Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 17-19

సిరియాకు దేవుని సందేశం

17 ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు ఈ సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు:

“దమస్కు ఇప్పుడు పట్టణం. కాని దమస్కు నాశనం చేయబడుతుంది.
    దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి.
ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు.
    ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి.
    వాటిని పట్టించుకొనేవాడు ఎవ్వడూ ఉండడు.
ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి.
    దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది.
ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.”
    ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు.

ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఐశ్వర్యం అంతా పోతుంది.
    వ్యాధి మూలంగా చాలా బరువు తగ్గిపోయిన మనిషిలా యాకోబు ఉంటాడు.

ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు.

ఆ సమయం, ప్రజలు ఒలీవ పండ్లు కోసే సమయంలా ఉంటుంది. ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. అయితే సాధారణంగా చెట్లకొమ్మలకు కొన్ని ఒలీవ పండ్లు మిగిలిపోతాయి. కొన్ని పై కొమ్మలకు నాలుగైదు ఒలీవ పండ్లు మిగిలి పోతాయి. ఆ పట్టణాలకు గూడ అలానే ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.

ఆ సమయంలో ప్రజలు వారిని చేసిన దేవునివైపు చూస్తారు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని చూస్తాయి. ప్రజలు, వారు చేసిన గొప్ప వాటిని నమ్ముకోరు. అబద్ధపు దేవుళ్ల కోసం వారు తయారు చేసిన ప్రత్యేక తోటలకు, బలిపీఠాలకు వారు వెళ్లరు. ఆ కాలంలో కోటలుగల పట్టణాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ పట్టణాలు, ఆ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు రాకముందు ఉన్న కొండలు, అడవుల్లా ఉంటాయి. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయేవారు. భవిష్యత్తులో దేశం మళ్లీ ఖాళీగా ఉంటుంది. 10 మిమ్మల్ని రక్షించే దేవుణ్ణి మీరు మరచిపోయారు గనుక ఇలా జరుగుతుంది. దేవుడే మీ భద్రతా స్థానం అని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు.

చాలా దూర స్థలాల నుండి మీరు కొన్ని మంచి ద్రాక్షా వల్లులను తెచ్చి నాటవచ్చును గాని ఆ మొక్కలు ఎదగవు. 11 ఒకనాడు మీరు మీ ద్రాక్ష వల్లులను నాటి, వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోతకాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపేస్తుంది.

12 ఎంతెంతో మంది ప్రజలు చెప్పేది విను.
    సముద్ర ఘోషలా వారు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఘోష విను. ఆ ఏడుపు సముద్రపు ఘోషలా ఉంది.
సముద్రంలో రెండు అలలు ఢీకొన్న ఘోషలా ఉంది.
13 ప్రజలు ఆ అలల్లా ఉంటారు.
    దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు.
ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు.
14 ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు.
    తెల్లవారే సరికి ఏమీ మిగలదు.
కనుక మన శత్రువులకు ఏమీ లభించదు.
    వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు.

ఇథియోపియాకు దేవుని సందేశం

18 ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు. ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది.

వేగంగా పోయే సందేశహరులు,
    ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు.
    (ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం.
వారు బలంగల రాజ్యం.
    వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది.
    నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు).
వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి.
    ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు.
ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు.
    ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు.
యుద్ధానికి ముందు ఊదే శంఖంలా
    వారు దీనిని తేటగా వింటారు.

యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయబడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను. అందమైన ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు. కొండ పక్షులు, అడవి జంతువులు తినటానికి ఆ ద్రాక్ష తీగలు విడిచిపెట్టబడతాయి. వేసవిలో ఆ ద్రాక్షతీగల మీద పక్షులు నివాసం ఉంటాయి. ఆ చలికాలం అడవి జంతువులు ఆ ద్రాక్షతీగలను తింటాయి.”

ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.

ఈజిప్టుకు దేవుని సందేశం

19 చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది.

దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి. ఈజిప్టు ప్రజలు గందరగోళమవుతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం.” సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు.”

నైలునది ఎండిపోతుంది. నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి. నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి.

“నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది. బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు. 10 నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.

11 “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.” 12 ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే.

13 సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు. 14 ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు. 15 ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్మలు, కాండాలు.”)[a]

16 ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు. 17 యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి. 18 ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం”[b] అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు.

19 ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది. 20 సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.

21 ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. 22 ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు).

23 ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది. 24 ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం. 25 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు.

ఎఫెసీయులకు 5:17-33

17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.

భార్యాభర్తలు

21 మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి.

22 స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి. 23 క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త భార్యకు శిరస్సులాంటివాడు. 24 సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి.

25 క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. 26 క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. 27 దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు.

28 అదే విధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకొన్నదానితో సమానము. 29 సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ రక్షించుకొంటారు. 30 అదే విధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. 31 “ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.”(A) 32 ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. 33 ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International