Old/New Testament
దేవునికొక స్తుతి గీతం
26 ఆ సమయమందు యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు:
యెహోవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక బలమైన పట్టణం ఉంది.
మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి.
2 తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు.
ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు.
3 యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు
నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.
నీయందు విశ్వాసముంచే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.
4 కనుక ఎల్లప్పుడు యెహోవాను విశ్వసించాలి.
నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వసించాలి.
5 అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు.
అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు.
ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు
అది ధూళిలో పడిపోతుంది.
6 అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు.
7 మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం
మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు.
మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి
దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు.
8 కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం.
నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.
9 నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది.
ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది.
దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు
ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు.
10 చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే
వాడు మంచి చేయటం నేర్చుకోడు.
చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు.
ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు.
11 కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే
వారు దానిని చూస్తారు.
యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు.
అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
12 యెహోవా, మేము చేయాలని ప్రయత్నించిన వాటన్నింటినీ చేయటంలో నీదే విజయం.
కనుక మాకు శాంతి ప్రసాదించు.
తన ప్రజలకు దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు
13 యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో మేము ఇతర ప్రభువులను అనుసరించాం.
మేము ఇతర యజమానులకు చెందిన వాళ్లం
కానీ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
14 ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి
ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు
నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు.
మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.
15 నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు
ఇతరులు ఆ దేశాన్ని జయించకుండ నీవు నిలిపివేశావు.
16 యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు
నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు.
నీవు ప్రజలను శిక్షించినప్పుడు
వారు మౌన ప్రార్థనలు నీకు చేస్తారు.
17 యెహోవా, మేం నీతో లేనప్పుడు
మేం ప్రసవవేదన పడుతున్న స్త్రీలా ఉంటాం
ఆమె ఏడుస్తుంది, ప్రసవ బాధ పడుతుంది.
18 అదే విధంగా మాకు బాధ ఉంది
మేము కంటాము, కాని, గాలిని మాత్రమే.
ప్రపంచానికి మేం క్రొత్త మనుష్యుల్ని తయారు చేయం.
దేశానికి మేం రక్షణ కలిగించం
19 కాని యెహోవా చెప్పేదేమంటే,
“నీ ప్రజలు మరణించారు
కానీ వారు మళ్లీ లేస్తారు
నా ప్రజల శరీరాలు
మరణం నుండి లేస్తాయి.
భూమిలోని మృతులు లేచి,
సంతోషిస్తారు.
నిన్ను కప్పియున్న మంచు,
ఒక క్రొత్త రోజు వెలుతురులా ఉంది.
ఒక క్రొత్త కాలం వస్తోందని అది సూచిస్తుంది
ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.”
తీర్పు: బహుమానం లేక శిక్ష
20 నా ప్రజలారా, మీ గదుల్లోకి వెళ్లండి.
తలుపులకు తాళాలు వేసుకోండి.
కొద్దికాలం పాటు మీ గదుల్లో దాక్కోండి.
దేవుని కోపం తగ్గేంతవరకు దాక్కోండి.
21 యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు.
ప్రపంచంలోని మనుష్యులు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు.
చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది
భూమి ఇక ఎన్నటికీ చనిపోయిన వాళ్లను కప్పెట్టదు.
27 ఆ సమయంలో వంకర సర్పమైన మకరానికి ఆయన తీర్పు తీర్చును.
యెహోవా తన ఖడ్గం ప్రయోగిస్తాడు,
కఠినమైన, తన శక్తిగల ఖడ్గంతో ఆయన మకర సర్పాన్ని ఆ మెలికల సర్పాన్ని శిక్షిస్తాడు.
ఆ పెద్ద ప్రాణిని సముద్రం లోనే యెహోవా చంపేస్తాడు.
2 ఆ సమయంలో సంతోషకరమైన ద్రాక్షతోటను గూర్చి ప్రజలు పాటలు పాడుతారు.
3 “యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధతీసుకుంటాను.
సరైన సమయంలో తోటకు నీళ్లు పెడతాను.
రాత్రింబవళ్లు ఆ తోటను నేను కాపాడుతాను.
ఆ తోటకు ఎవ్వరూ హాని చేయరు.
4 నేను కోపంగా లేను.
కానీ యుద్ధంలో ఎవరైనా సరే ముళ్ల పొదల కంచె వేస్తే
అప్పుడు నేను దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను.
5 అయితే ఎవరైనా భద్రత కోసం నా దగ్గరకు వస్తే నాతో సమాధాన పడాలని కోరితే,
అలాంటివాడు వచ్చి నాతో సమాధానపడాలి.
6 ప్రజలు నా దగ్గరకు వస్తారు. మంచి వేరులు గల మొక్కలా యాకోబు బలంగా ఉండేందుకు ఆ ప్రజలు సహాయం చేస్తారు.
వికసించ మొదలు బెట్టిన మొక్కలా ఇశ్రాయేలు ఎదుగునట్లు ఆ ప్రజలు చేస్తారు.
అప్పుడు చెట్ల ఫలాల్లా, ఇశ్రాయేలు పిల్లలతో దేశం నిండిపోతుంది.”
దేవుడు ఇశ్రాయేలును దూరంగా పంపించివేస్తాడు
7 యెహోవా తన ప్రజలను ఎలా శిక్షిస్తాడు? గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెహోవా కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, అనేక మందిని చంపేస్తాడా?
8 యెహోవా తన ప్రజల భయాన్ని వెళ్లగొట్టేసి, వారిలో తనకుగల వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇశ్రాయేలీయులతో యెహోవా కఠినంగా మాట్లాడుతాడు. ఆయన మాటలు ఎడారి వేడి గాడ్పులా మండుతాయి.
9 యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? అతని పాపాలు తీసివేయబడేట్లుగా ఏం సంభవిస్తుంది? ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు ధూళిగా చితుకగొట్టబడతాయి. తప్పు దేవుళ్లను పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు నాశనం చేయబడతాయి.
10 ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి మేస్తాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి. 11 ద్రాక్షవల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు.
ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు.
12 ఆ సమయంలో యెహోవా తన ప్రజలను ఇతరులనుండి ప్రత్యేకించటం ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది దగ్గర ఆయన ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది మొదలు ఈజిప్టు నదివరకు గల తన ప్రజలందరినీ యెహోవా సమావేశ పరుస్తాడు.
మీరు ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరుగా, ఒకే చోట చేర్చబడుతారు. 13 నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగపడతారు.
క్రీస్తు వినయంను అనుకరించుట
2 క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! 2 అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. 3 స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. 4 మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.
నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి
5 యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.
6 ఆయన దేవునితో సమానము.
అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
7 ఆయన అంతా వదులుకొన్నాడు.
మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
8 మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
9 అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!
నక్షత్రాలవలె ప్రకాశించటం
12 నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి. 13 దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.
14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. 15 అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై, నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు. 16 మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని రుజువౌతుంది.
17 మీ విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా రక్తాన్ని బలిగా ధార పోయవలసివస్తే నేను వెనుకాడను. చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా కోరిక. 18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి.
తిమోతిని పంపటం
19 మిమ్మల్ని గురించి తెలిస్తే నాకు కూడా ఆనందం కలుగుతుంది. కనుక తిమోతిని మీ దగ్గరకు పంపే అవకాశం యేసు ప్రభువు త్వరలో కలిగిస్తాడని నిరీక్షిస్తాను. 20 మీ క్షేమం విషయంలో నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి అతను తప్ప నా దగ్గర మరొకడు లేడు. 21 ప్రతి ఒక్కడూ తన స్వార్థం కోసం ఆలోచిస్తాడే కాని యేసు క్రీస్తును గురించి ఆలోచించడు. 22 సువార్త ప్రచారం చెయ్యటానికి అతడు నా కుమారునిలా పని చేసాడు. అలా చేసి తన యోగ్యతను రుజువు చేసుకొన్నాడని మీకు తెలుసు. 23 నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియగానే అతణ్ణి మీ దగ్గరకు పంపటానికి ఎదురు చూస్తున్నాను. 24 నన్ను కూడా త్వరలో మీ దగ్గరకు పంపుతాడనే నమ్మకం నాకు ప్రభువుపట్ల ఉంది.
25 నాకు సహాయం చెయ్యటానికి మీరు ఎపఫ్రొదితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భావిస్తున్నాను. ఎపఫ్రొదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, పని చేసాడు. 26 మిమ్మల్ని చూడాలని, మీ దగ్గరకు రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు జబ్బుతో ఉన్నాడన్న విషయం మీరు విన్నట్లు అతనికి తెలిసి అతడు చాలా చింతిస్తున్నాడు. 27 అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు. 28 అందువల్ల అతణ్ణి మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. అతణ్ణి చూసి మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది. 29 కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. 30 మీరు చేయలేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణానికి తెగించాడు. క్రీస్తు అప్పగించిన పని పూర్తిచేయటం కొరకు మరణించటానికి కూడా అతడు సిద్ధమయ్యాడు.
© 1997 Bible League International