17 దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International