Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 23-25

తూరుకు దేవుని సందేశం

23 తూరును గూర్చి విచారకరమైన సందేశం:

తర్షీషు ఓడలారా, మీరు విచారించండి.
    మీ ఓడరేవు పాడుచేయబడింది.
    (ఈ ఓడల మీద ఉన్న ప్రజలు కిత్తీయుల దేశం నుండి ప్రయాణం చేస్తూఉండగా వారికి ఈ వార్త చెప్పబడింది).

సముద్ర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలారా ఆగండి, దుఃఖించండి.
    తూరు, “సీదోను వ్యాపారి.” సముద్రం పక్కన ఉన్న ఆ పట్టణం సముద్రాల మీదుగా వ్యాపారులను పంపింది,
    ఆ మనుష్యులు మిమ్మల్ని ఐశ్వర్యాలతో నింపారు.
ఆ మనుష్యులు ధాన్యం కోసం వెదుకుతూ సముద్రాల మీద ప్రయాణం చేశారు.
    నైలునది దగ్గర పండే ధాన్యం తూరు మనుష్యులు కొని,
    ఆ ధాన్యాన్ని ఇతర దేశాలకు విక్రయించేవారు.
సీదోనూ, నీవు చాలా దుఃఖించాలి.
    ఎందుకంటే, ఇప్పుడు సముద్రం, సముద్రపు కోట చెబుతున్నాయి.
నాకు పిల్లలు లేరు.
    నాకు ప్రసవవేదన కలగలేదు
    నేను పిల్లలను కనలేదు
    నేను బాల బాలికలను పెంచలేదు.

తూరును గూర్చిన వార్త ఈజిప్టు వింటుంది.
    ఈ వార్త ఈజిప్టును దుఃఖంతో బాధిస్తుంది.
ఓడలారా మీరు తర్షీషుకు తిరిగి రావాలి.
    సముద్రం దగ్గర్లో నివసిస్తున్న ప్రజలారా మీరు విచారించాలి.
గతకాలంలో మీరు తూరు పట్టణాన్ని అనుభవించారు. అనాది నుండీ ఆ పట్టణం పెరుగుతూనే ఉంది.
    ఆ పట్టణం ప్రజలు జీవనోపాది కోసం దూర దేశాలు తిరిగారు.
తూరు పట్టణం చాలామంది నాయకులను తయారు చేసింది.
    ఆ పట్టణపు వ్యాపారులు యువరాజుల్లా ఉన్నారు.
    క్రయ విక్రయ దారులు ఎక్కడ చూచినా గౌరవించబడ్డారు.
కనుక తూరుకు వ్యతిరేకంగా పథకాలు వేసింది ఎవరు?
సర్వశక్తిమంతుడైన యెహోవాయే.
    వాళ్లను ప్రముఖులుగా ఉండకుండా చేయాలని ఆయన నిర్ణయించాడు.
10 తర్షీషు ఓడలారా, మీరు తిరిగి మీ దేశం వెళ్లిపోండి.
    సముద్రం ఒక చిన్న నదిలా దాటండి.
    మిమ్మల్ని ఇప్పుడు ఆపు చేయడు.
11 యెహోవా సముద్రం మీద తన హస్తం చాపాడు.
    తూరుకు విరోధంగా యుద్ధం చేసేందుకు యెహోవా రాజ్యాలను సమకూరుస్తున్నాడు.
తన భద్రతా స్థలం తూరును నాశనం చేయమని
    యెహోవా కనానుకు ఆదేశిస్తున్నాడు.
12 “సీదోను కన్యా[a] నీవు పాడు చేయబడతావు
    నీవు ఇంకెంత మాత్రం ఆనందించవు” అని యెహోవా చెబుతున్నాడు.
అయితే తూరు ప్రజలు, “కిత్తీము మాకు సహాయం చేస్తుంది” అంటున్నారు.
    కానీ మీరు సముద్రం దాటి కీత్తీము వెళ్తే అక్కడ మీకు విశ్రాంతి స్థలం దొరకదు.
13 అందుచేత తూరు ప్రజలు, “బబులోను ప్రజలు మాకు సహాయం చేస్తారు” అంటున్నారు.
    కానీ కల్దీయుల దేశం చూడండి. బబులోను ఇప్పుడు ఒక దేశం కాదు.
బబులోను మీద అష్షూరు దాడి చేసి దాని చుట్టూ యుద్ధ గోపురాలు కట్టింది.
    అందమైన గృహాలనుండి సైన్యం సమస్తం దోచుకొంది.
    అష్షూరు బబులోనును అడవి మృగాలకు స్థావరంగా చేసింది బబులోనును వారు శిథిలాలుగా మార్చేశారు.
14 అందుచేత, తర్షీషు ఓడలారా, దుఃఖించండి
    మీ క్షేమ స్థానం (తూరు) నాశనం చేయబడుతుంది.

15 ప్రజలు తూరును డెబ్భయి సంవత్సరాలపాటు మరచిపోతారు. (అది ఒక రాజు పరిపాలనా కాలవ్యవధి) డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు ఈ పాటలోని వేశ్యలా ఉంటుంది.

16 ప్రజలు మరచిన ఓ ఆడదానా,
    నీ స్వర మండలం తీసుకొని పట్టణంలో నడువు.
నీ పాటను చక్కగా వాయించు నీ పాటను తరచుగా పాడు.
    అప్పుడు ప్రజలు నిన్ను జ్ఞాపకం ఉంచుకొంటారు.

17 డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు విషయం యెహోవా పునః పరిశీలిస్తాడు, ఆయన దానికి తన నిర్ణయం తెలియజేస్తాడు. తూరు మళ్లీ వ్యాపారం చేస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటికీ తూరు ఒక వేశ్యలా ఉంటుంది. 18 కాని తూరు తాను సంపాదించిన ధనం ఉంచుకోదు. తూరు తన వ్యాపారం ద్వారా సంపాదించిన ధనం యెహోవా కోసం దాచబడుతుంది. యెహోవాను సేవించే వారికి ఆ ధనాన్ని తూరు ఇస్తుంది. కనుక యెహోవా సేవకులు తృప్తి పడేంతవరకు భోజనం చేస్తారు, మంచి దుస్తులు ధరిస్తారు.

దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు

24 చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు. ఆ కాలంలో సామాన్య ప్రజలు యాజకులు ఒక్కటే, బానిసలు, యజమానులు ఒక్కటే. ఆడ బానిసలు, యజమానురాండ్రు ఒక్కటే. అమ్మేవారు కొనేవారు ఒక్కటే. అప్పు ఇచ్చే వాళ్లు, పుచ్చుకొనే వాళ్లు ఒక్కటే. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీకి తీసుకొనేవారు ఒక్కటే. ప్రజలంతా దేశంలో నుండి వెళ్లగొట్టబడతారు. సంపద దోచుకోబడుతుంది. యెహోవా ఆదేశించాడు గనుక ఇది జరుగుతుంది. దేశం ఖాళీగా దుఃఖంగా ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. ఈ దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు అవుతారు.

దేశంలోని ప్రజలు దేశాన్ని మైల చేసారు. ఇది ఎలా జరిగింది? ప్రజలు దేవుని ఉపదేశాలకు విరోధంగా తప్పుడు పనులు చేశారు. దేవుని చట్టాలకు ప్రజలు విధేయులు కాలేదు. ప్రజలు చాలాకాలం క్రిందట దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ ఆ ప్రజలే దేవునితో గల ఒడంబడికను ఉల్లంఘించారు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు తప్పుచేసిన అపరాధులు. అందుచేత దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. ప్రజలు శిక్షించబడతారు. కొద్దిమంది ప్రజలు మాత్రమే బ్రతుకుతారు.

ద్రాక్షవల్లులు చస్తున్నాయి. క్రొత్త ద్రాక్షరసం చెడి పోయింది. గతంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు విచారంగా ఉన్నారు. ప్రజలు వారి ఆనందం ప్రదర్శించటం మానివేశారు. ఆనంద ధ్వనులన్నీ ఆగిపోయాయి. సితారా, మృదంగ సంగీత సంతోషం సమసిపోయింది. ప్రజలు వారి ద్రాక్షమద్యం తాగేటప్పుడు సంతోషంగా పాటలు పాడారు. మద్యం తాగేవాడికి దాని రుచి ఇప్పుడు చేదుగా ఉంది.

10 “పూర్తి గందరగోళం” అనేది ఈ పట్టణానికి సరిపోయే మంచి పేరు. పట్టణం నాశనం చేయబడింది. ప్రజలు ఇళ్లలో ప్రవేశించలేరు. ద్వారాలు బంధించబడ్డాయి. 11 ప్రజలు ఇంకా బజారుల్లో ద్రాక్షమద్యం కోసం అడుగుతున్నారు. కానీ సంతోషం అంతా పోయింది. ఆనందం దూరంగా తీసుకుపోబడింది. 12 పట్టణానికి నాశనం మాత్రమే మిగిలింది. చివరికి తలుపులు కూడా చితుక గొట్టబడ్డాయి.

13 కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు.
    కానీ చెట్లకు కొన్ని ఒలీవ పండ్లే మిగిలి ఉన్నాయి.
రాజ్యాల మధ్య ఈ దేశానికి కూడ అలానే ఉంటుంది.
14 విడిచి పెట్టబడిన ప్రజలు కేకలు వేయటం మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంటె గట్టిగా కేకలు వేస్తారు
    యెహోవా గొప్పతనంవల్ల ప్రజలు సంతోషిస్తారు.
15 ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న ప్రజలారా యెహోవాను స్తుతించండి!
    దూర దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి!
    యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.”
16 భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు స్తుతి కీర్తనలు మనం వింటాము.
    ఈ కీర్తనలు మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి.
కానీ నేనంటాను: “చాలు,
    నాకు సరిపోయింది!
నేను చూస్తున్న సంగతులు భయంకరం.
    దేశ ద్రోహులు ప్రజలమీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు.”

17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది.
    వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి.
18 ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు.
    వారు భయపడిపోతారు.
కొంతమంది ప్రజలు పారిపోతారు.
    కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు
వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు.
    కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు.
పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి.
    వరదలు మొదలవుతాయి.
    భూమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
19 భూకంపాలు వస్తాయి.
    భూమి పగిలి తెరచుకొంటుంది.
20 లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి.
    అందుచేత భూమి ఆ భారం క్రింద పడిపోతుంది.
ప్రాచీన గృహంలా భూమి వణుకుతుంది
    త్రాగుబోతు వాడిలా భూమి పడిపోతుంది.
    భూమి ఇక కొనసాగలేదు.

21 ఆ సమయంలో, పరలోక సైన్యాలకు
    పరలోకంలోను భూరాజులకు భూలోకంలోను
    యెహోవా తీర్పు తీరుస్తాడు.
22 ఎందరెందరో ప్రజలు ఒకటిగా సమావేశం చేయబడతారు.
    కొంతమంది ప్రజలు గోతిలో బంధించబడ్డారు.
    వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు.
    కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు తీర్చబడుతుంది.
23 యెహోవా యెరూషలేములో సీయోను కొండమీద రాజుగా పాలిస్తాడు.
    పెద్దల యెదుట ఆయన మహిమ ఉంటుంది.
    చంద్రుడు సిగ్గుపడి, సూర్యుడు అవమానం పొందే అంత ప్రకాశమానంగా ఉంటుంది ఆయన మహిమ.

దేవునికి స్తుతి గీతం

25 యెహోవా, నీవు నా దేవుడివి
నిన్ను నేను ఘనపరుస్తాను, నీ నామం స్తుతిస్తాను.
    అద్భుతమైన కార్యాలు నీవు చేసావు.
చాలాకాలం క్రిందట నీవు చెప్పిన మాటలు పూర్తిగా సత్యము.
    నీవు జరుగుతుందని చెప్పినట్టు సమస్తం జరిగింది.
పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీయమైన కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం.
    కానీ ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే
విదేశీ భవనం నాశనం చేయబడింది.
    అది ఎన్నటికీ కట్టబడదు.
బలమైన రాజ్యాల ప్రజలు నిన్ను ఘనపరుస్తారు.
    బలమైన పట్టణాల బలాఢ్యులు నీకు భయపడతారు.
యెహోవా, అక్కరలో ఉన్న పేద ప్రజలకు నీవు క్షేమ స్థానంగా ఉన్నావు.
    అనేక సమస్యలు ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. కానీ నీవు వారిని కాపాడుతావు.
    యెహోవా, నీవు వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే గృహంలా ఉన్నావు.
కష్టాలు భయంకర గాలుల్లో, వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి పోతుంది,
    కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ తగలదు.
శత్రువులు కేకలు వేసి శబ్దం చేస్తారు. భయంకర శత్రువులు సవాళ్లు విసరుతారు.
    అయితే దేవా, నీవు వారిని ఆపుజేస్తావు. వేడి, పొడి కాలంలో వేడి భూమిని నిస్సారం చేస్తుంది.
అదే విధంగా నీవు శత్రువులకంటె బలం ఉన్నవాడివి దట్టమైన మేఘాలు వేసవి వేడిని ఆపుజేస్తాయి.
    అదే విధంగా, భయంకర శత్రువుల కేకలు నీవు ఆపుజేస్తావు.

తన సేవకులకు, దేవుని విందు

ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.

కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు “మరణం” అని పిలువబడుతుంది కానీ మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా జరుగుతుంది.

ఆ సమయంలో ప్రజలు అంటారు,
    “ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడు.
మనం కనిపెడ్తున్నవాడు ఈయనే.
    మనల్ని రక్షించటానికి ఈయన వచ్చాడు.
మనం మన యెహోవా కోసం కనిపెడుతున్నాం.
    అందుచేత యెహోవా మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, సంతోషంగా ఉందాం.”
10 యెహోవా హస్తం (శక్తి) ఈ కొండ మీద ఉంది.
    మరియు మోయాబు ఓడించబడుతుంది.
యెహోవా శత్రువును అణగ త్రొక్కుతాడు.
    చెత్త కుప్ప మీద వరిగడ్డిపై నడిచినట్టుగా అది ఉంటుంది.
11 ఈత కొట్టేవానిలా యెహోవా తన చేతులు చాపుతాడు
    అప్పుడు ప్రజలు అతిశయించే వాటన్నిటినీ యెహోవా సమకూరుస్తాడు
వారు తయారు చేసిన అందమైన వాటన్నింటినీ యెహోవా సమకూరుస్తాడు.
    యెహోవా వాటన్నింటినీ క్రింద పారవేస్తాడు
12 ప్రజల ఎత్తయిన గోడల, భద్రతా స్థలాలు అన్నింటిని యెహోవా నాశనం చేస్తాడు.
    యెహోవా వాటిని నేల ధూళిలో పార వేస్తాడు.

ఫిలిప్పీయులకు 1

యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతియు, యేసు క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరిచారకులకు వ్రాయునది ఏమనగా:

మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించును గాక!

కృతజ్ఞత, ప్రార్థన

నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది.

మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను.

ఇదే నా ప్రార్థన:

మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. 10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. 11 మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది.

పౌలు సంకెళ్ళు, సువార్త

12 సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవసందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడతాయని మీరు గమనించాలి. 13 ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే. 14 ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవసందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు.

15 కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. 16 వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. 17 మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది.

ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను. 19 ఎందుకంటే మీ ప్రార్థనవల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. 20 నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు. 21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. 22 నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. 23 ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం. 24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. 25 ఇది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను బ్రతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం కోసం పని చేస్తాను. 26 నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను.

27 ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్తవల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి. 28 మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు. 29 ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. 30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International