Old/New Testament
నాయకులు మంచివారిగాను, నీతిమంతులుగాను ఉండాలి
32 నేను చెప్పే విషయాలు విను. ఒక రాజు మంచిని పెంచే విధంగా పాలించాలి. నాయకులు ప్రజలను నడిపించేటప్పుడు వారు న్యాయమైన తీర్మానాలు చేయాలి. 2 ఇలా జరిగితే, అప్పుడు గాలివాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించినట్టుగా ఉంటుంది. వేడి ప్రదేశంలో ఒక పెద్ద బండ చాటున చల్లని నీడలా ఉంటుంది అది. 3 ప్రజలు సహాయం కోసం రాజువైపు తిరుగుతారు, వారు ఆయన చెప్పే మాటలు నిజంగా వింటారు. 4 ఇప్పుడు గందరగోళంలో పడిన మనుష్యులు గ్రహించగలుగుతారు. ఇప్పుడు తేటగా మాట్లాడలేని మనుష్యులు, అప్పుడు తేటగా, వేగంగా మాట్లాడగలుగుతారు. 5 వెర్రివాళ్లు గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని ప్రజలు గౌరవించరు.
6 తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ సంగతులు చెబుతాడు, అతడు చెడ్డపనులు చేయాలని తన మనసులో ఆలోచిస్తాడు. తెలివి తక్కువ వాడు తప్పు పనులు చేయాలనుకొంటాడు. తెలివి తక్కువ వాడు యెహోవాను గూర్చి చెడ్డ మాటలు చెబుతాడు. తెలివి తక్కువ వాడు ఆకలితో ఉన్న వాళ్లను అన్నం తిననీయడు. తెలివి తక్కువ వాడు దప్పిగొన్న వారిని నీళ్లు తాగనివ్వడు. 7 ఆ తెలివి తక్కువ వాడు చెడును సాధనంగా వాడుకొంటాడు. పేద ప్రజల దగ్గర్నుండి సమస్తం దోచుకొనేందుకు అతడు పథకం వేస్తాడు. ఆ తెలివి తక్కువ వాడు పేద ప్రజలను గూర్చి అబద్ధాలు చెబుతాడు. వాని అబద్ధాలు పేదవారికి న్యాయం జరుగకుండా చేస్తాయి.
8 అయితే మంచి నాయకుడు మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు. ఆ మంచి పనులే అతణ్ణి మంచి నాయకుడ్ని చేస్తాయి.
కఠిన సమయాలు వస్తున్నాయి
9 స్త్రీలు కొందరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. మీరు క్షేమం అనుకొంటున్నారు. కానీ మీరు లేచి, నేను చెప్పే మాటలు వినాలి. 10 స్త్రీలారా మీరు ఇప్పుడు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత మీకు కష్టం వస్తుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మీరు కూర్చుకొనేందుకు ద్రాక్షపండ్లు ఉండవు గనుక మీరు ద్రాక్షపండ్లు ఏరుకోరు.
11 స్త్రీలారా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. కానీ మీరు భయపడాలి. స్త్రీలారా, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ మీరు దిగులుపడాలి. మీ అందమైన వస్త్రాలు తీసివేసి, విచార వస్త్రాలు ధరించండి. ఆ బట్టలు మీ నడుములకు చుట్టుకోండి. 12 దుఃఖంతో నిండిన మీ రొమ్ములను ఆ దుఃఖవస్త్రాలతో కప్పుకొనండి. మీ పొలాలు ఖాళీగా ఉన్నాయి గనుక ఏడ్వండి. మీ ద్రాక్ష తోటలు ఒకప్పుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాయి కానీ ఇప్పుడు అవి ఖాళీ. 13 నా ప్రజల భూమి కోసం ఏడ్వండి, ముళ్లకంపలు, గచ్చ పొదలు మాత్రమే అక్కడ పెరుగుతాయి గనుక ఏడ్వండి. పట్టణం కోసం, ఒకప్పుడు ఆనందంతో నిండిన అన్ని గృహాల కోసం ఏడ్వండి.
14 ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివసిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివసిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి.
15-16 దేవుడు పైనుండి తన ఆత్మను మనకు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు దేశంలో మంచి లేదు. అది ఒక అరణ్యంలా ఉంది. కానీ భవిష్యత్తులో ఆ అరణ్యం కర్మెలు దేశంలా ఉంటుంది, అక్కడ న్యాయమైన తీర్పు వుంటుంది. మరియు కర్మెలు పచ్చని అడవిలా ఉంటుంది. అక్కడ మంచితనం ఉంటుంది. 17 ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది. 18 అందమైన శాంతి వనంలో నా ప్రజలు నివసిస్తారు. క్షేమకరమైన గుడారాల్లో నా ప్రజలు నివసిస్తారు. నెమ్మదైన, శాంతస్థలాల్లో వారు నివసిస్తారు.
19 కానీ ఈ సంగతులు జరుగక ముందు అరణ్యం కూలిపోవాలి. ఆ పట్టణం ఓడించబడాలి. 20 మీలో కొంతమంది ప్రతి కాలువ దగ్గరా విత్తనాలు విత్తుతారు. మీ పశువులను, గాడిదలను మీరు స్వేచ్చగా తిరుగ నిస్తారు, తిననిస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు.
దేవుడు తన శక్తిని చూపిస్తాడు
33 మీరు యుద్ధం చేసి ప్రజల దగ్గర్నుండి దొంగిలిస్తారు, ఆ ప్రజలు మాత్రం మీ దగ్గర ఎన్నడూ ఏమీ దొంగిలించలేదు. మీరు ప్రజల మీద దాడిచేస్తారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించ లేదు. కనుక మీరు దొంగిలించటం మాని వేసినప్పుడు ఇతరులు మీ దగ్గర దొంగిలించటం మొదలు పెడ్తారు. మీరు ప్రజల మీద పడటం మానివేసినప్పుడు, ఆ ప్రజలు మీ మీద పడటం మొదలు పెడ్తారు. అప్పుడు మీరంటారు.
2 దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు
“యెహోవా మామీద దయ చూపు నీ సహాయం కోసం మేము కనిపెట్టాం
యెహోవా, ప్రతి ఉదయం మాకు బలం దయచేయి.
మేం కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించు.
3 నీ శక్తిగల స్వరం ప్రజలను భయపెడ్తుంది కనుక వారు నీ దగ్గర్నుండి పారిపోతారు.
నీ మహాత్మ్యం రాజ్యాలనే పారిపోయేట్టు చేస్తుంది.”
4 మీరు యుద్ధంలో వస్తువులు దొంగిలించారు. ఆ వస్తువులు మీ దగ్గర్నుండి తీసుకోబడతాయి. చాలా, చాలామంది వచ్చి మీ ధనాన్ని దోచుకొంటారు. అది మిడతలు వచ్చి మీ పంటలన్నింటినీ తినివేసే సందర్భంలాగా వుంటుంది.
5 యెహోవా ఎంతో గొప్పవాడు. ఆయన మహాఉన్నత స్థలంలో ఉంటాడు. సీయోనును న్యాయంతో, మంచితనంతో యెహోవా నింపుతాడు.
6 యెరూషలేమూ, నీవు దేవుని జ్ఞానంతో, తెలివితో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు రక్షణతో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు యెహోవాను గౌరవిస్తావు. అది నిన్ను ఐశ్వర్యవంతురాలిగా చేస్తుంది. కనుక నీవు కొనసాగుతావు అని నీవు తెలుసుకోవచ్చు.
7 కానీ, విను! బయట దేవదూతలు ఏడుస్తున్నారు. శాంతి సందేశం తీసుకొనివచ్చే ఆ దూతలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు. 8 రోడ్లు నాశనం అయ్యాయి. వీధుల్లో ఎవ్వరూ నడవటం లేదు. ప్రజలు వారు చేసుకున్న ఒడంబడికలను ఉల్లంఘించారు. సాక్షుల రుజువులను అంగీకరించటానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఎవ్వరూ ఇతరులను గౌరవించటంలేదు. 9 దేశం వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి.
10 యెహోవా చెబుతున్నాడు, “ఇప్పుడు నేను లేచి నా మహిమను చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజలకు ప్రముఖుడనవుతాను. 11 ప్రజలారా మీరు పనికి మాలిన పనులు చేశారు. ఆ పనులు గడ్డిలా, గడ్డిపోచలా ఉన్నాయి. అవి దేనికీ పనికిరావు. మీ ఆత్మ అగ్నిలా ఉండి మిమ్మల్ని కాల్చేస్తుంది. 12 మనుష్యుల ఎముకలు సున్నంలా అయ్యేంత వరకు వారు కాల్చబడుతారు. ప్రజలు ముళ్లకంపల్లా, ఎండిపోయిన పొదల్లా త్వరగా కాలిపోతారు.
13 “దూరదేశాల్లో ఉన్న ప్రజలారా నేను చేసిన కార్యాలను గూర్చి వినండి. నాకు దగ్గర్లో వున్న ప్రజలారా, మీరు నా శక్తిని గూర్చి తెలుసుకోండి.”
14 సీయోనులో పాపులు భయపడుతున్నారు. చెడ్డ పనులు చేసేవారు భయంతో వణకుతున్నారు. “మనల్ని నాశనం చేసే ఈ అగ్నిలో నుండి మనలో ఎవరైనా బ్రతకగలమా? శాశ్వతంగా మండుతూ ఉండే ఈ అగ్ని దగ్గర ఎవరు బ్రతకగలరు?” అని వారంటున్నారు.
15 మంచివాళ్లు, నిజాయితీపరులు డబ్బుకోసం ఇతరులను బాధించని వాళ్లు ఆ అగ్నిగుండా బతుకుతారు. ఆ ప్రజలు లంచాలు నిరాకరిస్తారు. ఇతరులను హత్య చేసే పథకాలను గూర్చి వినటానికి గూడ వారు నిరాకరిస్తారు. చెడ్డ పనులు చేసేందుకు వేసిన పథకాలను చూచేందుకు గూడా వారు నిరాకరిస్తారు. 16 ఆ ప్రజలు ఉన్నతమైన స్థలాల్లో క్షేమంగా జీవిస్తారు. ఎత్తయిన బండల కోటలలో వారు భద్రంగా కాపాడబడతారు. ఆ ప్రజలకు ఆహారం, నీళ్లు ఎల్లప్పుడూ ఉంటాయి.
17 రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌందర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు చూస్తారు. 18-19 గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కించిన ఆ గూఢచారులు ఎక్కడ? వాళ్లంతా పోయారు!” అని మీరు అనుకొంటారు.
దేవుడు యెరూషలేమును కాపాడుతాడు
20 మన మతపరమైన పండుగల పట్టణం సీయోనును చూడు. ఆ అందమైన విశ్రాంతి స్థలం యెరూషలేమును చూడు. ఎన్నటికీ కదలని ఒక గుడారంలా ఉంది యెరూషలేము. దానిని తన స్థానంలో ఉంచే మేకులు ఎన్నటికి పెరికి వేయబడవు. దాని తాళ్లు ఎన్నటికీ తెగిపోవు. 21-23 ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు. 24 అక్కడ జీవించే ఏ మనిషీ “నాకు జబ్బు” అని చెప్పడు. అక్కడ నివసించే ప్రజలు పాపాలు క్షమించబడిన ప్రజలు.
1 దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు ప్రభువుయొక్క అపొస్తలుడైన పౌలు నుండి, మరియు మన సోదరుడైన తిమోతి నుండి,
2 విశ్వాసంతో పరిశుద్ధతలో సోదరులుగా క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న కొలొస్సయి పట్టణంలోని పవిత్రులకు, మన తండ్రియైన దేవుడు మీకు శాంతిని, కృపను ప్రసాదించుగాక!
3 మేము మీ గురించి విన్నందుకు మన యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి సర్వదా కృతజ్ఞులము. మేము మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. 4 క్రీస్తు పట్ల మీకున్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమను గురించి మేము విన్నాము. 5 నిజమైన సందేశాన్ని, అంటే సువార్తను మొదటినుండి మీరు విన్నారు. అది రక్షణ కలుగజేస్తుందన్న ఆశ మీలో కలిగింది. మీ విశ్వాసము, ప్రేమ, మీ ఆశపై ఆధారపడి ఉంటాయి. దేవుడు మీ నిరీక్షణను మీకోసం పరలోకంలో భద్రంగా దాచి ఉంచాడు. 6 దైవసందేశాన్ని విని, దేవుని అనుగ్రహాన్ని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకొన్న నాటినుండి మీరు ఫలం పొందారు. అదే విధంగా యిప్పుడు కూడా దేవుడు తన ఆశీస్సులు అందరికీ ప్రసాదిస్తాడు. సువార్త ప్రపంచమంతా వ్యాపిస్తోంది. 7 మీరీ సువార్త “ఎపఫ్రా” ద్వారా విన్నారు. అతడు మాకు ప్రియమైనవాడు. మాతో కలిసి మా పక్షాన విశ్వాసంతో క్రీస్తు సేవ చేస్తున్నవాడు. 8 మీకు పరిశుద్ధాత్మ యిచ్చిన ప్రేమను గురించి అతడు మాకు చెప్పాడు.
9 ఆత్మీయ జ్ఞానము, తనను గురించిన జ్ఞానము, మీకు ప్రసాదించమని మిమ్మల్ని గురించి విన్ననాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి ప్రార్థించాము:
మీకు “దైవేచ్ఛ” ను తెలుసుకొనే జ్ఞానం కలగాలని మా అభిలాష. 10 మీరు ప్రభువు యిచ్ఛానుసారం జీవించాలనీ, అన్ని వేళలా ఆయనకు ఆనందం కలిగించే వాటిని మాత్రమే చేయాలనీ మా అభిలాష. సత్కార్యాలు చేసి ఫలం చూపించండి. దేవుణ్ణి గురించి మీకున్న జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి. 11 సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తినిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది.
12 దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. 13 మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు. 14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు.
క్రీస్తు యొక్క గొప్పతనము
15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.
17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
ఆయనే అన్నిటికీ మూలం.
చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.
19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20 దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.
21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.
23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.
సంఘం కోసం పౌలు పడిన శ్రమ
24 మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది. 25 తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. 27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. 28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము. 29 దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.
© 1997 Bible League International