Old/New Testament
యెహోవా శాశ్వతమైన సృష్టికర్త
41 యెహోవా చెబుతున్నాడు:
“దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి.
దేశాల్లారా, ధైర్యంగా ఉండండి.
నా దగ్గరకు వచ్చి మాట్లాడండి.
మనం కలిసికొందాం.
ఎవరిది సరియైనదో నిర్ణయించేద్దాం.
2 ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు?
మంచితనం నాతో కూడ నడుస్తుంది.
అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు.
వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు.
వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.
3 అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు.
అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు.
4 ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు?
ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు?
యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను.
యెహోవాను నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను.
అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
5 దూర దూర స్థలాలూ, మీరంతా
చూచి భయపడండి.
భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ,
మీరంతా భయంతో వణకండి.
మీరంతా దగ్గరగా రండి,
నా మాటలు వినండి.
6 “పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. 7 ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.”
యెహోవా మాత్రమే మనలను రక్షించగలడు
8 యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి
యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను.
నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను.
9 భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు.
నీవు చాలా దూర దేశంలో ఉన్నావు.
అయితే నేను నిన్ను పిలిచి,
నీవు నా సేవకుడివి.
నేను నిన్ను ఏర్పరచుకొన్నాను.
నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను.
10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను.
భయపడకు, నేను నీ దేవుణ్ణి.
నేను నిన్ను బలంగా చేశాను.
నేను నీకు సహాయం చేస్తాను.
నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.
11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు.
కానీ వాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు.
12 నీ విరోధుల కోసం నీవు వెదకుతావు.
కానీ నీవు వారిని కనుగొనలేవు.
నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు
పూర్తిగా కనబడకుండా పోతారు.
13 నేను యెహోవాను,
నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను.
నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను.
అని నేను నీతో చెబుతున్నాను.
14 ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు.
నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.”
సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు.
“ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు),
నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు:
15 చూడు, నిన్ను నేను ఒక క్రొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి.
ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు.
నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు.
16 వాటిని గాలిలో విసిరివేస్తావు.
గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది.
అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.
17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు.
కానీ వారికి ఏమీ దొరకవు.
వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి.
నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను.
నేను వాళ్లను విడువను, చావనివ్వను.
18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను.
లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను.
అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను.
ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి.
19 అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి.
దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి.
20 ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు.
ప్రజలు ఈ సంగతులు చూస్తారు.
వారు గ్రహించటం మొదలుబెడతారు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు)
ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.”
అబద్దపు దేవతలకి యెహోవా సవాలు
21 యాకోబు రాజు, యెహోవా చెబుతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం. 22 జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేము జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏమి జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది. 23 ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బ్రతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం.
24 “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలనుకొంటాడు.”
యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేయటం
25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొలిపాను.
సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు.
అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు.
కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.
26 “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు?
ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి.
మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు.
ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు.
మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు.
27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను.
‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి
ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”
28 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను.
వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు.
వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను.
కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు.
29 ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ.
వాళ్లు ఏమీ చేయలేరు.
ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.
యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు
42 “నా సేవకుణ్ణి చూడండి!
నేను అతన్ని బలపరుస్తాను.
నేను ఏర్పరచుకొన్నవాడు అతడే.
అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను.
నా ఆత్మను నేను అతనిలో ఉంచాను.
జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు.
2 అతడు వీధుల్లో కేకలు వేయడు
అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు.
3 అతడు సౌమ్యుడు. అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు.
మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు.
అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు.
4 లోకానికి న్యాయం చేకూర్చేవరకు
అతడు బలహీనం కాడు, నలిగిపోడు.
దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వసిస్తారు.”
ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా
5 యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)
6 “మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను.
నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను.
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం.
నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు.
7 గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు.
అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు.
అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు.
8 “నేను యెహోవాను.
నా పేరు యెహోవా.
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలకు (అబద్ధపు దేవుళ్ళకు) చెందనివ్వను.
9 కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను,
ఆ సంగతులు జరిగాయి.
ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి,
అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.”
దేవునికొక స్తుతి గీతం
10 యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి.
భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా,
సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా,
మహా సముద్రాల్లోని సర్వ ప్రాణులారా,
దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా యెహోవాను స్తుతించండి!
11 అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు
యెహోవాను స్తుతించండి
సెలా నివాసులారా ఆనందంగా పాడండి.
మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి.
12 యెహోవాకు మహిమ ఆపాదించండి.
దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి.
13 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు.
ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు.
ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు.
ఆయన తన శత్రువులను ఓడిస్తాడు.
దేవుడు చాలా ఓర్పుగలవాడు
14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను.
నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను.
కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను.
నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను.
15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను.
అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను.
నదులను నేను పొడి నేలగా చేస్తాను.
నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను.
16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను
ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను.
చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను.
కరకు నేలను నేను చదును చేస్తాను.
నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను.
నా ప్రజలను నేను విడువను.
17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు.
బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు.
ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు.
కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”
దేవుని మాట వినటానికి ఇశ్రాయేలు నిరాకరించింది
18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి.
గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి.
19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు[a] ఎక్కువ గుడ్డివాడు.
నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటివాడు.
నేను ఒడంబడిక చేసుకొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు.
20 ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి.
కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు.
అతడు తన చెవులతో వినగలడు.
కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.”
21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నాడు.
కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు.
22 అయితే ప్రజలను చూడండి
ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు.
యువకులంతా భయపడ్తున్నారు.
వారు చెరలో బంధించబడ్డారు.
మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు.
వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు.
ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు.
“దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు.
23 మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి. 24 యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించుకోలేదు. 25 అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించలేదు.
1 మన తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!
దేవునికి కృతజ్ఞతలు
2 మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. 3 విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న దృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.
4 సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. 5 ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. 6 మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.
7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. 8 దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. 9 మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 10 పరలోకము నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.
© 1997 Bible League International