Old/New Testament
అష్షూరు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తుంది
20 అష్షూరు రాజు సర్గోను. అష్డోదు మీద యుద్ధం చేయటానికి సర్గోను తర్తానును ఆ పట్టణం మీదికి పంపించాడు. తర్తాను అక్కడికి వెళ్లి ఆ పట్టణాన్ని పట్టుకొన్నాడు. 2 ఆ సమయంలో ఆమోజు కుమారుడు యెషయా ద్వారా యెహోవా మాట్లాడాడు: “వెళ్లు, నీ నడుముకు కట్టిన దుఃఖవస్త్రం తీసివేయి. నీ పాదాల జోళ్లు తీసివేయి” అని యెహోవా చెప్పాడు. యెషయా యెహోవాకు విధేయుడయ్యాడు. మరియు యెషయా బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా అక్కడ అంతా తిరిగాడు. 3 అప్పుడు యెహోవా చెప్పాడు: “బట్టలు లేకుండ, చెప్పులు లేకుండా యెషయా మూడు సంవత్సరాలు తిరిగాడు. ఇది ఈజిప్టు, ఇథియోపియాకు సంకేతం. 4 అష్షూరు రాజు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తాడు. అష్షూరు బందీలను పట్టుకొని, వారి దేశాల నుండి తీసుకొనిపోతాడు. పెద్దవాళ్లు, యువతీ యువకులు బట్టలు చెప్పులు లేకుండానే తీసుకొని పోబడతారు. వారు సాంతం నగ్నంగా ఉంటారు. ఈజిప్టు ప్రజలు అవమానించబడతారు. 5 ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపుచూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు ఔన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ప్రజలు అవమానించబడతారు.”
6 సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రజలు, “ఆ దేశాలు మాకు సహాయం చేస్తాయని వాటిని నమ్ముకొన్నాము. అవి మమ్మల్ని అష్షూరు రాజు నుండి విమోచిస్తాయని మేం వాటి దగ్గరకు పరుగెత్తాం. కానీ వాటిని చూడండి. ఆ దేశాలు పట్టుకోబడ్డాయి, మరి మనం ఎలా తప్పించుకోగలుగుతాం?” అని అంటారు.
బబులోనుకు దేవుని సందేశం
21 సముద్రతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి విచారకరమైన సందేశం:
అరణ్యం నుండి ఏదో వస్తోంది? నెగెవ్‌నుండి వీచే గాలిలా అది వస్తోంది.
అది ఒక భయంకర దేశం నుండి వస్తోంది.
2 జరుగబోయే దారుణమైన ఒక సంగతి నేను చూసాను.
దేశద్రోహులు నీకు విరోధంగా లేవటం నేను చూశాను.
ప్రజలు నీ ఐశ్వర్యం తీసుకోవటం నేను చూశాను.
ఏలాము, వెళ్లి ఆ ప్రజలతో యుద్ధం చేయి.
మాద్యా, పట్టణం చుట్టూరా నీ సైన్యాలను ఉంచి, దాన్ని జయించు.
ఆ పట్టణంలో చెడు సంగతులన్నింటినీ నేను అంతం చేస్తాను.
3 ఆ భయంకర విషయాలు నేను చూశాను, ఇప్పుడు నేను భయపడ్తున్నాను.
నా భయంవల్ల నా కడుపులో దేవేస్తోంది. ఆ బాధ ప్రసవవేదనలా ఉంది.
నేను వినే విషయాలు నన్ను చాలా భయపెట్టేస్తాయి.
నేను చూచే విషయాలు నన్ను భయంతో వణకిస్తాయి.
4 నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకిపోతున్నాను.
సంతోషకరమైన నా సాయంపూట, భయం పుట్టే రాత్రిగా తయారయింది.
5 అంతా బాగానే వుందని ప్రజలు తలస్తున్నారు. ప్రజలు అంటారు:
“బల్ల సిద్ధం చేయండి!
బల్లమీద బట్ట పరచండి! తినండి! తాగండి!”
కానీ ప్రజలు, “నాయకులారా, లేవండి,
యుద్ధానికి సిద్ధపడండి” అని చెప్పాలి.
6 ఎందుకంటే నా ప్రభువు, నాతో ఈ విషయాలు చెప్పాడు: “వెళ్లి, పట్టణాన్ని కాపాడేందుకు ఒక మనిషికోసం చూడు. 7 కావలివాడు గుర్రాల మీద సైనికుల్ని, గాడిదలు, లేక ఒంటెలను చూస్తే కావలివాడు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినాలి.”
8 అప్పుడు ఆ కావలివాడు సింహం అనే హెచ్చరిక మాట గట్టిగా చెప్పాలి. కావలివాడు యెహోవాతో చెప్పాడు:
“నా ప్రభూ! ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద ఉన్నాను.
ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే ఉన్నాను, కానీ
9 అదిగో, వాళ్లు వచ్చేస్తున్నారు, బారులుతీరిన మనుష్యులు, గుర్రాల మీద సైనికులు నాకు కనబడుతున్నారు.”
అప్పుడు పురుషుల్లో ఒకడు అన్నాడు:
“బబులోను ఓడించబడింది.
బబులోను నేల మట్టంగా కూలిపోయింది.
దాని అబద్ధ దేవుళ్ల విగ్రహాలన్నీ
నేలకు కొట్టబడ్డాయి, ముక్కలు ముక్కలుగా విరిగి పోయాయి.”
10 యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.”
ఎదోముకు దేవుని సందేశం
11 దూమాను గూర్చిన విచారకరమైన సందేశం:
శేయీరునుండి ఎవరో నన్ను పిలిచి అడుగుతున్నారు,
“కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?
కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?”
12 కావలివాడు జవాబిచ్చాడు,
“ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది.
నీవు అడగాల్సింది ఏమైనా ఉంటే
తిరిగి వచ్చి అడుగుము.”
అరేబియాకు దేవుని సందేశం
13 అరేబియాను గూర్చి విచారకరమైన సందేశం:
దెదానునుండి వచ్చిన ఒంటెల ప్రయాణీకులు
అరబి ఎడారిలో కొన్ని చెట్ల దగ్గర రాత్రి గడిపారు.
14 దాహంతో ఉన్న కొందరు ప్రయాణీకులకు వారు నీళ్లు ఇచ్చారు.
ప్రయాణం చేస్తున్న కొందరు ప్రజలకు తేమా ప్రజలు భోజనం పెట్టారు
15 చంపడానికి సిద్ధంగా ఉన్న కత్తులనుండి
ఆ ప్రజలు పారిపోతూ ఉన్నారు.
గురిపెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న బాణాలనుండి
వారు పారిపోతున్నారు.
కష్టతరమైన యుద్ధంనుండి
వారు పారిపోతున్నారు.
16 ఆ సంగతులు జరుగుతాయని నా ప్రభువైన యెహోవా నాతో చెప్పాడు: “ఒక్క సంవత్సరంలో (కూలివాని కాలమానం ప్రకారం) కేదారు ఘనత అంతా పోతుంది. 17 ఆ సమయంలో కేదారు మహా వీరుల్లో కొద్దిమంది విలుకాండ్రు మాత్రమే బ్రతికి ఉంటారు.” ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఈ సంగతులు నాకు చెప్పాడు.
యెరూషలేముకు దేవుని సందేశం
22 దర్శన లోయను గూర్చిన విచారకరమైన సందేశం:
ప్రజలారా మీకు ఏమయింది?
మీరు ఎందుకు మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు?
2 గత కాలంలో ఈ పట్టణం చాలా కలవరంతో నిండి ఉండేది. ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్లాసంగా ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
నీ ప్రజలు చంపి వేయబడ్డారు.
కానీ కత్తులతో కాదు.
ప్రజలు మరణించారు
కానీ యుద్ధం చేస్తూ కాదు.
3 మీ నాయకులంతా ఒక్కుమ్మడిగా పారి పోయారు
కానీ వాళ్లంతా బాణాలు లేకుండానే బంధించబడ్డారు.
నాయకులంతా కలిసి దూరంగా పారిపోయారు.
కానీ వాళ్లు బంధించబడ్డారు.
4 అందుకే నేనంటాను, “నా వైపు చూడవద్దు!
నన్ను ఏడ్వనివ్వండి.
యెరూషలేము నాశనం గూర్చి నన్ను ఆదరించాలని పరుగెత్తి రాకండి.”
5 యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు తొక్కుకుంటారు. పట్టణ ప్రాకారాలు కూలగొట్ట బడతాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు. 6 ఏలాము గుర్రాల సైనికులు వారి బాణాల పొదిని తీసుకొని యుద్ధానికీ స్వారీ చేస్తారు. కీరుప్రజలు వారి డాళ్లతో శబ్దాలు చేస్తారు. 7 సైన్యాలు మీ ప్రత్యేక లోయలో కలుసుకొంటాయి. లోయంతా రథాలతో నిండిపోతుంది. గుర్రాల సైనికులు పట్టణ ద్వారాల ముందు ఉంటారు. 8 యూదా వారు అరణ్య భవనంలో దాచుకొన్న వారి ఆయుధాలను ఆ సమయంలో ప్రయోగించాలని కోరుకొంటారు. యూదాను కాపాడుతున్న గోడలను శత్రువు కూలగొట్టేస్తాడు.
9-11 దావీదు పట్టణపు గోడలు బీటలు వారటం మొదలవుతుంది, ఆ బీటలు మీరు చూస్తారు. కనుక మీరు ఇళ్లను లెక్కబెట్టి, ఆ ఇండ్ల రాళ్లను గోడలు బాగుచేయటానికి ఉపయోగిస్తారు. పాత కాలువ నీళ్లు నిల్వచేయటానికి రెండు గోడల మధ్య మీరు ఖాళీ ఉంచుతారు, మీరు నీటిని నిల్వచేస్తారు.
ఇదంతా మిమ్మల్ని మీరు కాపాడుకొనేందుకు చేస్తారు. కానీ వీటన్నింటినీ చేసిన దేవుణ్ణి మీరు నమ్ముకోరు. వీటన్నింటినీ చాలకాలం క్రిందట చేసిన వానిని (దేవుణ్ణి) మీరు చూడరు. 12 కనుక నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలను ఏడ్చి, చనిపోయిన వారి స్నేహితుల కోసం దుఃఖంగా ఉండమని చెబుతాడు. ప్రజలు గుండ్లు గీసికొని, విచార సూచక వస్త్రాలు ధరిస్తారు. 13 అయితే చూడండి, ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇలా అంటున్నారు:
మనం వేడుక చేసుకొందాం పశువుల్ని,
గొర్రెల్ని వధించండి. మీరు భోజనం తిని, ద్రాక్షరసం త్రాగండి
తినండి, త్రాగండి, ఎందుకంటె రేపు మనం చస్తాం.
14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: “మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం క్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
షెబ్నాకు దేవుని సందేశం
15 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు: “ఆ సేవక షెబ్నా దగ్గరకు వెళ్లు. ఆ సేవకుడు భవనం అధికారి. 16 నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?” అని ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.
17-18 “ఓ మనిషీ, యెహోవా నిన్ను చితక గొట్టేస్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుట్టేసి, చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరోదేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.”
యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో నీ రథాలు ఎన్నదగినవిగా కనబడవు. 19 ఇక్కడి నీ ప్రముఖ పదవినుండి నిన్ను నేను వెళ్లగొడతాను. నీ ప్రముఖ పదవినుండి, నీ క్రొత్త పాలకుడు నిన్ను తీసుకొని వెళ్లిపోతాడు. 20 ఆ సమయంలో హిల్కీయా కుమారుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను. 21 నేను నీ అంగీ తీసి ఆ సేవకుని మీద వేస్తాను. నీ నడికట్టు అతనికి ఇస్తాను. నీ ముఖ్య పదవి అతనికి ఇస్తాను. యెరూషలేము ప్రజలకు, యూదా వంశానికి ఈ సేవకుడు ఒక తండ్రిలా ఉంటాడు.
22 “దావీదు ఇంటి తాళపు చెవిని అతని మెడలో నేను కడతాను. అతడు ఒక ద్వారం తెరిస్తే, అది తెరచుకొనే ఉంటుంది. ఏ మనిషీ దాన్ని మూసి వేయలేడు. అతడు ఒక ద్వారం మూసివేస్తే, ఆ ద్వారం మూసికొనే ఉంటుంది. ఏ మనిషీ దానిని తెరవలేడు. ఆ సేవకుడు తన తండ్రి ఇంటిలో ఘనమైన పీఠంలా ఉంటాడు. 23 గట్టిచెక్కకు కొట్టబడిన మేకులా అతణ్ణి నేను బలంగా చేస్తాను. 24 అతని తండ్రి ఇంటిలో ఘనమైన వాటిని, గొప్పవాటిని నేను అతని మీద వేలాడదీస్తాను. పెద్దలు, పిల్లలు అందరూ అతని మీద ఆధారపడతారు. ఆ మనుష్యులు ఆయన మీద వేలాడుతోన్న చిన్న పాత్రల్లా, పెద్ద నీళ్ల చెంబుల్లా ఉంటారు.
25 “ఆ సమయంలో, ప్రస్తుతం గట్టి చెక్కకు కొట్టబడిన మేకు (షెబ్నా) బలహీనమవుతుంది, విరిగిపోతుంది. ఆ మేకు నేలమీద పడిపోతుంది, ఆ మేకుకు వేలాడుతున్న వస్తువులన్నీ నాశనం అవుతాయి. అప్పుడు, ఈ సందేశంలో నేను చెప్పిన సంగతులు అన్నీ సంభవిస్తాయి.” (యెహోవా చెప్పాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి.)
తల్లిదండ్రుల్ని గౌరవించండి
6 బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని, 2 “మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి”(A) అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. 3 “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”(B)
4 తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభువు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు బోధించి, అందులో శిక్షణనిచ్చి వాళ్ళను పెంచాలి.
బానిసలు, యజమానులు
5 బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చెయ్యాలి. 6 వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చెయ్యాలి. మీరు క్రీస్తు బానిసలు. కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చెయ్యండి. 7 సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి. 8 ప్రభువు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే. లేక యజమాని అయినా సరే. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
9 యజమానులు బానిసలపట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు.
దేవుడు యిచ్చిన ఆయుధాలు
10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.
14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.
19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.
చివరి వందనాలు
21 ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడు, మన ప్రియ సోదరుడు అయిన “తుకికు” మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో తెలుస్తుంది. 22 మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని మరియు అతడు మీకు ప్రోత్సాహం కలిగించాలని అతణ్ణి నేను మీ దగ్గరకు పంపుతున్నాను.
23 సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక! 24 మన యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక!
© 1997 Bible League International